22, సెప్టెంబర్ 2020, మంగళవారం

కర్మలు మూడు విధాలా ఉంటాయి

 🕉🌞🌎🌙🌟🚩


*కర్మలు మూడు విధాలా ఉంటాయి అని పెద్దల యోగుల వచనం. అవేమిటో చూద్దాం.


*సంచితం,ప్రారబ్దం,

ఆగామి ఇవి మూడు కర్మలు. ఇవి ఎలా ఉంటాయి?*


*సంచితం అనగా పూర్వపు జన్మలలో చేసిన పాపాపుణ్యముల మూటలు.*



*ప్రారబ్దం అనగా ఉదాహరణకి పాపం 30 మూటలు ఉంది. పుణ్యం 200 మూటలు ఉంది ఇది సంచితం. ఈ సంచితం లోని మూటలలో పుణ్యం నుండి 30 బస్తాలు, పాపము నుండి 5బస్తాలు కలిపి జీవుడిని భూమి మీదకి పంపుతాడు కమలాసనుడు అనగా బ్రహ్మ.. దీనిని ప్రారబ్దం అంటారు. పుణ్యం ఎక్కువ ఉంది కనుక ధనవంతుల ఇళ్లల్లో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మరి పాపం ఓ ఐదు బస్తాలు ఉంది కదా. దానివలన సంతానం లేకపోవడం, భార్య అనుకూలవతి కాకపోవడం ఎన్ని ఉన్నా అశాంతితో జీవించడం పాపఫలం. వీటిని బ్రహ్మ కాదుకదా సాక్షాత్తు శివకేశవులు కూడా మార్చలేరు. కాకపోతే ఇక్కడ మానవుల అదృష్టం ఏమిటంటే!*



*బుద్ది పెట్టాడు భగవంతుడు. మనం ఎలా బ్రతకాలో మనం నిర్ణయించుకోవచ్చు. పుణ్యకర్మలే చేస్తూ అనగా ఆకలి అన్నవాడికి అన్నం పెట్టడం, సాయం కోసం వచ్చినవాడికి సాయం చేయడం, దేవాలయాల దర్శనం, తీర్థస్నానం, యాత్రలు చేయడం, దానధర్మాలు చేయడం వంటివి. దీనివలన పుణ్యం పెరుగుతుంది. ఇలా చేయకుండా గురునింద, దైవదూషణ, తల్లిదండ్రులను అశ్రద్ధ చేయడం, ఇతరులకు కీడు తలపోయడం, ఈర్ష్య అసూయ ద్వేషాలు కోపం వంటి అవలక్షణాలు పాపహేతువులు. వీటివలన పాపం ఏర్పడుతుంది.*



*కొందరికి పైన చెప్పిన పనులు చేయడం వల్ల పాపం ఎక్కువ పుణ్యం తక్కువ ఉండడం వలన రోజు గడవడం మీద దృష్టి ఉండడం తప్ప దేవుడు, పుణ్యం, పాపం అనేవి ఊహకు కూడా అందవు. తిండి కష్టం, బట్ట కష్టం, అనారోగ్యం.. పుణ్యం వలన వచ్చిన డబ్బులు తాగుడు జూదం వంటి వాటికి ఖర్చు చేసి ఆ రోజుకు హాయిగా నిదిరిస్తాడు. బుద్దికూడా సవ్యమార్గంలో ఉండకపోవడంతో కొన్ని వందల జన్మలు ఇలా పుడుతూ చస్తూ మళ్లీమళ్లీ అలానే జరుగుతుంది. కానీ ఏదో ఒకజన్మలో పుణ్యం చేసే తీరతారు. పుణ్యం పెరగడం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు కూడా బుద్ది పెడత్రోవ పడితే మళ్ళీ మొదలెత్తుకోవాలి. ఇవి ప్రారబ్ద ఫలితం.*



*ఆగామి కర్మ.. ఈజన్మలో చేసిన పాపం పుణ్యం ఈజన్మలో కాకుండా వెళ్లి సంచిత కర్మలు అనే సంచిలో చేరతాయి. మీజన్మలకు హేతువులవుతాయి. ఎలాంటి జన్మ కావాలో బుద్ధితో ఆలోచించి మనమే నిర్ణయం చేసుకోవచ్చు.*



*ప్రారబ్ద వశాన కష్టానష్టాలతో, సుఖసంతోషాలతో బ్రతుకు సాగుతున్నా బుద్దితో యోచన చేస్తూ ముందుకి సాగితే రాబోయే జన్మలలో ఉత్తమ జన్మలు పొంది సద్గురువు సేవ చేస్తూ యోగం ద్వారా ధ్యానం ద్వారా కర్మలను జ్ఞానాగ్నితో, యోగాగ్నితో దగ్ధం చేసి,... జీవుడిని బ్రహ్మంలో ఐక్యం చేసుకోవచ్చును. మానవ జన్మ ఇంతటి దుర్లభం. కనుక క్షణమైనా వృథా చేయకుండా సద్వినియోగం పరుచుకోవాలి.*


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: