*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*
*329 వ రోజు*
. . కర్ణుడు పాండవులను జయించగలడు అని పొగిడే సుయోధనుడు ఇది చూసి ఎంత బాధ పడ్డాడో కదా ! అయినా సంజయా ! నాగులకు, దేవతకూ కూడా భయపడని భీమునికి కర్ణుడు ఒక లెక్కా! జరాసంధుని చంపిన భీమసేనుడిని పసి వారైన దుర్జయుడు, దుర్ముఖుడు ఎందుకు ఎదుర్కొన్నారు. భీముడేమి సాత్యకి తక్కువ వాడా! సుయోధనుడు సాత్యకిని మాత్రం ఎదుర్కొనగలడా ! మన వాళ్ళకు ఓటమి తప్పదని అనిపిస్తుంది " అని బాధపడ్డాడు. అది విన్న సంజయుడు " మహారాజా ! కావాలని విషం త్రాగి శరీరం బాధ పడుతుంది శోకించి ప్రయోజనం లేదు. మారు మాటాడక మిగిలిన విశేషాలు వినండి " అన్నాడు. " కర్ణుడు ఓడి పోవడం చూసిన నీ కుమారులు దుర్మర్షణుడు, దుర్మదుడు, దుస్సహుడు, విజయుడు, విచిత్రుడు, ఒక్కుమ్మడిగా భీముని చుట్టుముట్టారు. వారి అండ చూసుకుని కర్ణుడు కూడా శరప్రయోగం చేయసాగాడు. భీముడు విజృంభించి నీ కుమారుల రథములు విరిచి వారిని తన శరములతో యమసదనానికి పంపాడు. అది చూసి కర్ణుడు భీమునిపై డబ్బై ఐదు బాణములు వేసాడు. భీముడు విజృంభించి నూట ఐదు బాణములను కర్ణుని శరీరంలో గుచ్చి కర్ణుని సారథిని చంపి, విల్లు విరిచాడు. కర్ణుడు భీమసేనుడిపై గదను విసిరాడు. భీముడు ఆ గదను ముక్కలు చేసాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీమసేనుని కవచమును భేదించాడు. భీమసేనుడు కూడా కర్ణుని కవచమును కొట్టాడు. కర్ణుడు నేలపై నిలబడి యుద్ధం చేయడం చూసిన సుయోధనుడు తన సోదరులైన చిత్రుడు, విచిత్రుడు, చారుచిత్రుడు, చిత్రధ్వజుడు, చిత్రాయుధుడు, చిత్రకర్ముడు మొదలైన వారిని భీమసేనుడి పైకి పంపాడు. భీమసేనుడు వారి రథుములను అన్నింటినీ విరిచి, సారధులను చంపి వాడి అయిన బాణములతో నీ ఏడుగురు కుమారుల తలలను నరికాడు. ఈ వ్యవధిలో కర్ణుడు మరొక రథం ఎక్కి భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. ఒకరికి ఒకరు తీసి పోకుండా పోరుతున్నారు. ఇంతలో నీ కుమారులైన శత్రుంజయుడు, శత్రుసహుడు, సుదేహుడు, మదనుడు, ద్రుముడు, చిత్రబాహుడు, వికర్ణుడు మొదలైన వారు కర్ణుడికి రక్షణగా వచ్చి భీమసేనుడిని ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి భీముడి మీద శరవర్షం కురిపించారు. భీముడు పట్టరాని కోపంతో వారందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క బాణంతో యమసదనానికి పంపి విజయోత్సాహంతో సింహనాదం చేసాడు. భీముని చేతిలో తన తమ్ములు మరణించడం చూసి సుయోధనుడు ఎంతో బాధ పడ్డాడు " అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు దుఃఖంతో " సంజయా ! ఆ నాడు జూదం జరుగుతున్నప్పుడు విదురుడు చెప్పిన మాటలు నిజమౌతున్నాయి. సుయోధనుడి కుయుక్తి కారణంగా నా కుమారుల దుర్మరణం గురించి వినవలసిన దుస్థితి దాపురించింది. శోకించడం తప్ప నాకు మిగిలినదేమిటి ఎవరిని అనుకుని ఏమి ప్రయోజనం " అన్నాడు.
*కర్ణుడు భీముని ఎదుర్కొనుట*
భీముడి సింహనాదం విన్న కర్ణుడు కోపంతో ఊగిపోయి తిరిగి భీమసేనుడి మీదకు విజృంభించాడు. కౌరవసేనలు భీమసేనుడిని కమ్ముకున్నాయి. భీమసేనుడు వారందరితో యుద్ధం చేస్తూ వారి రధములు విరుస్తూ, కేతనములను విరిచి, రధసారధులను రధాశ్వములను చంపుతూ, కౌరవసేనలను తెగనరకసాగాడు. వారి నెత్తురు కాలువలుగా ప్రవహిస్తుంది. చావగా మిగిలిన కౌరవ సేన భీముని ఎదుట పడకుండా తప్పించుకుంటున్నారు. భీముడికి కౌరవసైన్యంలో ఎదురులేక పోయింది. కర్ణుడు మాత్రమే ఎదురుగా ఉన్నాడు. కర్ణుని నుదిటి మీద వరుసగా బాణములు నాటాడు. కర్ణుడు తిరిగి భీముని మీద నూరు బాణములు ప్రయోగించాడు. భీముడు కోపించి కర్ణుని విల్లు విరిచాడు. కర్ణుడు మరొక విల్లు తీసుకుని భీమసేనుడి మీద శర పరంపర గుప్పిస్తున్నాడు. కర్ణుడు భీముని కేతనమును పడగొట్టి, విల్లు విరిచి, సారధిని కొట్టాడు. భీముడు కర్ణుని మీద శక్తి బాణము వేసాడు. కర్ణుడు తొమ్మిది బాణములు వేసి శక్తి ఆయుధమును త్రుంచాడు. భీముడు కత్తి డాలు తీసుకున్నాడు. కర్ణుడు భీముని డాలును విరుగకొట్టాడు. భీముడు తన కత్తితో కర్ణుని విల్లు విరిచాడు. కర్ణుడు వేరే విల్లు తీసుకునే లోపు భీముడు కర్ణుడి రధము మీదకు లంఘించాడు. కర్ణుడు భయపడి తన రధము వెనుక దాక్కున్నాడు. భీముడు నలు దిక్కుల చూసి కర్ణుడు కానరాక రధము కిందకు చూసాడు. ఆ సమయంలో కర్ణుడు భీముని మీద బాణప్రయోగం చేసాడు. ఆ బాణముల ధాటికి ఆగలేని భీముడు పక్కన పడి ఉన్న శవముల గుట్టలో దూరాడు. భీముని దైన్య స్థితి చూసి కర్ణుడు అతడి మీద విల్లు పెట్టి విలాసంగా నిలబడి " ఓరి భీమసేనా! తిండిపోతా ! నీకు యుద్ధము ఎందుకురా కడుపు నిండా మింగి ఒక పక్క కూర్చొనకుండా నీకు యుద్ధమెందుకురా ! అడవిలో మృగముల మాదిరి ఆకులలములు, పచ్చి మాంసము తిన్న మీకు యుద్ధమెందుకు ఈ మిడిసి పాటు ఎందుకు అయినా నీ శక్తి తెలుసుకుని నీకు తగిన వాడితో యుద్ధం చెయ్యి కాని నాతో పెట్టుకోకు. కృష్ణార్జునుల వద్దకు వెళ్ళి తల దాచుకో పో " అని భీముని నిందించాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి