వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం
పరమ పవిత్రమైన ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి' పర్వదినంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశినాడు జరుపుకుంటారు. దీనికే 'ముక్కోటి ఏకాదశి' అని కూడా పేరు. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి నాడు పాల కడలిలో శయనించి యోగ నిద్రలో గడిపి కార్తీక శుద్ధఏకాదశినాడు యోగనిద్ర నుంచి మేల్కొన్నాడు శ్రీమహావిష్ణువు.
దీని వెనుక ఓ ఆసక్తికరమైన పురాణగాథ వుంది. రావణాసురుని బాధలకు తాళలేని దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అపుడాయన ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున దేవతలందరితో వైకుంఠం చేరుకున్నాడు. వారంతా కలిసి శ్రీహరిని వేదముల సూక్తములతో పరిపరివిధాల స్తుతించారు. దాంతో శ్రీహరి సంతుష్టుడై వారికి తన దర్శనభాగ్యం కలుగజేశాడు. వైకుంఠ ఏకాదశి వెనుక మరో పురాణగాథ కూడా వుంది. మధుకైటభలను రాక్షసులను విష్ణుభగవానుడు సంహరించినప్పుడు వారు దివ్యరూపధారులై దివ్య జ్ఞానమును పొంది ఆ స్వామిని కొనియాడారు.
'బ్రహ్మాదులెవరైనా నీ లోకం వంటి మందిరం నిర్మించి, ఏకాదశి పండుగ చేసుకొని, నీకు నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున నిన్ను చేరుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు వరమివ్వ' మని కోరారు. ఈ విధంగా ముక్కోటి దేవతల బాధలను నివారించిన దవడంవల్ల 'ముక్కోటి ఏకాదశి' గాను భగవంతుని దర్శించు కొను పవిత్రమైన రోజు కావున 'భగవదవలోకన దినము' గాను ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి కొనియాడబడింది.
ప్రతి మాసంలోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. శుభకరమైనది. అందుకే 'వైకుంఠ ఏకాదశి' గా, 'ముక్కోటి ఏకాదశి'గా, 'హరివాసరము'గా ఈ రోజు కీర్తించ బడుతుంది. ఈరోజున సకల దేవతారాధ్యుడు అయిన శ్రీమన్నారాయణుని పాద పద్మములను భక్తిశ్రద్దలతో అర్చించిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది.
ఏకాదశినాడు ఏం చేయాలి?
ఏకాదశినాడు ప్రధానంగా ఉపవాస వ్రతం పాటించాలని పురాణాలు వెల్ల డించాయి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఆనాడు ఉదయమే నిద్ర లేచి కాల కృత్యాలు, నిత్యకర్మలు పూర్తి చేసుకొని విష్ణుమందిరానికి వెళ్ళి తాను వ్రతమును ఆచరించుటకు నిర్ణయించుకున్నట్లు, ఆ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగునట్లు చూడమని శ్రీహరిని ప్రార్ధించవలెను. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుని ధ్యానిస్తూ గడపవలెను. ఆనాటి రాత్రి జాగరణ చేయవలెను.
ఈ సమయంలో శ్రీహరి ధ్యానంగానీ, పురాణ పఠనంగానీ చేయవలెను. మరునాడు ఉదయం ద్వాదశి ఘడియలు ఉండగా నారాయణుడిని పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేయవలెను. అంటే ఉపవాసం ఉండడం ఈ నాటి ప్రధాన నియమం. అయితే సంతానం గలవారు ఏమీ తినకుండా ఉండకూడదు. సంతాన హీనులు, విధవలు, సన్యాసులు మినహా మిగిలిన వారందరూ పండ్లు, పాలు వంటివి స్వీకరించవలెను. భార్యాభర్తలు కలసి ఈ వ్రతం చేయడం ఉత్తమం. ద్వాదశినాడు అన్నదానం చేయడంవలన రెట్టింపు ఫలితాలు ఉంటాయని పద్మపురాణం వివరి స్తోంది. అంతే కాకుండా ఏకాదశినాడు ఉపవాస వ్రతం చేయకుండా భుజించేవారు మహా పాపములు పొందుతారని పురాణాలు వెల్లిడిస్తున్నాయి. అయితే ఉపవాసం చేయలేని వారికి వాయు పురాణం ప్రత్యామ్నాయాలను సూచించింది.
‘నక్తం హవిష్యాన్ని నోదవం వా ఫలం తిలాః క్షీరమథాంబు బాజ్యం యతృంచగవ్యం యదవాపి వాయుః ప్రశస్త మంత్రోత్తర ముత్తరంచ||'
అని వాయు పురాణంలో పేర్కోనబడింది.
ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణము, అదీ చేతగాని సమయంలో పంచగవ్యము అంటే పాలు, నీరు, నెయ్యి, నువ్వులు, పండ్లు తినవచ్చును. అది కూడా సాధ్యం కానప్పుడు ఉడకని పదార్ధాములు... అలా కూడా ఉపాసించలేనివారు ఒక పొద్దు అంటే ఒకపూట ఆహారం స్వీకరించవచ్చని దీని అర్థం. ఈ విధంగాఉపవాస వ్రతం పాటించడం వల్ల సూర్యచంద్ర గణములో చేసే దానం, అశ్వమేధ యాగం చేసిన ఫలితాలకంటే అధిక ఫలితం లభిస్తుందని పురాణాలు వివరించాయి.
వైకుంఠ ద్వార దర్శనం.
వైకుంఠ ఏకాదశినాడు ఆచరించాల్సిన పనుల్లో 'వైకుంఠ ద్వార దర్శనం' ప్రధానమైంది. వైకుంఠ ఏకాదశిరోజు వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరం వైపున వున్న ద్వారం తెరుస్తారు. ఈ ద్వారానికే వైకుంఠ ద్వారం అని పేరు. వైకుంఠ ఏకాదశినాడు. తెల్లవారుఝామునే 'వైకుంఠ ద్వారం' ద్వారా వెళ్ళి దైవదర్శనం చేసుకుంటే సర్వ పాపాలూ నశిస్తాయని, మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఆళ్వారులలో ఒకరైన నమ్మళ్వారు ఈ దినమే పరమపదించినందు వల్ల వైష్ణువులు దీనిని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
'బృహత్సామ తథాసామ్నాం గాయత్రీ ఛంద సామాహం మాసానాం మార్గశీర్షిహం ఋతూనాం కుసుమాకరః॥'
అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొన్నాడు. 'సామవేదంలో బృహత్స మాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసాన్ని, ఋతువులలో వసంత ఋతువును నేనే' అని గీతాచార్యుడు పేర్కొన్నాడు. అలాంటి మార్గశిర మాసంలో శుద్ధఏకాదశి గీతా జయంతి కాబట్టి భగద్గీతలోని 18 అధ్యాయాలను భక్తులు పారాయణం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పబడుతూ వుంది. వైకుంఠ ఏకాదశిని పాటించడం ద్వారా అనేక పుణ్యఫలాలను పొందడమే కాదు, ఉపవాస వ్రతం వల్ల మారుతున్న ఆహారపు అలవాట్లవల్ల కొత్తగా వస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి