*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*
*252 వ రోజు*
*పాండవులతో ద్రోణ, భీష్ముల యుద్ధం*
సాత్యకి ముందుగా ద్రోణుని మీద బాణవర్షం కురిపించాడు. ద్రోణుడు ప్రతిగా సాత్యకి మీద బాణ ప్రయోగం చేసాడు.ఇది చూసిన భీముడు సాత్యకి సాయంగా రథాన్ని నడిపిస్తూ వచ్చి చేరి ద్రోణునిపై అతి క్రూర బాణాలు సంధించాడు. ఇది చూసిన శల్యుడు ద్రోణ, భీష్ములకు బాసటగా నిలిచి భీమునిపై బాణవర్షం కురిపించాడు. ఇంతలో ద్రౌపతీ సుతులు, అభిమన్యుడు భీమునకు సాయంగా వచ్చారు. శిఖండి భీష్మిని ఎదుర్కొన్నాడు. భీష్ముడు పక్కకు తప్పుకున్నాడు. ఇది చూసిన సుయోధనుడు ద్రోణుని శిఖండి మీదకు పురికొల్పాడు. ద్రోణుడు శిఖండిపై బాణాలను గుప్పించాడు. పోరు భీకర రూపం దాల్చింది. రథ, గజ, తురగ, పదాతి దళముల పదఘట్టనల హోరు మిన్నంటింది, ధూళి ఆకాశాన్ని కప్పేసింది. గుర్రముల ప్రేగుల గుట్టలు, ఏనుగుల కళేబరములతో రణభూమి భయానకంగా ఉంది. రక్తం కాలువలు కట్టింది. భీమార్జునుల, భీష్మ ద్రోణులు ఇరువైపులా నిలిచి భీకర పోరు సాగిస్తున్నారు.
*భీమసేనుని పరాక్రమం*
దృతరాష్ట్ర కుమారులంతా చేరి భీమునిపై మూకుమ్మడిగా పడ్డారు. ఎత్తైన కొండను మేఘాలు కప్పినట్లు భీమసేనుని ఎదుర్కొన్న నీ కుమారులను చూసిన అర్జునుడు భీమసేనునికి సాయంగా వచ్చి వారి పై శరములు గుప్పించాడు. అర్జునిని గాండీవతాకిడికి ఆగలేక కౌరవ సేనలు భీష్ముని వెనుక చేరాయి. తన సేనలు పారిపోవడం చూసిన సుయోధనుడు చేయి వూపుతూ అక్కడకు చేరగానే అది గమనించిన కంభోజ, సౌవీర, సింధు, గాంధార, త్రిగర్త, కళింగ రాజులు తమ సేనలతో అక్కడకు చేరి భీమార్జునులను ఎదుర్కొన్నారు. ఇది చూసిన ధర్మరాజు చేది, కాశ, కరూస, విరాట సేనలను ధృష్టద్యమ్నునుని నాయకత్వంలో భీమార్జునులకు సాయంగా తీసుకు వచ్చాడు. విందాను విందులు కాశీరాజుని, జయద్రధుడు భీమసేనుని, సహదేవుని వికర్ణుడు, చిత్రసేనుడు శిఖండిని, సుయోధనుడు విరాటుని, త్రిగర్తలు నకులుని, ద్రోణుడు చేకితాన, సాత్యకులను, కృపాచార్యుడు ధృష్టద్యుమ్నుని, అభిమన్యుడు సాళ్వ కేకయరాజులను, ధృష్టకేతు, ఘటోత్కచులు నీకుమారులను ఎదుర్కొన్నారు. సమరం సంకులమైంది. అస్త్ర, శస్త్రములు ఒకదానితో ఒకటి తాకి మంటలను రేపుతున్నాయి. ఏనుగుల ధాటికి నలిగిన రథములు రథముల ధాటికి దెబ్బతిన్న ఏనుగులు, గుర్రముల ధాటికి నేల కూలిన పదాతి దళములు యుద్ధరంగాన్ని బీభత్సం చేసాయి. భీముని పరాక్రమం చూసి భీష్ముడు వాడి అయిన బాణములు వేసి అతడిని నొప్పించాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి