25, జనవరి 2025, శనివారం

12-12-గీతా మకరందము

 12-12-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ| కర్మఫలత్యాగము యొక్క విశిష్టతను నిరూపించుచున్నారు-


శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ధ్యానాత్కర్మఫలత్యాగః

త్యాగాచ్ఛాంతిరనన్తరమ్.


తా:- (వివేకముతో గూడని)అభ్యాసముకంటె (శాస్త్రజన్య)జ్ఞానము శ్రేష్టమైనది కదా! (శాస్త్రజన్య)జ్ఞానముకంటె ధ్యానము శ్రేష్టమగుచున్నది. ధ్యానము (ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగనుండు మనఃస్థితి) కంటె కర్మఫలమును విడుచుట (ప్రవృత్తియందును విషయదోషములేకుండుట) శ్రేష్టమైయున్నది. అట్టి కర్మఫలత్యాగముచే శీఘ్రముగ (చిత్త)శాంతి లభించుచున్నది.


వ్యాఖ్య: - ఇచట అభ్యాసమని చెప్పినచోట వివేకముతో గూడని అభ్యాసమనియు, జ్ఞానమని చెప్పినచోట శాస్త్రజన్యజ్ఞానమని, ధ్యానమని చెప్పినచోట అసంపూర్ణమగు ధ్యానమని, ధ్యానకాలమందు మాత్రము విషయదోషములేని స్థితియని, అనగా ధ్యానాభ్యాసియొక్క స్థితియని గ్రహించుకొనవలెను.


"జ్ఞానాద్ద్యానం విశిష్యతే"- "వాచా"జ్ఞానముకంటె అనుభవపూర్వకమైన జ్ఞానము గొప్పది. జ్ఞానవిషయములను తదేకనిష్ఠతో చింతనచేయుటయే, అనుభూతమొనర్చుకొనుటయే ధ్యానము. కాబట్టి "వాచాజ్ఞానముకంటె,  శాస్త్రజన్యజ్ఞానముకంటె ధ్యానము గొప్పదని వచింపబడినది.


' ధ్యానాత్కర్మఫలత్యాగః'- కర్మఫలములను త్యజించువాని మనస్సు అసంగమై, విషయదోషము లేనిదైయుండును. ధ్యానాభ్యాసికి ధ్యానకాలమందు మాత్రము చిత్తము నిర్విషయమైయుండును. త్యాగికి ఎల్లప్పడును అట్లేయుండును. కనుకనే ధ్యానము కంటె కర్మఫలత్యాగము శ్రేష్టమని చెప్పినారు. దీనిని బట్టి నిష్కామకర్మయోగమెంత మహిమ గలిగియున్నదో స్పష్టమగుచున్నది. జనులలో అధికులకు నివృత్తి కంటె ప్రవృత్తిసంస్కారమే ఎక్కువగ యుండియుండును. కాబట్టి అట్టివారు కర్మలనాచరించుచు కర్మఫలత్యాగమును చక్కగ అలవాటు చేసికొనినచో వారు ధ్యాన్యాభ్యాసికంటె, జ్ఞానాభ్యాసికంటె గొప్పస్థానమును బొందినవారగుదురు. మరియు భక్తికొఱకైనను, ధ్యానముకొరకైనను, జ్ఞానము కొరకైనను చిత్తశుద్ది చాల అవసరము. అదియో, నిష్కామకర్మయోగముచే, కర్మఫలత్యాగముచే లభించుచున్నది. కాబట్టి అద్దానిని చక్కగ అనుష్ఠించినచో మాత్రమే - పునాది గట్టిగనున్నచో పైనగల మేడయు సుస్థిరముగ నుండునట్లు - ధ్యాన, జ్ఞానాదులన్నియుకూడ చక్కగ అభివృద్ధి నొందగలవు. కనుకనే భగవాను డీశ్లోకమున నిష్కామకర్మయోగము (కర్మఫలత్యాగము) యొక్క ప్రాశస్త్యమును వెల్లడించిరి.


"త్యాగాచ్ఛాంతిరనన్తరమ్"-

 కర్మఫలత్యాగముచే, ఈశ్వరార్పణ బుద్ధిచే చిత్తము శుద్ధమగుటవలన వెంటనే శాంతి ఉదయించుచున్నది. కర్తృత్వత్యాగమువలననే, అహంభావత్యాగమువలననే, దోషత్యాగమువలననే, ప్రాపంచికవిషయసుఖత్యాగము

వలననే శాంతి లభింపగలదు. చిత్తమందలి దోషములు తొలగుటయే శాంతికి మార్గము, (తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషామ్). ఏలయనగా నిర్మలచిత్తమున ఆత్మ ప్రత్యక్షము కాగలదు. దుఃఖభూయిష్ఠమగు ఈ సంసారమున ప్రతివాడును శాంతినే అభిలషించుచున్నాడు. కాని ఆ శాంతి యెట్లు లభింపగలదో తెలియజాలకున్నాడు. 'త్యాగాత్ శాంతిః = త్యాగము వలననే శాంతిచేకూరునని భగవాను డిచట స్పష్టముగ తెలియజేసెను. కాబట్టి విషయసుఖములను, కర్మఫలములను, మమత్వమును, అహంభావమును, కర్తృత్వమును, త్యాగముచేసి పరమశాంతిని జీవుడనుభవించవలెను.


ప్ర:- కర్మఫలత్యాగముయొక్క మహిమయెట్టిదో పేర్కొనుము?


ఉ:- అది (వివేకముతో గూడని)అభ్యాసము కంటెను, (శాస్త్రజన్య)జ్ఞానము కంటెను, (ధ్యాన కాలము మాత్రము నిర్విషయస్థితిగలిగియుండు)ధ్యానముకంటెను శ్రేష్టమైనది.


ప్ర:- శాంతి యెట్లు లభించును?

ఉ:- (కర్మఫల)త్యాగముచే.

కామెంట్‌లు లేవు: