10, జనవరి 2025, శుక్రవారం

గీతా మకరందము

 11-52,53-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ|| అర్జునుని యా వాక్యములను విని భగవానుడు తానుచూపిన  రూపముయొక్క మహిమాతిశయమును రెండు శ్లోకములద్వారా వెల్లడించుచున్నారు - 


శ్రీ భగవానువాచ :-

సుదుర్దర్శమిదం రూపం 

దృష్టవానసి యన్మమ | 

దేవా అప్యస్య రూపస్య 

నిత్యం దర్శనకాంక్షిణః || 


తా:-  శ్రీ భగవానుడు చెప్పెను - నా యొక్క ఏ రూపమును నీవిపుడు చూచితివో అది మహాదుర్లభమైనది. దేవతలుకూడ నిత్యమూ నద్దానిని దర్శనము చేయగోరుచుందురు. 


వ్యాఖ్య:- భగవంతుని స్వరూపమును సామాన్యులెవరును దర్శింపజాలరు. ఎంతయో హృదయనిర్మలత (చిత్తశుద్ధి), అనన్యభక్తిగలవారు మాత్రమే దానిని దర్శింపగలరు. కనుకనే ‘దుర్దర్శమ్’ అనకుండ ‘సుదుర్దర్శమ్’ అని చెప్పబడినది. భగవద్దర్శనము మహాదుర్లభమని భావము. 

-------------------------------------

॥ ఓం - గీతా మకరందము  [11-53]॥

నాహం వేదైర్న తపసా 

న దానేన న చేజ్యయా 

శక్య ఏవంవిధో ద్రష్టుం 

దృష్టవానసి మాం యథా || 


తా:- నన్ను ఏ రీతిగ నీవు చూచితివో, అటువంటి రూపముగల నేను వేదములచే (వేదాధ్యయనపరులచే) గాని, తపస్సుచేగాని, దానముచేగాని, యజ్ఞముచేగాని చూచుటకు శక్యుడనుగాను.

  

వ్యాఖ్య:- 48వ శ్లోకమున తెలిపిన భావములనే మఱల తెలియజేయుచున్నాను. వేదాధ్యయన, తపో, దాన,యజ్ఞాదిక్రియలు పవిత్రములైనను నిర్మలభక్తి, అచంచల దైవవిశ్వాసము వానితో జోడింపబడినపుడు

మాత్రమే అవి సత్ఫలముల నొసంగగల్గును. (చూ - వ్యాఖ్య - 48 శ్లో) (ఈ విషయము రాబోవు శ్లోకమున తెలియజేయబడును).

కామెంట్‌లు లేవు: