🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శంకరులు ఈ శ్లోకములో శుద్ధరూపుడయిన శంభునికి నమస్కరిస్తున్నారు. (ఇది ఒక గొప్ప శివ స్తుతి ).*
*శ్లోకము : 55*
*ఆద్యాయామిత తేజసే శ్రుతిపదై ర్వేద్యాయ సాధ్యాయతే*
*విద్యానంద మయాత్మనే త్రిజగత స్సంరక్షణోద్యోగినే*
*ధ్యేయా యాఖిల యోగిభి స్సుర గణై ర్గేయాయ మాయావినే*
*సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శ్శంభవే !!*
*పదవిభాగం :~*
*ఆద్యాయ అమిత తేజసే = ప్రపంచమునకు మొదటి వాడు, మితిలేని తేజస్సు రూపము కలవాడు;*
*శ్రుతిపదైః వేద్యాయ = వేద వాక్యముల చేత తెలియ దగినవాడు*
*సాధ్యాయ =భక్తులను అనుగ్రహించుటకు ప్రతిమాది రూపమున ప్రతిష్టింపబడిన వాడు*
*తే = నీ కొరకు*
*విద్యానందమయాత్మనే = చిదానందమయమైన ఆత్మస్వరూపుడు*
*త్రిజగతః స్సంరక్షణ ఉద్యోగినే = ముల్లోకములను కాపాడుట ప్రవృత్తిగా కలవాడు*
*అఖిల యోగిభిః ధ్యేయాయ = యోగులందరి చేతను ధ్యానించబడువాడు*
*సురగణైః = దేవ గణములకు చేత*
*గేయాయ = గానము చేయదగిన వాడు*
*మాయావినే = మాయచే అనేక ఉపాధులను ధరించు వాడు*
*సమ్యక్తాండవ సంభ్రమాయ = చక్కని తాండవ నృత్యమందు తొందర కలవాడు*
*జటినే = జడలు దాల్చిన వాడు*
*ఇయం = ఈ*
*నతిః = నమస్కారము*
*శంభవే = సుఖకరుండు.*
*తాత్పర్యము :~*
*సర్వ లోకములకూ ఆద్యుడవునూ, అధిక తేజ స్సంపన్నుడవునూ, వేద వాక్యములచే తెలిసికొన దగిన వాడవునూ, తపో ధ్యానాది సాధనములచే సాధింప దగినవాడవునూ, ఙ్ఞానానంద స్వరూపుడవునూ, ముల్లోకములనూ రక్షించడానికి నిత్యమూ యత్నించు వాడవునూ, సర్వ యోగులచే ధ్యానము చేయదగిన వాడవునూ, దేవతా సమూహములచే కీర్తింప దగిన వాడవునూ, మాయచే అనేక ఉపాధులను ధరించు వాడవునూ, యథా శాస్త్రముగా తాండవ మొనర్చుట యందు ఆదరము గల వాడవునూ, జటాధారివియూ, శంభుడవూ అయిన నీకు , ఇదే నా నమస్కారం. ( ఇక్కడ శివుని గుణ స్వరూప మహిమలు చక్కగా వర్ణింప బడినవి).*
*వివరణ :~*
*ఈశ్వరుడు సృష్టికి ముందే ఉన్నవాడు. అమితమైన తేజస్సు కలవాడు. వేద వాక్యముల ద్వారా తెలిసికొనదగినవాడు. సాధ్యుడు, మంత్ర స్వరూపుడు లేదా సకల శ్రుతి స్మృతి విహితములైన సకలసాధనములకు లక్ష్యమైనవాడు. చిన్మయమూ, ఆనందమయమును అయిన స్వరూపం గలవాడు. ముల్లోకములనూ రక్షించడం యందు పూనిక గలవాడు. భక్తులూ, ఙ్ఞానులూ అనెడి సమస్త యోగుల ద్వారా ధ్యానింప దగినవాడు. సర్వ దేవతలచేత గానం చేయదగిన వాడు. మాయావి, జటాజూటం గలవాడు. తాండవం చేయుట యందు సంబరం గలవాడు. సుఖకరుడు అటువంటి నీకు, ఇదే నా నమస్కారము.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి