*👉"గురువుగారు….దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా.. అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా?"*
*"అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా విను"*
ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి
ప్రసన్నంగా నవ్వుతూ *"తథాస్తు"* అన్నాడు.
శిష్యుడు గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు.
*" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను."*
*"ఏమిటా కోరిక గురువు గారూ"*
*"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని."*
*"వచ్చే జన్మలోనా"*
*"కాదు ఈ జన్మలోనే"*
శిష్యుడు పగలబడి నవ్వాడు, *"గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "*
*" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా"*
*" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది"*
*" ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు."*
ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది.
శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.
సంవత్సరం తరువాత.
శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత
విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!"
గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా.."
"అంటే.."
అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో
ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది.
శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం,
భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి.
ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం
చేశాడు శిష్యుడు.
భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు.
🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి