🙏మహాభారతం - శాంతి పర్వం 🙏
సప్తమ భాగం
కృష్ణుడి మాటలు విని ధర్మరాజు " కృష్ణా ! నాకు సృంజయుడి వృత్తాంతం వినాలన్న కోరిక కలుగుతుంది. వివరించు " అని అడిగాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! నీవు వ్యాసుడి వలన నారదుడి వృత్తాంతం విని ఉన్నావు. పర్వతుడి వృత్తాంతం విని ఉన్నావు అదికూడా చెప్తాను విను. ఒకసారి నారదుడు పర్వతుడు దివినుండి భువికి దిగివచ్చారు. ఆ సమయంలో వారిరువురు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒకరి మానసులోని మాట ఒకరికి దాపరికం లేకుండా చప్పాలన్నదే ఆ ఒప్పందం. అలా చెయ్యని ఎడల శాపగ్రస్తులు ఔతారన్నది ఆ ఒప్పందం. అలా వారిరువురు విహరిస్తూ వారు ఒకరోజు సృంజయుడిని కలుసుకున్నారు. వారు సృంజయుడి కోరికమీద అతడి గృహంలో కొన్ని రోజులు ఉందామని అనుకున్నారు. అప్పుడు సృంజయుడు తన కుమార్తె సుకుమారిని పిలిచి " అమ్మా ! వీరు మహర్షులు. వీరి సేవచేసి తరించు " అని చెప్పాడు. సుకుమారి అందుకు అంగీకరించింది. సుకుమారి సేవలతో నారదుడు, పర్వతుడు ఆనందంగా కాలం గడుపుతున్నారు. అతిలోక సుందరి అయిన సుకుమారి మీద మనసుమరులుగొన్న నారదుడు బయటకు చెప్పుకోలేక లోలోపలే కృంగిపోసాగాడు. నారదుడు అలా చిక్కిపోవడం చూసిన పర్వతుడు సందేహించి దివ్యదృష్టితో నారదుడి మనసులో విషయం తెలుసుకున్నాడు. పర్వతుడు తమఒప్పందం ప్రకారం నారదుడు తన మనసులో మాట బయటపెట్టనందుకు ఆగ్రహించి " నారదా ! నీకు సుకుమారి మీద మనసు లగ్నమైన విషయం నా వద్ద దాచి మనఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నేను నిన్ను శపిస్తున్నాను. నీవు ఆమెమీద మనసుపడ్డావు కనుక ఆమెను వివాహంచేసుకోకుండా ఉండలేవు. ఆమెను వివాహం చేసుకున్న మరుక్షణం నీకు కోతిముఖం ప్రాప్తించుగాక ! అని శపించాడు. అందుకు నారదుడు పర్వతుడి మీద కోపించి " నీకిక స్వర్గ లోక ప్రాప్తి ఉండక ఉండుకాక " అని ప్రతిశాపం ఇచ్చాడు. తరువాత నారదుడు శాపానికి భయపడక సృంజయుడి సహాయంతో అతడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పర్వతుడి శాపవశాన అతడికి కోతిముఖం వచ్చింది. అతడిభార్య సుకుమారి నారదుడి కురూపానికి అసహ్యించుకోక అతడిని సేవిస్తుంది. ఒక రోజు నారదుడు సమీపంలోని అరణ్యానికి వెళ్ళి అక్కడ పర్వతుడిని కలుసుకున్నాడు. పర్వతుడు నారదుడితో " నారదా ! నీవు నాకు ఇచ్చిన శాపం మరల్చవా ! " అని అడిగాడు. నారదుడు " పర్వతా ! నీవేకదా నాకు ముందుగా శాపం ఇచ్చావు. కనుక నీవు నీ శాపాన్ని ముందుగా మరల్చిన నేను నా శాపాన్ని వెనక్కు తీసుకుంటాను " అన్నాడు పర్వతునితో. నారదుడు పర్వతుడు తమతమ శాపాలను వెనక్కు తీసుకున్నందున నారదుడికి నిజరూపం వచ్చింది. వారిరువురు సృంజయుడి ఇంటికి వెళ్ళారు. అక్కడ సుకుమారి వారిని గుర్తించక ఎవరో కొత్తవాళ్ళనుకుని లోపలకు వెళ్ళబోయింది. అప్పుడు పర్వతుడు " సుకుమారీ ! ఇతడు నారదుడు నీ భర్త. నేను ఇచ్చిన శాపవశాన నారదుడికి వానరముఖం వచ్చింది. నేను నా శాపం వెనక్కు తీసుకున్నందున అతడికి నిజరూపం వచ్చింది " అని చెప్పగానే అప్పుడు సుకుమారి కూడా తనభర్తను గుర్తించింది " అని కృష్ణుడు చెప్పాడు.
తరువాత కథను నారదుడు చెప్పసాగాడు " ధర్మరాజా ! అలా నేను పర్వతుడితో కొంతకాలం సృంజయుడి ఇంట్లో ఉండి కొన్నిసంవత్సరాల అనంతరం తిరిగి స్వర్గలోకం పోవానని అనుకున్నాము. వెళ్ళే సమయాన మా పట్ల గౌరవాభిమానాలు చూపించిన సృంజయుడికి ఏదైనా మేలు చేయాలన్న తలంపుతో నేను అతడికి దేవతలకన్నా ఉన్నతుడైన కుమారుడు కలగాలని వరం ఇచ్చాను. పర్వతుడు సృంజయుడికి కలుగబోయే కుమారుడి వలన ఇంద్రుడికి ఏదైనా కీడు కలుగకలదన్న తలంపుతో " సృంజయా ! ఆ కుమారుడు అర్ధాయుష్కుడు కాగలడు " అన్నాడు. అమాటలకు నాకు కోపంవచ్చి " సృంజయా ! ఆ కుమారుడిని నీకు చేతనైనంత కాపాడుకో. నీ శక్తికి మించి నీకుమారుడికి మరణం సంభవించిన వెంటనే నన్ను తలచిన నేను వచ్చి అతడికి ప్రాణదానం చేస్తాను. అలాగే నేను నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీ కుమారుడి శరీరంలోని విసర్జితాలు అన్నీ స్వర్ణ మయం ఔతాయి. అందు వలన అతడు సువర్ణష్టీవి అని పిలువబడతాడు " అని అన్నాను. నా మాటలకు సృంజయుడు ఆనందపడ్డాడు. తరువాత మేము వెళ్ళి పోయాము. నా వరంవలన సృంజయుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి మలమూత్రములు, శ్వేదం మిగిలిన విసర్జితాలన్నీ బంగారంగా మారసాగాయి. సృంజయుడి ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయాన్ని పసికట్టిన కొందరు దొంగలు సువర్ణష్టీవివిని అపహరించి తీసుకు వెళ్ళి అతడి నోట్లో గుడ్డలుకుక్కి సమీపంలోని అడవిలోకి తీసుకు వెళ్ళారు. అతడి శరీరమంతా శోధించి ఎక్కడా సువర్ణం లభ్యంకాక వారు సువర్ణష్టీవిని చంపి అక్కడే పారవేసి వెళ్ళారు. సృంజయుడు తన కుమారుడు కనిపించక అంతటా వెతికి చివరకు నారదుడిని తలచుకున్నాడు. నేను అతడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం తెలుసుకుని సువర్ణష్టీవి మరణ వృత్తాంతం చెప్పాను. సృంజయుడు సువర్ణష్టీవి మరణానికి ఎంతో దుఃఖించాడు. నేను " సృంజయా ! నీ కుమారుడు యమలోకంలో ఉన్నాడు. నీ కుమారుడిని నేను తీసుకు వస్తాను " అని చెప్పి సువర్ణష్టీవిని పునరుజ్జీవితుడిని చేసాను. సృంజయుడు చాలా సంతోషించాడు. నేను సృంజయుడితో " సృంజయా ! ఇంద్రుడు నీ కుమారుడిని చంపడానికి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు " అని చెప్పి వెళ్ళాను. దేవేంద్రుడికి సువర్ణష్టీవి వలన తనకు ఆపద కలుగకలదన్న భయం పట్టుకుంది. ఒకరోజు సృంజయుడు తన భార్యాబిడ్డలతో గంగా నదీతీరాన విహరిస్తున్న సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వ్యాఘ్ర రూపంలో అతడి మీద ప్రయోగించాడు. వజ్రాయుధం తగిన సమయం చూసి వ్యాఘ్రరూపం ధరించి సువర్ణష్టీవిని చీల్చిచంపి మాయం అయింది. సువర్ణష్టీవి మరణానికి దుఃఖిస్తూ సృంజయుడు నన్ను తలచుకున్నాడు. నేను వెళ్ళి సువర్ణష్టీవిని సజీవుడిని చేసి తిరిగి వెళ్ళిపోయాను. సువర్ణష్టీవి దీర్ఘాయుష్కుడై వేలాది సంవత్సరములు రాజ్యపాలన చేసాడు.ధర్మరాజా ! నీవు కూడా నీ పట్టు వదిలి రాజ్యభారం వహించు.
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి