19, మే 2024, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*835వ నామ మంత్రము*


*ఓం వివిక్తస్థాయై నమః* 


జనులు లేని పవిత్రప్రదేశముల యందు లేదా ఆత్మానాత్మ వివేకము గల వారి యందు విలసిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వివిక్తస్థా* యను నాలుగక్షరముల చతురక్షరీ నామ మంత్రమును *ఓం వివిక్తస్థాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని  ఆరాధించు భక్తులను ఆ తల్లి వారి మనస్సులందు పవిత్ర భావములు, వారి మాటలయందు పవిత్ర భాషణము, వారి చేతలలో సత్కర్మాచరణమును సుస్థాపితము జేస్తూ, వారి యునికితోనే వారుండుప్రదేశము ఒకపుణ్యక్షేత్రముగా భావింపజేస్తూ వారిని తరింపజేయును.


పరమేశ్వరి పరమేశుని రాణి. ఆ పరమేశ్వరుడు స్మశానవాటికయందు ఉంటాడు. ఎందుకో తెలుసా? ఈ మాటే పరమేశ్వరి పరమేశ్వరుని అడిగింది.     అందుకు పరమేశ్వరుడు ఇలాచెప్పాడు. పార్వతీ! మానవుడు  వజ్రవైడూర్యాది రత్నములు పొదిగిన కాంచనాభరణములు, భవనములు, రాజ్యములు, ధనరాశులు కూడబెడతాడు. జీవుడు పోతాడు అంటే భవనంలోంచి బయటకు తీసేస్తారు. ప్రాణాలు పోతే అందరూ స్మశానం వరకూ వస్తారు. గంధపుచెక్కలలో శరీరాన్ని పెట్టి, పుత్రునిచే నిప్పు పెట్టిస్తారు. అంతే అంతవరకూ వచ్చిన బంధుజనం అంతా స్మశానం విడిచి వెళ్ళిపోతారు. చివరకు కపాలమోక్షం కాగానే కొరవి పెట్టిన కొడుకు కూడా స్మశానం వదలి వెళ్ళిపోతాడు. ఆ కట్టెలలో కాలుతున్న దేహం దిక్కులేక కాలుతూ తనకోసం ఎవరూ లేరా అని ఏడుస్తూ ఉంటే, కనీసం నేనైనా ఉండవద్దా పార్వతీ! అని పరమేశ్వరికి పరమార్థాన్ని తెలియజేశాడు. అప్పటినుండి పరమేశ్వరికూడా అక్కడే ఆయనతో  ఉంటుంది. ఆయన వెండి కొండపైకి వెళ్ళినప్పుడు వెళుతూ, మళ్ళీ ఆయనతో వల్లకాటిలోనికే వస్తూ ఉంటుంది. అందుకే బ్రహ్మోపేంద్ర మహేంద్రాదులు ఆ అమ్మ దర్శనం కోసం వల్లకాటిలోనికే వస్తున్నారు. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడే పవిత్రత. ఆ వల్లకాడే విజనప్రదేశం. పరమేశ్వరుడున్న పవిత్రప్రదేశం. అటువంటి చోటనే అమ్మ ఉంటుంది.    వెండికొండ (కైలాసం కూడా) అంతే కదా. విజన ప్రదేశమేకదా. *మనుష్యులు లేని ప్రదేశమంతయు పవిత్రమయినది* అని హరీతస్మృతిలో చెప్పబడినది. అంటే? మనుష్యులు లేని ప్రదేశం పవిత్రమైనదని అర్థము. కారణం? నరుడు నడచిన మార్గంలో గడ్డికూడా ఎండి పోతుంది. ఒకసారి ఆది శంకరుడు భిక్షాటనముకు వెళ్ళాడు. బాగా పొద్దుపోయింది. ఒక ఇల్లాలు ఆయనకు భిక్షవేసినది. బాగా పొద్దుపోయింది. వెళ్ళవద్దు. ఊరి బయట మహాకాళి తిరుగుచున్నది. నరసంచారం అయితే ఆ తల్లికి కోపంవచ్చి చంపేస్తుంది అని చెప్పింది.  రాత్రి అయితే మరింత ప్రశాంతంగా ఉంటుందని పరమేశ్వరునితో  విహరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నరుడు కంటబడితే ఆమెకు కోపంవచ్చి నరుడిని చంపేసి కపాలం మెడలో వేసుకుంటుంది. అందుకని ఆది శంకరుడిని వెళ్ళవద్దంది. ఆ తల్లిచేతిలో చావైనా మహావరమని ఆదిశంకరుడు విజనప్రదేశంలో మహాకాళి సంచరిస్తున్న ప్రదేశానికి వెళతాడు.  మహాకాళి రూపంలో ఉన్న పరమేశ్వరి ఆదిశంకరుడిని చూసి హుంకరిస్తుంది. కళ్ళనుండి నిప్పులు కురిపిస్తుంది. తన చేతిలోని మహాఖడ్గాన్ని ఆదిశంకరునిపైకి తీసుకువెళుతుంది. అప్పుడు ఆదిశంకరులు కదలకమెదలక చిరునవ్వు నవ్వుతూ ఆ తల్లిని . మూకాంబికా స్తోత్రంతో శాంతపరచుతాడు. ఆ మహాకాళి ఉగ్రరూపం నుండి శాంతస్వరూపానికి మార్చుతాడు.  *తల్లీ! నీవెక్కడ ఉంటే అక్కడే పవిత్రమైన ప్రదేశం. నిన్ను సేవించేవారెవరైననూ ఆత్మానాత్మ వివేకము గలవారగుదురు. నిన్ను దర్శించడానికి వచ్చేవారి చూపులకు నీవు ప్రసన్నవదనంతో ఉండాలి గాని ప్రళయభీకరమైన హుంకరింపులు వద్దమ్మా* యని విన్నవించుకుంటాడు. అమ్మవారు ఆదిశంకరులు చెప్పినట్లు మూకాంబికాదేవిగా శాంతస్వరూపిణిగా విలసిల్లినది.


మన పవిత్రతను బట్టి పరమేశ్వరి మనకు గోచరిస్తుంది. ఆ తల్లి ఉగ్రరూపిణి కాళీమాత కావచ్చు, శాంతరూపిణియైన పరమేశ్వరి కావచ్చు చూచువారికి చూడగలిగినంత, ప్రాప్తియున్న వారికి ప్రాప్తియున్నంత.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వివిక్తస్తాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: