🪷 *లక్ష్మీ స్థాన ఫలితాలు, ఆడపిల్ల అంటే ఐశ్వర్యలక్ష్మి* 🪷
ఐశ్వర్యం అంటే కేవలం ధన సంబంధిత సంపద మాత్రమే అని అనుకోకూడదు. లక్ష్మి మనల్ని విశేషముగా సత్కరించాలి అనుకుంటే ఆ తల్లి ఆడపిల్ల గా ఇంటికొస్తుంది. ఆడపిల్ల అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్ధం. ఆడపిల్ల పెళ్లయి, అత్తవారింటికి వెళ్ళి తన సత్ప్రవర్తనతో, సత్శీలతతో ఇరు వంశీకులని తరింపచేస్తుంది.
మగపిల్లాడికి ఆ అవకాశం లేదు. అసలు ఆడపిల్ల వచ్చిందీ అంటేనే లక్ష్మీదేవి వచ్చిందని. ఆడపిల్ల - అటు వెనక పదితరాలు, ఇటు ముందు పది తరాలను, తండ్రితో కలిపి 21 తరాల వారిని తరియింపచేస్తుంది.
ఆడపిల్ల ఇంటికొచ్చిందంటే, లక్ష్మీదేవి వచ్చినట్టే. మగపిల్లాడికి పెళ్లయ్యాక ఆ ఐశ్వర్యం ఎవరిదీ అంటే అతనిది కాదు. ఆ ఇంటి ఇల్లాలిది.
ఒకప్పుడు దేవేంద్రుడు ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయినటువంటి మహాలక్ష్మీ దేవిని స్తుతించినప్పుడు స్వయంగా తానే చెబుతుంది. తాను ఎక్కడెక్కడ నివాసమై వుండేది! తాను కైలాసంలో పార్వతీ దేవిగా వైకుంఠంలో లక్ష్మీదేవి గా బ్రహ్మలోకం లో సరస్వతిగా మహారాజు దగ్గర రాజ్యలక్ష్మిగా ప్రతి ఇంటి ఇల్లాలిలో - గృహలక్ష్మి గా వుంటానని చెబుతుంది.
'గృహము' అంటే ఆ ఇంట్లో ఇల్లాలు వున్నప్పుడు మాత్రమే అది గృహము ఇంటి యజమాని ఎంత అలసిపోనీండి ఇల్లాలి నవ్వుతో, మాటలతో, సేవలతో సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం వుండనీండీ, ఎన్ని కోట్లు వుండనీండీ. ఆమె వెళ్ళిపోయాక ఆ ఇల్లు ఆయనకు మనశ్శాంతిని ఇవ్వలేదు.
గృహము అంటే మేడ కాదు. భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మీ గృహే గృహే అని అంటారు.
లక్ష్మీదేవిని దర్శించడం ఎంత సులువైనదీ అంటే, నీ భార్యలో సాటి వారి ఇల్లాలిలో, సోదరిలో చూడవచ్చు. ఈ భావన చాలు. లక్ష్మీకటాక్షం పొందేందుకు ఈ ఒక్క భావన హేతువుగా నిలుస్తుంది.
ఇంకా లక్ష్మీదేవి తాను ఎక్కడెక్కడ నెలవై వుంటుందీ అంటే 5 స్థానాలు అని చెప్పింది.
1. గోవు యొక్క వెనకతట్టు:
రోజుకొక్క సారైనా గోవు వెనక తట్టు చూసిన వారు, ప్రదిక్షణ చేసిన వారూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు చేతులారా పండూ, ఫలమూ, పరకని తినిపించినవాడు సాక్షాత్తు లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు.
2. పద్మం: పద్మము లక్ష్మీస్థానం.
3. ఏనుగు యొక్క కుంభస్థలం.
4. సువాసినీ యొక్క (సీమంతం)పాపిట ప్రారంభ స్థానం.
5. మారేడు దళం. ఈ ఐదూ లక్ష్మీ నెలవుండే స్థానాలు. లక్ష్మీ లోకాన్నంతటినీ చూస్తుంది. లోకమంతా ఆమెని చూస్తుంది. ఆ తల్లి ఎక్కడ వుంటే అక్కడ సంతోషం వుంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే అర్ధం - సంతోషం గా వుంటమే. అన్నీ వున్నవాని విషాదం కన్నా, ఏమీ లేకపోయినా సంతోషంగా వున్న వాడిదే అసలైన ఐశ్వర్యలక్ష్మీకటాక్షం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి