27, మార్చి 2025, గురువారం

తిరుమల సర్వస్వం -190*

 *తిరుమల సర్వస్వం -190*

*శ్రీవారి ఆభరణాలు -2*

 *మొజాతినగలు* 


 బ్రహ్మోత్సవాల వంటి అత్యంత అరుదైన, విశేష ప్రాముఖ్యం కల సందర్భాలలో మాత్రమే శ్రీవారికి అలంకరింపబడే ప్రాచీనమైన నగలన్నీ ఈ వర్గానికి చెందుతాయి. ఒక్కొక్క ఆభరణం ఒక్కొక్క కళాఖండం ! నాటి దాతల అభిరుచికి, కళాకారులు పనితనానికి నిలువుటద్దం. వారి వారి నైపుణ్యాన్ని శ్రీవారిపైనున్న భక్తి విశ్వాసాలతో మేళవించి, దేవాలయ చరిత్రలో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్న ఎన్నో ఆభూషణాలకు దక్షిణభారతదేశానికి చెందిన ఎందరో కళాకారులు ప్రాణం పోశారు. దేవస్థానానికి సంబంధించిన బొక్కసం (ట్రెజరీ) అధికారుల అధీనంలో ఉన్న కోశాగారంలో ఈ నగలను భద్రపరుస్తారు. వీటికి విశేషమైన చారిత్రక ప్రాధాన్యత ఉంది.

2  ఈ మూడు తరగతులకు చెందిన ఆభరణాలకు పటిష్టమైన భద్రత, నిఘా ఏర్పాట్లు, తనిఖీలు, తరచుగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ జరుగు తుంటాయి.


 *కిలోలూ - క్వింటాళ్ళూ కాదు, ఏకంగా టన్నులే!!* 


 2016వ సంవత్సరంలో జరిగిన మదింపు ప్రకారం, తిరుమలేశునికి సుమారు 14 టన్నుల బరువైన ఆభరణాలు ఉండగా వాటిలో 124 ఆభరణాలు మూలమూర్తి అలంకరణకు, 383 ఆభరణాలను ఉత్సవమూర్తులకు ఉపయోగిస్తారు. 


 ఇవే కాకుండా రాఘోజీ సంస్థానంవారు, వెంకటగిరి సంస్థానం వారు స్వామివారికి సమర్పించుకున్న ఆభరణాలను వాటికున్న చారిత్రక ప్రాధాన్యతను బట్టి విడి విడిగా భద్రపరుస్తారు. శ్రీవారి ఆభరణాలను నమోదు చెయ్యడానికి మొత్తంగా 17 దస్త్రాలు (రిజిస్టర్లు) ఉన్నాయి. వీటితో పాటుగా తిరుమలలోని అనేక ఉపాలయాలలో, తి.తి.దే. ఆధ్వర్యంలోనున్న తిరుపతి పట్టణంలోని వివిధ ఆలయాలలో కూడా లెక్కలేనన్ని ఆభరణాలు ఉన్నాయి.


 *తిరుపతి లోనే దర్శించుకోవచ్చు!* 


 సామాన్య భక్తులు సైతం, తిరుపతి నుంచే చూసి తరించు కునేందుకు వీలుగా శ్రీవారి అమూల్యమైన, చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న ఆభరణాలను తిరుచానూరులో జరిగే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల నుండి సర్వలాంఛనాలతో; సంవత్సరానికొక్కటిగా తెచ్చి ఊరేగింపు జరిపే సాంప్రదాయాన్ని ఈ మధ్యనే తి.తి.దే. వారు ప్రవేశపెట్టారు.


 *ఆణివార ఆస్థానం* 


 విలువ కట్టడానికి సాధ్యంకాని విశేషమైన ఆభరణాలే కాకుండా స్వామివారి భక్తులు నిత్యం పరకామణిలో వేసే చిన్నపాటి ఆభరణాలు, బంగారు బిస్కెట్ లతో ఆ లక్ష్మీపతి కోశాగారం కిటకిటలాడుతుంటుంది. వీటి విలువను ఇదివరకు ఏడాదికోసారి జరిగే *'ఆణివార ఆస్థానం'* అనే సంవత్సరోత్సవ సందర్భంలో లెక్కగట్టే వారు. 'ఆణివార ఆస్థానం' అంటే, దేవాలయ అజమాయిషీ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి మహంతుమఠం వారికి దఖలు పడ్డ రోజుకు గుర్తుగా జరిపే వార్షికోత్సవం. అయితే, ప్రస్తుతం శ్రీవారి ఆలయ లెక్కల ముగింపు దినాన్ని సాధారణ ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా మార్పు చేశారు.


 *శ్రీవారి డాలర్లు* 


 రాళ్లు పొదగబడినవి కాకుండా, హుండీ ద్వారా వచ్చిన సాదా స్వర్ణాభరణాలను ముందుగా తిరుమలలో ఉన్న కోశాగారానికి, అక్కడ నుంచి నెలకొకసారి తిరుపతిలో ఉన్న తి.తి.దే. పరిపాలనా కార్యాలయ భవనానికి - భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య తరలిస్తారు. తదనంతరం వాటిని ముంబైలో ఉన్న ప్రభుత్వ టంకశాలకు తరలించి, 22 క్యారెట్లతో 5, 10 గ్రాముల బరువుండే శ్రీవారి బంగారు డాలర్లను తయారు చేసి, మళ్లీ వాటిని తిరుమల లోనే భక్తులకు విక్రయించి, తద్వారా వచ్చిన సొమ్మును బ్యాంకుల్లో ఉన్న తి.తి.దే. ఖాతాలకు జమ చేస్తారు. ఇలా ఖాతాల్లో జమ కాబడ్డ డిపాజిట్లు కొన్ని వేల కోట్లకు చేరుకుని, శ్రీవారు సాటిలేని శ్రీమంతులు అనిపించుకుంటున్నారు. మార్కెట్ ధరల ననుసరించి, ఏ రోజు బంగారం ధర ఆ రోజే నిర్ణయిస్తారు. అంతే తప్ప భక్తులు సమర్పించుకున్న శ్రీవారి ఆభరణాలను నేరుగా విక్రయించే సాంప్రదాయం లేదు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: