19, మే 2024, ఆదివారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది నాలుగవ అధ్యాయము*


*బలరామకృష్ణులు చాణూరముష్టికాది మల్లులను, కంసుని సంహరించుట దేవకీవసుదేవులకు బంధవిముక్తి కలిగించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*44.1 (ప్రథమ శ్లోకము)*


*ఏవం చర్చితసంకల్పో భగవాన్మధుసూదనః|*


*ఆససాదాథ చాణూరం ముష్టికం రోహిణీసుతః॥9948॥*


*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! ఈ విధముగా కృష్ణపరమాత్మ చాణూరాది మల్లయోధులను వధించుటకు సంకల్పించుకొనెను. అంతట ఆ ప్రభువు చాణూరినితోను, బలరాముడు ముష్టికునితోడను ద్వంద్వయుద్ధము చేయుటకు సర్వసన్నద్ధులై వారిని సమీపించిరి.


*44.2 (రెండవ శ్లోకము)*


*హస్తాభ్యాం హస్తయోర్బద్ధ్వా పద్భ్యామేవ చ పాదయోః|*


*విచకర్షతురన్యోన్యం ప్రసహ్య విజిగీషయా॥9949॥*


అనంతరము వారు చేతులతో చేతులను పట్టుకొని, పాదములకు పాదములను అడ్డముగా నిలిపి, పరస్పర జయేచ్ఛతో ఒకరినొకరు తమవైపునకు లాగికొనసాగిరి.


*44.3 (మూడవ శ్లోకము)*


*అరత్నీ ద్వే అరత్నిభ్యాం జానుభ్యాం చైవ జానునీ|*


*శిరః శీర్ష్ణోరసోరస్తావన్యోన్యమభిజఘ్నతుః॥9950॥*


ఇంకను వారు పరస్పరము పెనవైచుకొనుచు, మోచేతులపై మోచేతులతోను, మోకాళ్ళపై మోకాళ్ళతోను, శిరస్సులను శిరస్సులతోను, వక్షస్థలములను వక్షస్థలములతోను మోదుకొనుచు ఒకరిపైనొకరు దెబ్బతీయదొడంగిరి.


*44.4 (నాలుగవ శ్లోకము)*


*పరిభ్రామణవిక్షేపపరిరంభావపాతనైః|*


*ఉత్సర్పణాపసర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరుంధతామ్॥9951॥*


పరిభ్రమణము (ప్రత్యర్థిని చేతులతో పట్టుకొని చుట్టును గిరగిర త్రిప్పుట), విక్షేపము (దూరమునకు నెట్టివేయుట), పరిరంభణము (బాహువులతో అదిమిపట్టి పీడించుట), అవపాతము (క్రిందబడవేయుట), ఉత్సర్పణము (విడిచిపెట్టి ముందునకు పరుగెత్తుట), అపసర్పణము (వెనుకకు నడచుట) మొదలగు ప్రక్రియలతో కృష్ణచాణురులు, ముష్టిక బలరాములు ద్వంద్వయుద్ధమును జరిపిరి.


*44.5 (ఐదవ శ్లోకము)*


*ఉత్థాపనైరున్నయనైశ్చాలనైః స్థాపనైరపి|*


*పరస్పరం జిగీషంతావపచక్రతురాత్మనః॥9952॥*


ఇంకను ఉత్థాపనము (పాదములను, మోకాళ్ళను పిండి పిండిగావించి పడద్రోసిలేపుట), ఉన్నయనము (ప్రత్యర్థిని చేతులతో పైకెత్తి తీసికొనిపోవుట), చాలనము (నడుము దగ్గఱ పట్టుకొని త్రోసివేయుట), స్థాపనము (చేతులను, పాదములను ఒకటిగాజేసి పీడించుట) మొదలగు రీతులలో పరస్పర జయేచ్ఛతో వారు పోరాడిరి.


*44.6 (ఆరవ శ్లోకము)*


*తద్బలాబలవద్యుద్ధం సమేతాః సర్వయోషితః|*


*ఊచుః పరస్పరం రాజన్ సానుకంపా వరూథశః॥9953॥*


పరీక్షిన్మహారాజా! రంగస్థలము జరుగుచున్న ఆ ద్వంద్వయుద్ధమును గాంచుటకై స్త్రీలు గుంపులు గుంపులుగా అచటికి చేరియుండిరి. బలవంతులైన మల్లయోధులకును, సుకుమారులైన బాలురకును మధ్య 'ఇట్లు బలహీనులకు బలవంతులతో యుద్ధము జరుగుట అన్యాయము' అని నొచ్చుకొనుచు వారు జాలితో తమలో తాము ఇట్లనుకొనిరి.


*44.7 (ఏడవ శ్లోకము)*


*మహానయం బతాధర్మ ఏషాం రాజసభాసదామ్|*


*యే బలాబలవద్యుద్ధం రాజ్ఞోఽన్విచ్ఛంతి పశ్యతః॥9954॥*


"రాజసభలోనున్న వీరు అందఱును బలవంతులకును దుర్బలులకును మధ్య నడచుచున్న ఈ ద్వంద్వయుద్ధమును కనులప్పగించి  చూచుచుండిరేగాని, ఇట్లు జరుగుట అధర్మము  అని పలుకుచు దీనిని నివారింపరైరి. దీనిని ప్రత్యక్షముగా చూచుచున్న రాజుతో పాటు వీరును దీనిని ఆమోదించుచుండిరి.


*44.8 (ఎనిమిదవ శ్లోకము)*


*క్వ వజ్రసారసర్వాంగౌ మల్లౌ శైలేంద్రసన్నిభౌ|*


*క్వ చాతిసుకుమారాంగౌ కిశోరౌ నాప్తయౌవనౌ॥9955॥*


*44.9 (తొమ్మిదవ శ్లోకము)*


*ధర్మవ్యతిక్రమో హ్యస్య సమాజస్య ధ్రువం భవేత్|*


*యత్రాధర్మః సముత్తిష్ఠేన్న స్థేయం తత్ర కర్హిచిత్॥9956॥*


వజ్రములవలె దృఢమైన అంగములు గలిగి, పర్వతములవలె   ఒప్పుచున్న ఈ మల్లుయోధులెక్కడ? ఇంకను యౌవనదశకు చేరక కిశోరావస్థలో సుకుమారులైయున్న ఈ బలరామకృష్ణులెక్కడ? ఈ సమాజము అంతయును (ఇచటివారు అందఱునూ) ఈ విషమయుద్ధమును చూచుచు మిన్నకుండుట ఎంతేని అధర్మము. ఇది ముమ్మాటికిని నిజము. ఇట్లు ఉపేక్ష వహించుట తగదు. దీని వలన పాపములు చుట్టుకొనును. అధర్మము జరుగుచున్న చోట ఒక్క క్షణము గూడ నిలువరాదు. కనుక మనము ఎంతమాత్రమూ ఉండుట తగదు".


*44.10 (పదియవ శ్లోకము)*


*న సభాం ప్రవిశేత్ప్రాజ్ఞః సభ్యదోషాననుస్మరన్|*


*అబ్రువన్ విబ్రువన్నజ్ఞో నరః కిల్బిషమశ్నుతే॥9957॥*


మఱికొందరు వనితలు ఇట్లు పలికిరి. 'సదస్యుల దోషములను ఎఱింగియున్నప్పుడు ప్రాజ్ఞుడైనవాడు అందు (ఆ సభలో) ప్రవేశింపరాదు. ఒకవేళ ప్రవేశించినచో అచట జరుగుచున్న దోషములను ఎత్తిచూపక మిన్నకుండుటగాని, విపరీతముగా పలుకుటగాని లేక 'ఇది నాకు తెలియదు' అని పలుకుటగాని మూర్ఖలక్షణము. అట్టి వానికి పాపములు అంటును.


*44.11 (పదకొండవ శ్లోకము)*


*వల్గతః శత్రుమభితః కృష్ణస్య వదనాంబుజమ్|*


*వీక్ష్యతాం శ్రమవార్యుప్తం పద్మకోశమివాంబుభిః॥9958॥*


*ఇంకను కొందఱు కాంతలు ఇట్లు వచించిరి* "శత్రువు చుట్టును పరుగిడుచున్న శ్రీకృష్ణుని ముఖారవిందము ద్వంద్వయుద్ధ శ్రమవలన స్వేదబిందువులతో నిండియున్నది. అది జలకణములతో పరివ్యాప్తమైన పద్మకోశము (మొగ్గ) వలె అలరారుచున్నది".


*44.12 (పండ్రెండవ శ్లోకము)*


*కిం న పశ్యత రామస్య ముఖమాతామ్రలోచనమ్|*


*ముష్టికం ప్రతి సామర్షం హాససంరంభశోభితమ్॥9959॥*


"అది సరే! బలరాముని ముఖమును చూచినారా? ముష్టికునిపైగల క్రోధముతో కన్నులు ఎర్రబాఱియున్నవి. ఐనను ఆ స్వామి ముఖము చిఱునవ్వుతో, ఆవేశస్ఫోరకమై విలసిల్లుచున్నది".


*44.13 (పదమూడవ శ్లోకము)*


*పుణ్యా బత వ్రజభువో యదయం నృలింగగూఢః పురాణపురుషో వనచిత్రమాల్యః|*


*గాః పాలయన్ సహబలః క్వణయంశ్చ వేణుం విక్రీడయాంచతి గిరిత్రరమార్చితాంఘ్రిః॥9960॥*


*మఱికొందరు స్త్రీలు ఇట్లు నుడివిరి* "శంకరుడు. బ్రహ్మాదిదేవతలు, జగజ్జననియైన లక్ష్మీదేవియు శ్రీమన్నారాయుణిని పాదపద్మములను నిత్యము భక్తితో అర్చించుచుందురు. అట్టి వైకుంఠపతియే తన దివ్యలక్షణములను మఱుగుపఱచి మానవరూపమున శ్రీకృష్ణుడై అవతరించెను. కృష్ణప్రభువు నిత్యము చిత్రవిచిత్రములైన వనపుష్పమాలలతో విరాజిల్లుచుండును. ఆ స్వామి తన అన్నయగు బలరామునితోగూడి గోవులను పాలించుచుండును. ఆయన వేణువునుండి వెలువడు మధురధ్వనులు వీనులవిందు గావించుచుండును. ఆ స్వామి ఆటలపాటలతో బృందావన భూములయందు విహరించుచుండును. ఆ పురుషోత్తముని పాదస్పర్శకు నోచుకొనుటవలన వ్రజభూమి అంతయును పవిత్రమైనది,  ఆహా! ఎంత ధన్యమైనది".


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: