10, జనవరి 2025, శుక్రవారం

తిరుమల సర్వస్వం -*114

 *తిరుమల సర్వస్వం -*114

*తాళ్ళపాక అన్నమాచార్యుడు 2* 

*"అడుగడుగు దండాల వాడు గోవిందా!* 

*ఏడుకొండల వాడా! గోవిందా! గోవిందా!"*


 అంటూ శ్రీవారిని కీర్తిస్తూ తిరుమల క్షేత్రానికి వెళుతూన్న ఓ భక్తబృందం కనబడింది. ఇష్టదైవమైన వేంకటేశ్వరుని కీర్తనలు వినబడడంతో తన బాధను మరచిపోయి, తన్మయత్వంతో ఆ భక్తుల్ని చూస్తూ ఉండిపోయిన అన్నమయ్యకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయినట్టు అనిపించి, *'బంధుత్వాలన్ని మిథ్య'* అన్నట్లు తోచింది.

భక్తులందరూ తనను కూడా తిరుమల యాత్రకు ఆహ్వానిస్తున్నట్టు, ఆ క్షేత్రాన్ని చేరుకుని స్వామివారి సమక్షంలో కీర్తనలు ఆలపిస్తున్నట్లు, అలమేలుమంగా సమేతుడైన శ్రీవారు ఆ కీర్తనలను ఆదమరచి ఆలకిస్తున్నట్లు కలలుగన్నాడు. నొప్పి మటుమాయం అయింది.. మనసు తేలికపడి తన ప్రేరణ లేకుండానే అడుగు ముందుకు పడింది. వడివడిగా తిరుమల క్షేత్రం వైపు ప్రయాణం సాగించాడు. భక్తి పారవశ్యంలో మునిగి పోతూ, స్వామివారిని తలచుకుంటూ; అలుపు సొలుపులు, ఆకలిదప్పులు లక్ష్యపెట్టకుండా మైళ్ళకొద్దీ ప్రయాణం చేసి, ముందుగా, ఆ రోజుల్లో *"శ్రీపదపూరి"* గా పిలువబడే నేటి *"దిగువ తిరుపతి"* కి చేరుకున్నాడు. తిరుపతి గ్రామదేవత అయిన *గంగమ్మ* దర్శనం తరువాత, గోవిందరాజస్వామి ఆలయం చేరుకుని వారిని -


*తిరమై శ్రీ వేంకటాద్రి తిరుపతి లోపలనుఁ గొరబాయ నీ బ్రతుకు గోవిందరాజా!*


 అని కీర్తిస్తూ, గోవిందరాజు - శ్రీనివాసుడు అభిన్నులని చాటిచెప్పాడు. తదుపరి, దూరంగా కనబడుతున్న శేషాచల శిఖరాలను చూస్తూ, అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యాడు.


 *అలిపిరి మార్గంలో తిరుమలకు...* 


 స్వామివారి కీర్తనలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ తిరుమల కొండ ఎక్కడానికి ఉద్యుక్తుడైన అన్నమయ్య, మొట్టమొదటగా అలిపిరిలో ఉన్న *"శ్రీవారి పాదమండపాన్ని"*, ఆ ప్రక్కనే కొలువై ఉన్న *"లక్ష్మీనారశింహుణ్ణి"* దర్శించుకున్నాడు. ఆయా దేవతలను సందర్శించినపుడు అన్నమయ్య ఆశువుగా గానం చేసిన:


 *బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానీ పాదము*


 *కదిరి నృసింహుడు కంభమున వెడల*


 *విదితముగా సేవించరా మునులు*


అనే పాటలు తరువాతి కాలంలో లోకప్రసిద్ధ మయ్యాయి.


 ఇలా గానామృతంలో మునిగిపోతూ, స్వామివారి పైనే మనసును లగ్నం చేసి, అలిపిరి మార్గంలోని - *తలయేరు గుండు,* *చిన్న ఎక్కుడు,* *పెద్ద ఎక్కుడు,* *గాలి గోపురం,* *ముగ్గుబావి* దాటుకుంటూ; కొండలు, కోనలు, సెలయేళ్ళతో నిండిన పచ్చని ప్రకృతికి పరవశించి పోతూ; వన్యమృగాలు, భక్తబృందాలతో సందడిగా ఉన్న మెట్లమార్గాన్ని అధిగమిస్తూ, అల్లంత దూరంలో శేషాద్రి శిఖరాన్ని తొలిసారి చూడగానే -


*కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ*

*తెట్టలాయ మహిమలే తిరుమల కొండ...*


 అన్న గానం అప్రయత్నంగానే అన్నమయ్య నోటినుండి వెలువడింది. లోయలన్నీ తన గానాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. పక్షులు కిలకిల లాడుతూ ఆతని పాటకు వంత పాడుతున్నట్టున్నాయి. ఇలా మరో లోకంలో పరవశించి పోతున్న అన్నమయ్యను గమనించకుండానే, భక్తబృందం ముందుకు సాగిపోయింది. వారికోసం వెదకుతూ, *అవ్వాచారికోన* దాటి మోకాళ్ళపర్వతం చేరుకున్నాడు అన్నమయ్య. ఒక ప్రక్క ఆకలి, దాహం, మరోప్రక్క అలసట. దానికి తోడు ఎర్రటి ఎండ. ఎదురుగా చూస్తే నిట్టనిలువుగా, గుండెలవిసేలా లెక్కలేనన్ని మెట్లు! దరిదాపుల్లో తెలిసిన వారెవ్వరూ లేరు. నీరసం ఆవహించింది. మరో రెండు-మూడు మెట్లు ఎక్కగానే స్పృహతప్పి కిందపడి పోయాడు..



*("అలిపిరి" మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే టప్పుడు, మార్గమధ్యంలో ఈ ప్రదేశాలన్నింటిని నేడు కూడా చూసి ఆహ్లాదించవచ్చు. కొండమీద తిరుమలేశుని దర్శసం ఒక ఎత్తైతే, అలిపిరి మార్గంలోని శ్రీవారితో ముడిపడిన అనేక చారిత్రాత్మక విశేషాలను, రమణీయ ప్రకృతి దృశ్యాలను దర్శించుకోవడం మరో ఎత్తు. 3550 మెట్లను, ఇద్దరిముగ్గురి సాహచర్యంతో, ఏ వయసువారైనా నాలుగైదు గంటల సమయంలో, శ్రీవారి ముచ్చట్లు చెప్పుకుంటూ అధిరోహించవచ్చు. తప్పనిసరిగా చూసి తీరవలసిన ఈ నడకదారి విశేషాల గురించి మరోసారి వివరంగా తెలుసుకుందాం.)*



*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: