*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*
*అంతుపట్టని అంతరంగం..*
*(అరవై ఒకటవ రోజు)*
శ్రీ స్వామివారు ప్రాణత్యాగం చేయడానికే నిశ్చయించుకున్నారని శ్రీధరరావు దంపతులు నిర్ణయించుకున్నారు..శ్రీ స్వామివారి ఆశ్రమం నుంచి తిరిగివచ్చిన తరువాత..ప్రభావతి గారు దుఃఖం ఆపుకోలేక పోయారు.."అమ్మా..నన్ను నీ పెద్ద కుమారుడిగా భావించుకో.." అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలు ఆవిడ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి..ఆమాటే శ్రీధరరావు గారితో చెప్పుకొని కళ్లనీళ్లు పెట్టుకున్నారు..
"ప్రభావతీ..సాధకులు.. సన్యాసులు.. అవధూతలు..భవబంధాలకు దూరంగా ఉంటారు..వారు తాము ఈ జన్మలో తమకు నిర్దేశించిన కార్యాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు..మనబోటి గృహస్థులం మాత్రం ఈ లంపటం లోంచి బైటపడలేము..మనసు స్థిర పరచుకో..మనమూ ఏ వార్త వినడానికైనా సిద్ధపడి ఉండాలి..ఆ మహనీయుడి సాంగత్యం మనకు ఇంతకాలం ప్రాప్తి!..అదే ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకుందాము.." అని ఊరడించారు.. ప్రక్కరోజు నుంచి ఆ దంపతులు తమ పనుల్లో తాము మునిగిపోయారు..
ఆ మరుసటి రోజు సాయంత్రం..శ్రీ స్వామివారు ఏప్రిల్ 30 వతేదీనాడు తనను కలువమని శ్రీధరరావు గారికి చెప్పి పంపారు..సరిగ్గా నాలుగు రోజుల గడువుంది 30 వ తేదీకి..ఇన్నాళ్ల తమ పరిచయం లో శ్రీ స్వామివారు ప్రత్యేకంగా ఇలా తేదీ చెప్పి ఆరోజే కలువమని చెప్పలేదు..ఏ వార్త వినాల్సి వస్తుందో అని కొద్దిగా అయోమయానికి గురయ్యారు ప్రభావతి శ్రీధరరావు గార్లు ..సరే!..అంతా భగవదేచ్ఛ!..జరగాల్సింది జరుగుతుంది..అనుకోని ఊరుకున్నారు..
ఈలోపల శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు ఒక ఉత్తరం వ్రాసారు తాను వ్రాసిన "సాయి లీలామృతం" గ్రంధాన్ని పంపుతున్నాననీ..ఆ గ్రంధాన్ని
పారాయణం చేసి అభిప్రాయం తెలుపమని..ఆధ్యాత్మిక గ్రంథ రచనలో తమకు సహకరించమని.. ప్రభావతి గారికి ఆ ఉత్తరం ద్వారా కోరారు..ప్రభావతి గారు తమ జవాబులో..శ్రీ స్వామివారి గురించి వివరంగా తెలియచేసి..తానిప్పుడు రచనలు చెయ్యడం దాదాపుగా మానుకొన్నాననీ..సాయిలీలామృతాన్ని పారాయణ చేసి అభిప్రాయం త్వరలోనే తెలుపుతాననీ..వీలైతే భరద్వాజ మాస్టారు గారిని ఒకసారి మొగలిచెర్ల కు వచ్చి, శ్రీ స్వామివారిని దర్శించమని సవినయంగా వ్రాసారు..మాస్టారు గారు కూడా త్వరలోనే వస్తానని జవాబు వ్రాసారు..
ఆరోజుకు ప్రభావతి గారికి తెలియదు..శ్రీ భరద్వాజ మాస్టారు గారు వెలిగించిన శ్రీ శిరిడీ సాయిబాబా జ్యోతి ఆంధ్రరాష్ట్రం నలుచెరుగులా దేదీప్యమానంగా వెలుగును విరజిమ్మబోతోందనీ..శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన "శ్రీ సాయిబాబా మిషన్ " ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందనీ.. వారి "సాయిబాబా" పక్షపత్రిక లోనే మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను ధారావాహికంగా తాను వ్రాయబోతాననీనూ..
"అమ్మా!..నీవు నా చరిత్ర వ్రాస్తావు కదూ..నువ్వే వ్రాస్తావులే!.." అని శ్రీ స్వామివారు పలికిన పలుకులు ఆ తరువాతి కాలంలో..శ్రీ భరద్వాజ మాస్టారు గారి స్పూర్తితో నిజమయ్యాయి..తెలుగు ప్రజలకు అవధూతల చరిత్రలను పరిచయం చేసిన శ్రీ భరద్వాజ మాస్టారు గారికి మనం ఎంతగా ఋణపడి ఉన్నామో కదా!..
ఏప్రిల్ 30వతేదీ నాడు శ్రీ స్వామివారు తమను కలువమని చెప్పిన ప్రక్కరోజు..ఒంగోలు నుంచి కొంతమంది అధ్యాపకులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఒక బస్సు వేసుకొని శ్రీ స్వామివారిని దర్శించాలని మొగలిచెర్ల కు వచ్చారు..ముందుగా తెలుపకుండా ఉన్నఫళాన వచ్చేస్తే ఎలా అని శ్రీధరరావు గారు వాళ్ళను సున్నితంగా అడిగి..శ్రీ స్వామివారు ఎవ్వరినీ కలవొద్దని చెప్పిన వైనం వాళ్లకు తెలియచేసారు..వాళ్ళందరూ ముక్తకంఠంతో.."ఇంతదూరం వచ్చాము..అక్కడిదాకా వెళదాము..మా ప్రాప్తం ఎలా వుంటే..అలా జరుగుతుంది.." అన్నారు..శ్రీధరరావు గారూ సరే నని చెప్పి..అదే బస్సులో వాళ్ళతో పాటు ఆశ్రమానికి వెళ్లారు..
ఆశ్రమం బైట..ప్రధాన ద్వారానికి కూడా కొద్దిదూరంలో..శ్రీ స్వామివారు నిలబడి వున్నారు..పాదుకలు ధరించి..దండ కమండలాలు చేతబూని..అచ్చం మహర్షి లా గోచరించారు..వచ్చిన వారందరూ బస్సు దిగి..శ్రీ స్వామి వారిని చూసి చేతులు జోడించి..దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కారం చేయబోయారు..పాద నమస్కారాలు వద్దని సైగ ద్వారా వారించి..కొద్ది నిముషాల పాటు నిలబడి..కళ్ళతోనే తాను వెళుతున్నట్లుగా సంకేతం ఇచ్చి..ఆశ్రమం లోపలికి వెళ్లిపోయారు..మళ్లీ అందరూ బస్సు ఎక్కి..శ్రీధరరావు గారిని వారింటివద్ద దింపుతూ.."మాకింతే ప్రాప్తం!..మహనీయుడి దర్శనానికి నోచుకున్నాము..వాక్కు వినలేకపోయాము.." అన్నారు..శ్రీధరరావు గారు చిరునవ్వు నవ్వి వారికి వీడ్కోలు చెప్పి పంపారు..
శ్రీధరరావుగారికి ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయమేమిటంటే..శ్రీ స్వామివారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఆశ్రమం బైటకు వచ్చి నిలుచుని వున్నారే!..ఆయనకు ముందుగా వీరందరూ వస్తున్న సంగతి తెలీదు కదా?
అదే సాధకుడికి..సంసారికి ఉన్న తేడా!..అవధూతల అంతరంగాన్ని అంచనా వేయడం కష్టతరం..
ఏప్రిల్ 30 వ తేదీ భేటీ గురించి..రేపటి భాగం లో..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం... లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..సెల్ : 94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి