19, మే 2024, ఆదివారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము

 


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*374వ నామ మంత్రము* 


*ఓం కృతజ్ఞాయై నమః*


పుణ్య పాపములు రెండింటిని తెలిసియున్న పరమేశ్వరికి నమస్కారము.


కృతములను తెలిసికొను తొమ్మండుగురుకి సాక్షియై ఉన్నట్టి శ్రీమాతకు నమస్కారము.


కృతయుగమునందువలె ఎల్లప్ఫుడు పరిపూర్ణమైన జ్ఞానము గలిగిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కృతజ్ఞా* యను మూడక్షరముల *త్ర్యక్షరీ* నామ మంత్రమును     *ఓం కృతజ్ఞాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి కరుణచే కృత్యాకృత్యముల తారతమ్యము తెలిసి, వేదవిహిత కృత్యములే ఒనరించువారిగా మెలగుచూ తరించుదురు.


*కృత* అనగా చేయునది. *జ్ఞా* అనగా తెలిసికొనుట. అనగా జీవులు చేయు మంచి చెడులను తెలిసికోగల జ్ఞానస్వరూపురాలు గనుక *కృతజ్ఞా* యని అనబడినది. 


1. సూర్యుడు, 2. చంద్రుడు, 3. యముడు, 4. కాలము, 5. పంచమహాభూతములు (5) (భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము) అను ఈ తొమ్మిదింటికి పరమేశ్వరి సాక్షి స్వరూపురాలు. గనుకనే *కృతజ్ఞా* యని అనబడినది.  జగన్మాత తనకు ఇతరులు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేయునది. అమ్మను స్మరించుటయే, లేదా ఉపాసించుట, అమ్మ నామ మంత్రము జపించుట, అమ్మను సాటి ప్రాణులలో గమనిస్తూ, ఆ ప్రాణులకు ఉపకారము చేయుట - ఇలాంటివి అన్నియు ఆ తల్లి తనకు ఉపకారము అని భావించి తిరిగి అట్టి ఉపకారులకు ప్రత్యుపకారము చేయునది గనుక శ్రీమాత *కృతజ్ఞా* యని అనబడినది.


*కృత* అనగా కృతయుగము. కృతయుగమునందు ధర్మము నాలుగు పాదములపై నడచియున్నది.  పాపపుణ్యముల విచక్షణ తెలిసియున్నవారే. పాపకృత్యములు చేయుటకు భయపడెడివారు. కృత యుగములో అందరూ జ్ఞానస్వరూపులే.  పరమేశ్వరి ఆ యుగధర్మమును తెలిసియున్నది గనుక  పరమేశ్వరి *కృతజ్ఞా* యని అనబడినది. ఇంకను చెప్పవలెనంటే కృతయుగధర్మమువలె తానన్ని యుగములందును, సర్వకాలములందును ఉంటుంది గనుక శ్రీమాత *కృతజ్ఞా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం కృతజ్ఞాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: