19, మే 2024, ఆదివారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*834వ నామ మంత్రము* 


*ఓం విశృంఖలాయై నమః*


కర్మబంధములు, విధినిషేధములు లేక సర్వ స్వతంత్రురాలుగాను, దిగంబర స్వరూపురాలిగాను భాసిల్లు  పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విశృంఖలా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం విశృంఖలాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు  జీవనగమ్యంలో కొనసాగించు సత్కర్మలకు ఏర్పడు ప్రతిబంధకములు నిరోధింపడి, తలచిన కార్యములు నిర్విఘ్నము నెరవేరినవాడగును


ఐహిక బంధములే సంసార శృంఖలములు. జగన్మాత ప్రసాదించు జ్ఞానజ్యోతులచే భక్తుల సంసార శృంఖలములు ఛేదింపబడును. యోగులకు వారి యోగసాధనలో బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి యను శృంఖలములు త్రెంచబడి సహస్రారమునకు చేరు మార్గము సుగమము అగును. పాపకర్మలు చేయుటచే నీచపుజన్మలు మరల మరల కలుగుచునేయుండును. అట్లే పుణ్యకర్మలు చేసినను మంచిజన్మలు కలుగుచునేయుండును గాని జన్మరాహిత్యమైన ముక్తి లభించదు.. పరమేశ్వరి యందు సంపూర్ణమైన ధ్యానదీక్ష కలిగి, కేవలము ముక్తియే తమ పరమార్థంగా సాధనచేయు సాధకులకు శ్రీమాత జన్మరాహిత్యమైన కైవల్యమును ప్రసాదించి *పునరపిజననం, పునరపిమరణం* అను  శృంఖలములను ఛేదింపజేయును గనుకనే ఆ తల్లి *విశృంఖలా* యని అనబడినది.


అలంపురి జోగులాంబ వంటి కొన్ని శక్తిపీఠములలో నగ్నమూర్తులు గలవు. విశృంఖలా యను పదమునకు దిగంబరి యను అర్థమున్నది. గనుకనే జగన్మాత *విశృంఖలా* యని అనబడినది. ఎముకలు, మాంసము, రక్తము నింపిన తోలుతిత్తివంటిది ఈ శరీరము. అటువంటి తోలుతిత్తికి అలంకరింపబడిన వస్త్రములు, సుగంధభరితములైన పుష్పమాలలు, కాంచనమణి భూషణములు వంటి అలంకారములు మనోవికారములను పెల్లుబికించే అజ్ఞాన శృంఖలములవంటివి. పరబ్రహ్మస్వరూపిణియైన జగన్మాత తానొక జ్ఞానజ్యోతిగా ఆ శృంఖలములను తెగటార్చి కైవల్యమార్గము దిశగా సాధకులను నడిపించును గనుక పరమేశ్వరి *విశృంఖలా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విశృంఖలాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: