19, మే 2024, ఆదివారం

సిరికొలువు

 _*సిరికొలువు*_


_*(తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ)*_

 *19.భాగం*


_*వైకుంఠ దర్శనం-శాపగ్రస్తులు*_


పూర్వ సనత్కుమార సనత్సుజాతులు అను నలుగురు మహర్షులు వుండేవారు. వీరు నలుగురూ బ్రహ్మదేవుని మనస్సంకల్పం చేత జన్మించారు. అందుకే వారిని బ్రహ్మ మానస పుత్రులని అంటారు. 


వీరి శరీర ప్రమాణం మాత్రం బొటన వ్రేలడంత! అయితే ఏం? వారికున్న బ్రహ్మజ్ఞానం మాత్రం బోలెడంత! త్రికాల జ్ఞానసంపన్నులైన వీరు ఎప్పుడైనా, ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లగల సమర్థులు.


ఆ నలుగురూ అలా సంచారం చేస్తూ ఒకప్పుడు ఉన్నపళంగా వైకుంఠానికి వెళ్లారు. భక్తుల పాలిటి పారిజాతం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రమానాథుని దర్శనం కోసం వైకుంఠంలో ప్రవేశించారు. వారికి అడ్డేమిటి? కాని అడ్డు తగిలింది.


వారు వెళ్లిన వేళావిశేషం ఏమిటోకాని వైకుంఠంలోని ద్వారపాలకులు. జయ విజయులు నిక్కచ్చిగా వారిని అడ్డుకున్నారు. లోనికి వెళ్లడానికి వీల్లేదన్నారు. లోపల శ్రీలక్ష్మీ శ్రీమన్నారాయణులు ఏకాంతంగా వున్నారనీ, ఈ సమయంలో ఎవరూ లోనికి వెళ్లకూడదని అడ్డుచెప్పారు.


పరమశాంత స్వరూపులైన బ్రహ్మమానస పుత్రులకు తీవ్రంగా మనస్తాపం కలిగింది. తమకు జరిగిన అవమానానికి కోపంతో ఊగిపోయారు. తమను అడ్డగించిన ద్వారపాలకులను భూలోకంలో రక్కసులుగా జన్మించ వలసిందిగా ఆ మహాయోగులు తీవ్రంగా శపించారు.


ఈ హఠాత్పరిణామానికి జయ విజయులిద్దరూ హతాశులయ్యారు. సనక సనందనాదులు రూపుదాల్చిన పరమశాంత స్వరూపులు. కాని క్షణికావేశానికి లోనయ్యారు. వారి కోపం కట్టలు తెంచుకొంది.


జగన్మాతా జగద్ధాతా! అయిన శ్రీ లక్ష్మీ నారాయణులు ఇరువురు ఏకాంతవాసంలో వుండనే వుండరా! వారికి ఏకాంతం అవసరం లేదా! వుండదా!అలాంటి సందర్భాల్లో కూడా ఎంత సన్నిహితులైన వారైనా వారి ఏకాంతానికి భంగం కలిగించవచ్చా! లోపలికి దూసుకెళ్లవచ్చా! 


ఇలాంటి విచక్షణా జ్ఞానం

కోల్పోవడమేగాక తీవ్రంగా శపించడమా! అలాంటి మహనీయులు అలా ప్రవర్తించవచ్చా? అదే విధి బలీయం అంటారు పెద్దలు!


నిరంతరమూ ప్రశాంతధామమైన శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుని అభ్యంతర మందిరానికి ప్రధాన ద్వారమైన బంగారు వాకిళ్ల దగ్గర జరిగిన అలజడికి, ఆందోళనకు ఏకాంత భంగం కాగా లోపలినుంచి శ్రీ మహావిష్ణువు పరుగు పరుగున వెలుపలికి వచ్చాడు. 


పరంధాముడు పరిస్థితిని గమనించాడు. ఏమీ జరగనట్లుగానే, ఏదీ గమనించలేదన్నట్లుగానే ఆ లీలా వినోది ఆ యోగీశ్వరులకు నిండుగా దర్శనమిచ్చి ఆనందపరచి వీడ్కోలు పలికినాడు.


అంతే! జయ విజయు లిద్దరూ కుప్పకూలి పోయారు. నారాయణుని కాళ్లా వేళ్ళా పడి శరణు వేడినారు. స్వామివారు తన భటులను అనునయిస్తూ “జయా! విజయా! ఆ మహనీయుల శాపాన్ని అనుభవించవలసిందే. తప్పదు. గాక తప్పదు. దాన్ని తిప్పటం ఎవరికిని సాధ్యం కానే కాదు. 


అందువల్ల కేవలం మూడు జన్మల్లో రాక్షసులుగా జన్మించి నిరంతరం, అంతరాంతరాల్లో నన్నే ద్వేషిస్తూ వైరభక్తితో అతి తొందర్లోనే నన్ను చేరుకొంటారు! అని వారిని ఊరడించాడు."


శ్రీ వైకుంఠంలో జరిగిన ఈ తీవ్ర పరిణామానికి దేవతలు సంతోషించారు.పరమయోగులు పరమానందపడినారు. దేవర్షి నారదుడు శ్రీస్వామివారి మరో అవతారానికి ఇది నాంది అవుతుందేమో!" అనుకుంటూ నారాయణ! నారాయణ! అంటూ త్రిలోక సంచారానికి బయలుదేరినాడు.మళ్లీ ఎప్పటిలాగానే శ్రీ వైకుంఠంలో గంభీరమైన ప్రశాంతత చోటు చేసుకుంది.


 *గోవిందా గోవింద గోవిందా!!!* 


 *5 వ అధ్యాయం సంపూర్ణం*

కామెంట్‌లు లేవు: