శు భో ద యం 🙏
పద్యసౌందర్యం!
చామకూర కవితా చాతుర్యం!!
కవిత్వం చెప్పటంలో కథాకథనంలో ఒక విలక్షణమైన చమత్కార వైఖరి చామకూర వేంకట పతిలో కనిపిస్తుంది.
చెప్పే విషయానికనుకూలమైన భాషాప్రయోగంతో అందులో విశిష్టమైన చమత్కారంతో అతనిప్రతిపద్యం ఒక క్రొత్త సోయగాన్ని మనకు చవిచూపుతుంది. సర్వజ్ఙుడైన పరమేశ్వరుడు గంగ కెందుకు ప్రాధాన్యమును ఇచ్చాడు. నెత్తిని యెందుకెక్కించు కొన్నాడు? అనేప్రశ్నలకు సమాధానంగా ఒక చక్కని పద్యం చెప్పాడు. విజయ విలాసం లోని మొదటి యా
శ్వాసంలో గల యీపద్యం మీకోసం , చిత్తగించండి!
శా: " తాసైరింప కపర్ణయుండగ , భవద్గర్భంబునందాల్చి , తే
జో సహ్యున్ శరజన్ముగాంచి , యల నీహారక్షమాభృత్కుమా
రీ సాపత్న్యము గన్న , మోహపు పురంధ్రీరత్నమౌదీవు ,కా
దే సర్వజ్ఙుడు నిన్నునేల ,ఁ దలపై కెక్కించుకో జాహ్నవీ !
అర్జునుడు సమయభంగ మగుట తీర్థయాత్రలకు వెడలుచున్నాడు. అతని తొలి మజిలీ గంగాతీరం. గంగను చూడగానే పరవశమైనాడు. చేతులు జోడించి యామెను ప్రార్ధింప సాగినాడు. అందులో యీపద్యము గణింపఁ దగనది.
అమ్మా! గంగమ్మతల్లీ! పరమేశ్వరునకు నీవంటేనే యెక్కువ ప్రేమమ్మా! లేకపోతే నెత్తిమీదెందుకు నిన్ను యెక్కించుకుంటాడు? అని యెదురుప్రశ్న వేస్తున్నాడు. అలా యెలా కుదురుతుందయ్యా? అవతల సగం శరీరమై కూర్చున్న పార్వతిలేదా? అనే ప్రశ్న రాకమానదని కవికి తెలుసు . దానికి యుక్తి యుక్తమైన ఒక చక్కని కథ చెపుతున్నాడు.
" శివుని వీర్యం ( కారణాంతరాలవలన) స్ఖలితం కాగా అగ్నితో సమానమైన ఆవీర్యాన్ని పార్వతి గర్భంలో మోయలేకపోతే నీవుగదా దానిని మోసి తోజోరాసి యైన శరజన్మునకు (కుమారస్వామి) జన్మము నొసగితివి. అందుచేతనేగదా నీవు పార్వతికి సవతివైతివి . మొగవారికి తమ వంశమును నిలిపిన యాడువారిపైననే ప్రేమ మెండు. లేకున్న సర్వజ్ఙుడు (శివుడు) నిన్ను నెత్తిపై నెందుకు ధరించును. అంటున్నాడు. ఎంత గొప్ప సమర్ధింపో చూడండి!
పార్వతి యేమీ తక్కువదికాదు . ఆమె అపర్ణ . శివుని పతిగా బడయుటకై ఘోరమైన తపస్సు చేసినది. ఆమెనివసించు చెట్టుక్రింద రాలిన యాకుల జాడ తెలిసెడిది గాదు. ఆరాలినయాకులే ఆనెయాహారము. ఆమెయొనరించిన తపము ఆమె నపర్ణ బిరుదాంకితగా నొనర్చినవి.
మరియొకటి పార్వతి "నీహార క్షమాభృత్కుమారి" యెంతపెద్ద సమాసమోచూడండి! హిమవత్పర్వత రాజ కుమారి అంత గొప్ప భాగ్యవంతుల యాడబడచు.
ఆమె తపస్వి, , గొప్పవారింటి బిడ్డ. గంగయో సాధారణమైన వనిత ఆమెను లెక్కింపక యీమెని శిరమున దాల్చుటయా? శివునకు యోచనలేదా? యనువారికి సమాధానముగా పరమేశ్వరునకు " సర్వజ్ఙుఁడు"- అనువిశేషణమును తగిలించి విమర్శలకు అవకాశమును లేకుండ చేసినాడు.
లోకమున సంతతిగల యాడుదానికిచ్చిన విలువ తక్కినవారికివ్వరుగదా! మరిశివుడు సర్వజ్ఙుఁడాయె ,అందుచేతనే నెత్తికెక్కించు కున్నాడని, చమత్కరించి విషయమును రక్తి గట్టించినాడు.
ఇదీ చామకూర కవితా చమత్కారము!!!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి