19, మే 2024, ఆదివారం

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*


*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*44.14 (పదియవ శ్లోకము)*


*గోప్యస్తపః కిమచరన్ యదముష్య రూపం లావణ్యసారమసమోర్ధ్వమనన్యసిద్ధమ్|*


*దృగ్భిః పిబంత్యనుసవాభినవం దురాపమేకాంతధామ యశసః శ్రీయ ఐశ్వరస్య॥9961॥*


*మఱికొందరు స్త్రీలు ఇంకను ఇట్లు నుడివిరి* సఖులారా! గోపికలు నిరంతరము శ్రీకృష్ణునియొక్క రూపమాధుర్యమును తమ నేత్రములద్వారా ఆస్వాదించుచు, ఆనందించుచుందురు. వారు తమ పూర్వజన్మలలో ఎట్టి తపస్సులను ఆచరించిరో? (ఎట్టి నోములను నోచిరో) ఏమో! ఆయన రూపము దివ్యము, ఏకత్రరాశీభూతమైన సర్వలోకలావణ్యసారము. దానితో సమానమైనది లేనేలేదు. ఇక మించినది (అధికమైనది)  ఎట్లుండును? ఆయన రూపలావణ్య వైభవములు వస్త్రాభరణములతో వచ్చినవి కావు, సహజసిద్ధములు. ఆ దివ్యరూపమును ఎంతగా చూచినను తనివి తీరదు. అది నిత్యనూతనము. ఐశ్వర్యమునకు, సౌందర్యమునకు, యశస్సునకు అది నిధానమైనది. ఆ అద్భుతరూప దర్శనభాగ్యము గోపికలను తప్ప ఇతరులకు దుర్లభము. నిజముగా ఆ గోపాంగనల అదృష్టమే అదృష్టము".


*44.15 (పదిహేనవ శ్లోకము)*


*యా దోహనేఽవహననే మథనోపలేప్రేంఖేంఖనార్భరుదితోక్షణమార్జనాదౌ|*


*గాయంతి చైనమనురక్తధియోఽశ్రుకంఠ్యో  ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమచిత్తయానాః॥9962॥*


*మఱికొందరు స్త్రీలు ఇంకను ఇట్లు నుడివిరి* వ్రేపల్లెయందలి గోపికలు పాలు పితుకుచును, ధాన్యాదులను దంచునప్పుడును, పెఱుగులు చిలుకుచున్నప్పుడును, ఇండ్లను అలుకుచును, చిన్నారులను నిద్రపుచ్చుచు, ఉయ్యాలలను ఊపుచున్నప్పుడును, పిల్లలను జోకొట్టుచును (సముదాయించుచును), ఇండ్లముందు ఊడ్చుచున్నప్పుడును, కలాపి చల్లుచున్నప్పుడును, శ్రీకృష్ణప్రభువునందే తమ చిత్తములను లగ్నమొనర్చి, ఆర్ధ్రహృదయముతో ఆనందపరవశులై ఆ స్వామిని కీర్తించుచుందురు. కనుక, వారు ఎంతయో ధన్యురాండ్రు".


*44.16 (పదహారవ శ్లోకము)*


*ప్రాతర్వ్రజాద్వ్రజత ఆవిశతశ్చ సాయం గోభిః సమం క్వణయతోఽస్య నిశమ్య వేణుమ్|*


*నిర్గమ్య తూర్ణమబలాః పథి భూరిపుణ్యాః పశ్యంతి సస్మితముఖం సదయావలోకమ్॥9963॥*


*మఱికొందరు స్త్రీలు ఇంకను ఇట్లు నుడివిరి* "శ్రీకృష్ణుడు ప్రాతఃకాలమునందు గోవులను మేపుటకై గోకులమునుండి వనమునకు వెళ్ళుచుండెడివాడు. సాయంసమయమున గోవులతోగూడి వ్రజభూమికి తిరిగి వచ్చుచుండెడివాడు. అప్పుడు ఆ స్వామి వీనులవిందుగా మురళిని ఊదుచుండెడివాడు. ఆ మధురవేణునాదమును విన్నంతనే గోపికలు తమ పనులను అన్నింటిని ప్రక్కనబెట్టి పరమసంతోషముతో పరుగుపరుగున తమ ఇండ్లనుండి బయటికి వచ్చెడివారు. ఆ సమయమున చిఱునవ్వుల కాంతులతోను, దయాపూర్ణములైన చూపులతో సోయగము లొలుకుచుండెడి ఆ స్వామియొక్క ముఖసౌందర్యమును కన్నులప్పగించి చూచుచు గోపికలు పరమానందభరితులగుచుండెడివారు. యథార్థముగా ఆ గోపాలాంగనలు ఎంతటి పుణ్యాత్ములోగదా".


*44.17 (పదిహేడవ శ్లోకము)*


*ఏవం ప్రభాషమాణాసు స్త్రీషు యోగేశ్వరో హరిః|*


*శత్రుం హంతుం మనశ్చక్రే భగవాన్ భరతర్షభ॥9964॥*


*శ్రీశుకుడు ఇట్లు పలుకుచుండెను* పరీక్షిన్మహారాజా! మథురాపురకాంతలు ఇట్లు మాట్లాడుకొనుచుండగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్మ ద్వంద్వయుద్ధమున తనకు ప్రత్యర్ధిగా నున్న చాణూరుని హతమార్చుటకు నిశ్చయించుకొనెను.


*44.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*సభయాః స్త్రీగిరః శ్రుత్వా పుత్రస్నేహశుచాఽఽతురౌ|*


*పితరావన్వతప్యేతాం పుత్రయోరబుధౌ బలమ్॥9965॥*


ఇట్లు మథురానగర స్త్రీలు భయాందోళనలతో పలుకుచున్న మాటలను విన్నంతనే దేవకీవసుదేవులు మిగుల భీతిల్లుచు విహ్వలులైరి. బాలురైన బలరామకృష్ణులయొక్క బలపరాక్రమములను ఎఱుగక పుత్రమమకార ప్రభావమున వారు మిక్కిలి ఆందోళనకు లోనైరి.


*44.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తైస్తైర్నియుద్ధవిధిభిర్వివిధైరచ్యుతేతరౌ|*


*యుయుధాతే యథాన్యోన్యం తథైవ బలముష్టికౌ॥9966॥*


శ్రీకృష్ణ చాణూరులు వివిధములగు ఆయా ద్వంద్వయుద్ధ విధానములతో (పరిభ్రమణ విక్షేపాదులతో) పెనుగులాడుచు పోరాడుచుండిరి. అట్లే బలరామముష్టికులును పోరుసలుపుచుండిరి.


*44.20 (ఇరువదియవ శ్లోకము)*


*భగవద్గాత్రనిష్పాతైర్వజ్రనిష్పేషనిష్ఠురైః|*


*చాణూరో భజ్యమానాంగో ముహుర్గ్లానిమవాప హ॥9967॥*


కృష్ణభగవానుని యొక్క అంగములన్నియును వజ్రములవలె కఠినాతి కఠినములైనవి. ఆ స్వామి బలమైన తన మోచేతులతో, మోకాళ్ళతో పదేపదే తీవ్రముగా పొడుచుచుండుటవలన చాణూరుని దేహమంతయును పూర్తిగా హూనమైపోవుచుండెను. ఆ పోటులకు తాళజాలక ఆ మల్లయోధుడు (చాణూరుడు) ఎంతయు అలసిపోవుచుండెను.


*44.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*స శ్యేనవేగ ఉత్పత్య ముష్టీకృత్య కరావుభౌ|*


*భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్యబాధత॥9968॥*


అంతట ఆ చాణూరుడు క్రుద్ధుడై, డేగవేగముతో ఎగిరి, తన రెండు చేతుల పిడికిళ్ళను బిగించి, శ్రీకృష్ణభగవానుని వక్షస్థలముపై బలముగా దెబ్బతీసెను.


*44.22 (ఇరువది రెండవ  శ్లోకము)*


*నాచలత్తత్ప్రహారేణ మాలాహత ఇవ ద్విపః|*


*బాహ్వోర్నిగృహ్య చాణూరం బహుశో భ్రామయన్ హరిః॥9969॥*


*44.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*భూపృష్ఠే పోథయామాస తరసా క్షీణజీవితమ్|*


*విస్రస్తాకల్పకేశస్రగింద్రధ్వజ ఇవాపతత్॥9970॥*


కాని, శ్రీకృష్ణుడు పూలమాలలతో కొట్టబడిన ఏనుగువలె, ఆ శత్రువుయొక్క పిడికిలి పోటులకు ఏమాత్రమూ చలించలేదు. అంతేగాక! ఆ ప్రభువు తన రెండు చేతులతో ఆ చాణూరుని పట్టుకొని,  వేగముగా త్రిప్పి, నేలకేసికొట్టెను. అట్లు త్రిప్పుచున్నప్పుడే ఆ మల్లుని ప్రాణాలు పైకెగిరిపోయెను. ఆ మల్లుని కేశములు, మాలలు చెదరిపోయెను. వేషభూషలు అన్నియును అస్తవ్యస్తము లాయెను. అతడు ఇంద్రధ్వజము (ఇంద్రుని పూజించుటకై నిలిపిన ధ్వజము) వలె పడిపోయెను.


*44.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*తథైవ ముష్టికః పూర్వం స్వముష్ట్యాభిహతేన వై|*


*బలభద్రేణ బలినా తలేనాభిహతో భృశమ్॥9971॥*


*44.25 (ఇరువది యైదవ శ్లోకము)*


*ప్రవేపితః స రుధిరముద్వమన్ ముఖతోఽర్దితః|*


*వ్యసుః పపాతోర్వ్యుపస్థే వాతాహత ఇవాంఘ్రిపః॥9972॥*


అట్లే ముష్టికుడు తన పిడికిలి పోటులతో బలరాముని నొప్పింపజొచ్చెను. కాని పరాక్రమశాలియైన బలరాముడు వాటిని సరకు సేయక తన అఱచేతితో వానిని తీవ్రముగా కొట్టెను. ఆ దెబ్బకు ముష్టికుడు కంపించిపోవుచు నోటినుండి రక్తమును వెళ్ళగ్రక్కుచు, అసువులను కోల్పోయి, పెనుగాలి తాకిడికి మహావృక్షమువలె నేలకూలెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: