నిత్యపద్య నైవేద్యం-1566 వ రోజు
సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-201. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి
ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు
సుభాషితం:
అదత్తే త్యాగతా లజ్జా
దత్తేతి వ్యథితం మనః l
ధర్మ స్నేహాంతరే న్యస్తా:
దుఃఖితాం ఖలు మాతర:ll
తేటగీతి:
ఆడపిల్లకు పెళ్లి కానంత వరకు
తల్లి కెంతయో సిగ్గుండు నుల్లమందు
పెళ్లి యయ్యాక కొమరితన్ విడిచియుండ
తల్లి మనసెంతొ దిగులుగా తల్లడిల్లు.
భావం:
ఎదిగిన ఆడపిల్లకు పెళ్లి కానంత వరకు తల్లికి సిగ్గుగా ఉంటుంది. పెళ్లైతే కూతురుని విడిచి ఉండటానికి తల్లి మనసు బాధ పడుతుంది. ఇలా ఒక వైపు కర్తవ్యమూ, మరొక వైపు మమత.. ఈ రెండింటి మధ్య చిక్కుకున్న తల్లుల మనసు దుఃఖిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి