2, ఆగస్టు 2024, శుక్రవారం

శ్రీదత్త పురాణము

 శ్రీదత్త పురాణము

ద్వితీయభాగం

(మొదటిది -1)


సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. శౌనకాది మునులారా బ్రహ్మ కలిపురుషుడుకి చెప్తున్న దీపక వేదధర్ముల సంభాషణ ఇలా జరిగింది. అంతా కూలంకషంగా చెప్తాను ఆలకించండి. వేదధర్ముడు చెప్పిన యదు - అవధూత సంభాషణని విన్న దీపకుడు శ్రద్ధగా విని పులకరించిపోయి, ఆనందంతో గురూత్తమా! నీ పాద పద్మాలను సేవించుకొనే భాగ్యం నాకు దొరికింది. నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు, ప్రహ్లాద - అజగర సంభాషణ - యదు - అవధూత సంభాషణలు రెండుకి రెండు అత్యంత మనోహరాలు

నిగూఢార్ధ ప్రభోధాలు. అయినా తనివి తీరలేదు. ఇంకా దత్త మహిమల్ని వినాలి తెలుసుకోవాలి అనే కుతూహలం నా

మనస్సును తొందరపెడుతున్నది. దయచేసి మిగతా దత్త కధలు కూడా చెప్పి నన్ను తరింపజెయ్యండి నా జన్మ చరితార్ధం చేసుకొంటాను. దప్పికతో ఉన్నవాడు మధుర పానీయాలు ఆశించినట్లు నేను దత్త కధామృతాన్ని యాచిస్తున్నాను అనుగ్రహించు అన్నాడు. నాయనా దీపకా ఈ దత్త కధల పట్ల నీకు ఇంత ప్రీతి కలుగడం నిజంగా నీ అదృష్టం. జనన మరణాలతో సంబంధం లేని ముక్తి నీకు లభించును. దత్త కధలలో అద్భుతమైన సుమతి వృత్తాంతంవుంది చెబుతాను విను. 


*సుమతి వృత్తాంతం*


అనగనగా ఆర్యావర్తంలో ఒక పల్లెటూరు. ఆ వూళ్లో ఒక బ్రాహ్మణుడు. వేదవేదాంగ పారంగతుడతడు. సర్వసద్గుణ సంపన్నుడు. సర్వసౌమ్యుడు. శాంత స్వభావి. ధర్మపత్నీ సమేతుడై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ ఆచరిస్తూ వుండేవాడు. కాని ఎంతకూ వారికి సంతానం కలుగలేదు. ఇంక మన బ్రతుకులు ఇంతే ! ఈ తనువు ఇలా

రాలిపోవలసిందే అని దిగులు చెందుతున్న నడి వయస్సులో వారి కలలు ఫలించి ఆమె కడుపు పండింది. పది నెలలూ మోసి పండంటి మగ బిడ్డను ప్రసవించింది. బంగారు మేనిఛాయతో దివ్యతేజస్సుతో సౌందర్య రాశిలా వున్నాడు బిడ్డడు. రోజుల గడుస్తున్న కొద్దీ బిడ్డడు అంధుడని, చెవిటివాడని, మూగవాడని ఆ తల్లితండ్రులు గుర్తించి భోరు భోరున విలపించారు. అవిటివాడైతేనేమి కొడుకు పుట్టాడు అంతే చాలు అనుకొని గుండెలురాయి చేసుకొని బ్రతుకుతున్నారు.

అల్లారుముద్దుగా బిడ్డడిని పెంచుకొంటున్నారు. సుమతి అనినామకరణం చేసి సంబరపడ్డారు. ఏనాటికైనా అతడు

ఆరోగ్యవంతుడవుతాడని ఆశతో ఎదురుచూస్తూ జీవితం గడుపుతున్నారు. కాని అది అడియాశే అయ్యింది. ఏ చైతన్యం

లేని జడపదార్థంలా సుమతి ఎదుగుతున్నాడు. ఎనిమిదేళ్ళు వచ్చాయి. వయస్సుకు తగిన బుద్ధి వికసించలేదు. కాని ముఖ వర్చస్సు మాత్రం అద్భుతంగా వుండేది. ఉపనయనంజేసి కనీసం గాయత్రినైనా జపిస్తే ఫలితం కలుగుతుందని తండ్రి ఆశపడి ముహూర్తం ఏర్పాటు చేసి ఒడుగు జరిపించాడు. చెవిలో గాయత్రిమంత్రం జపించాడు. విన్న అలికిడి ఆ బిడ్డ ముఖంలో కన్పించలేదు. తండ్రి గాంభీర్యం అంతా సడలిపోయింది. అయ్యో నాయనా ఇంత జడుడుగా వున్నావేరా అంటూ బిడ్డని గుండెలకు హత్తుకొని భోరుభోరున విలపించాడు. బిడ్డలు లేనంతకాలం అదొక్కటే దిగులు ఇప్పుడు నిన్ను పెంచిపెద్ద చెయ్యటం అనుక్షణము మాకు అగ్ని పరీక్ష అంటూ దుఃఖించాడు. ఏ జన్మలో ఏ పాపం

చేసానో ఈలాంటి బిడ్డని భగవంతుడు అనుగ్రహించాడని ఇదీ ఒక పరీక్షే అని ఆ దంపతులు ఒకరినొకరు ఓదార్చుకొని దుఃఖిస్తున్నారు.

ఓ రోజు సాయంకాలం సంధ్యను ఉపాసింపజేసి తొమ్మిదేళ్ళ సుమతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనయా ! ఉపనయనం చేసాను. వేదాధ్యయనానికి నీకు వయస్సు వచ్చింది. గురుకులంలో వేస్తాను గురుసేవ చేస్తూ చదువుకో బాగా వివేకం సంపాదించు. వయస్సు వచ్చాక వేదాధ్యయనం అయ్యాక అనువైన సంబంధం చూసి నీకు వివాహం జరిపిస్తాను. గృహస్థాశ్రమం ధర్మబద్ధంగా నడిపి సత్పుత్రులను పొంది వారికి నీ బాధ్యతలు నెరవేర్చి వానప్రస్థాశ్రమం

స్వీకరించి ఆ తరువాత అనుబంధాలన్ని తెంపుకొని

సన్యాసంపుచ్చుకో. ఆ దీక్షతో నీకు ముక్తి లభిస్తుంది. సుమతి

అంతా శ్రద్ధగా వింటున్నాడు అతడికి అన్ని తెలుస్తున్నాయి అనే భ్రమతో పాపం ఆ పిచ్చి తండ్రి ఇంతటి బోధ చేస్తున్నాడు. సుమతి మాత్రం ఉలకలేదు, పలకలేదు అసలు అతనికి వినిపించిందో లేదో కూడా తెలియలేదు. తనపుత్ర వ్యామోహానికి తానే దిగులుపడి కళ్ళల్లో నీళ్ళు కుక్కుకున్నాడు. పాపం ప్రతీ రోజు ఈ తంతు ఇలా

జరుగుతూనే వుంది. ఒకనాటి మధ్యాహ్నం సమయాన సుమతి హఠాత్తుగా మాట్లాడాడు. తనను తానే నమ్మలేనంతగా

ఆశ్చర్య చకితుడై వింటున్నాడు తండ్రి. తండ్రీ విూరంటున్న వేదాలు శాస్త్రాలు కళలు కావ్యాలు ఇవి అన్నీ నేను ఎన్నో సార్లు అభ్యసించాను. ఇవి ఏమీ నాకు కొత్తకాదు. గ్రుడ్డి, మూగ, చెవుడు, జడుడు అనుకున్న కొడుకు ఇలా మాట్లాడటమేమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. నా కథ చెబుతాను విను. ఇంతవరకూ నేను కొన్ని వేల జన్మలు ఎత్తాను. అవన్నీ నా కళ్ళ ఎదుట బొమ్మలు లాగా కదులుతున్నాయి. ప్రతిజన్మలో జరిగిన ప్రతీ విషయం నాకు జ్ఞాపకం ఉంది.

ఎందరెందరు తల్లిదండ్రులు ఎందరెందరు బంధుమిత్రులు ఎందరెందరు భార్యాపుత్రులు లెక్క పెట్టి చెప్పడం ఎవ్వరి తరమూకాదు. ఎన్నెన్ని సుఖాలు ఎన్నెన్ని దుఃఖాలు ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని అనుభూతులు. తలుచుకుంటేనే తల తిరిగిపోతుంది నరజన్మలేనా మృగజన్మలేనా పశుపక్షి, కీటకాదిక్రిముల జన్మలేనా అన్నీ నేను అనుభవించాను. ప్రతి పుట్టుకా ఒక నరకం మలమూత్ర పంకిలమైన జననీ జఠర నివాసం. శైశవ, బాల్య, యౌవన, కౌమార, వార్థక్యాలలో సుఖదుఃఖాల వెలుగునీడలు స్వయం కృతాలు, పరాకృతాలు, అన్ని చాలా రుచి చూసాను. భృత్యజన్మల్లో కృంగిపోయాను. రాజజన్మల్లో విర్రవీగాను. పిరికిపందగా పారిపోయాను. మహాశూరుడిగా విజృంభించాను. దరిద్ర, ధనిక, చోర, కిరాతక, జూదరిజన్మలు ఎన్నో ఎత్తి వంచించాను, వంచింపబడ్డాను. త్యాగిగా కీర్తింపబడ్డాను. లోభిగా నిందింపబడ్డాను. సర్వాంగ సౌందర్యాలు, అంగవైకల్యాలు అన్నీ గుర్తువున్నాయి. అవన్నీ కలిగించిన నిర్వేదంతో ఈనాడు ఇలా జడపదార్థంలా

మారిపోయి మీ ఇంటిలో జన్మించాను. పూర్వజన్మస్మృతి లేకపోవడం నిజంగా మానవుడివరం. లేకపోతే నాలాగే అందరూ జడపదార్థముల వలె ఉండేవారు. నిర్వేదంలో మునిగిపోయేవారు సరే - ఆ జన్మలూ, ఆ కష్టాలు, ఆ వైరాగ్యాలు, వాటి మాటకేం గాని తండ్రీ నీవు చెబుతున్న వేదోక్త కర్మలపట్ల నాకు సదభిప్రాయం లేదు. అవి నాకు

రుచింపవు. యజ్ఞయాగాదులు చెయ్యడం స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం సంపాదించుకున్న పుణ్యం ఖర్చుకాగానే మళ్ళీ భూలోకంలో గర్భవాస నరకం అనుభవించడం ఏదో ఒక జన్మ మళ్ళీ ఎత్తడం మళ్ళీ దుష్కర్మలు సత్కర్మలూ నరకయాతనలు సుఖదుఃఖాలు అనుభవించడం మళ్ళీ పుట్టడం మళ్ళీ గిట్టడం ఇంతేగదా జనన మరణ చక్రంలోబడి కొట్టు మిట్టాడటం. దీనికి విసుగూ విరామం లేదా ? నువ్వంటునట్లు కర్మమార్గం ఇంతకన్నా ఉత్తమ పదాన్ని అందిస్తుందా? ఇంతకన్నా ఉన్నతపదం ఉంది అని అసలు నీవు గుర్తించావా? జననమరణాలకు అతీతమైన శాశ్వత ఆనందధామం కదా మనం చేరుకోవలసింది దాన్ని పొందాలి అంటే జ్ఞాన మార్గం ఒక్కటే శరణ్యం. నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడం

ఒక్కటే జ్ఞానమార్గం, సర్వ సంగపరిత్యాగము, రాగద్వేషాది ద్వందాలకు లొంగని ప్రవృత్తి అలవరచుకోవడమే జ్ఞానమంటే.

ఇది ఉన్నవాడికి దుఃఖం ఉండదు. కర్మబంధం ఉండదు. జన్మరాహిత్యమే చివరఫలం. తండ్రీ ఇది నువ్వు తెలుసుకోవాలి.

ఆశ్చర్యచకితుడై కళ్ళు అప్పగించి తండ్రి రవ్వంత తేరుకున్నాడు. ఇంతటి జ్ఞాని తన ఇంట పుట్టినందుకు ఆనందం కల్గుతున్నా చిన్నవాడి వైరాగ్య మాటలు అతన్ని కలవరపరచాయి. జడుడు అనుకున్నవాడు నేడు జ్ఞాని అయ్యాడని సంతోషించాలో ఈ ధోరణికి దుఃఖించాలో అగమ్యగోచరంగా ఉంది. నాయనా సుమతి ఏమిటి నీ మాటలు, ఒక్కనిమిషంలో నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? పూర్వజన్మల స్మృతి ఎలా కలిగింది? ఏదైనా శాపకారణంగా

నీవు మా ఇంట జన్మించావా ? నన్ను మీ అమ్మను మళ్ళీ దుఃఖ సాగరంలో ముంచి వెళ్ళిపోతావా? అసలు నీ జన్మ రహస్యం ఏమిటి ? చెప్పు అని ఆందోళనతో అడిగాడు. వేదవేదాంగాలు అభ్యసించిన తండ్రి పుత్రవ్యామోహంతో అలా రోదిస్తుంటే సుమతికి నవ్వు వచ్చింది. ఇలా అన్నాడు. తండ్రీ నీకు పుత్రుడుగా జన్మించడానికి ముందు చాలా శాస్త్రాలు అభ్యసించాను. ఆ ఇంటికి వచ్చిపోయే సాధు సజ్జనులతో సాంగత్యం కలిగింది. వేదాంగ చర్చలు అనేకం

చేసాను. ముక్తిమార్గాలు తెలుసుకున్నాను. జ్ఞానం ఉదయించింది. అంతరంగం నిండా వెలుగునింపుకొంది. ఏకాంత వాసంలో చాలాకాలం గడిపాను. నా నియమనిష్టలు పరిపక్వదశకు వచ్చే సమయంలో, బ్రహ్మసాక్షాత్కారం లభించే సమయంలో ప్రమాద వశాత్తు మరణించాను. యోగశక్తికారణంగా అప్పటి నుండి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. నేను చేసిన జ్ఞాన దానాల ఫలితంగా పదివేల పూర్వజన్మల్లోని అన్ని విషయాలు నాముందు నిలచాయి. నిర్వేదంతో, సంగాతీత, ద్వంద్వాతీత స్థితి కలిగింది. దానినే ఈ జన్మతోను కొనసాగించదలచాను. ఇప్పుడు ఆ జ్ఞాన మార్గాన్ని

విడిచి నువ్వు చెప్తున్న కర్మమార్గం అవలంభించలేను. ఏ మార్గంలో ఎవరు ప్రయాణం చేసినా అందరూ చేరుకొనేది గమ్యమే. అదే అందరి లక్ష్యము. నా మార్గంలో నేను గమ్యం చేరుకుంటాను. అందువలననే ఈ జడ స్థితి. కాలం వృధా చేసుకోకూడదు కదా ! ఈ శరీరానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికెరుక, కనుక ముక్తిలభించే వరకు అనుక్షణము ఆత్మానుభవపరుడ్నై తదేక దీక్షలో గడపడం నా ధృడసంకల్పం. నీ ఇంట పుట్టాను కనుక పితృఋణం తీర్చుకోవడం

నా ధర్మం. జ్ఞాన దానం చేసి ఋణ విముక్తి పొందుతాను. తండ్రీ నీకేమైనా సందేహాలుంటే అడుగు అన్నాడు. ಆ కిందటి క్షణం వరకు జడుడుగా ఉండి ఇప్పుడు ఇంతటి జ్ఞానిగా ప్రసంగిస్తున్న కొడుకు ఆ తండ్రికంటికి మహాయోగీశ్వరుడులా కనిపించాడు. హిమాలయ శిఖరంలా గోచరించాడు. సుమతికి తాను పెట్టిన పేరు సార్ధకమయ్యిందని సంబరపడ్డాడు. కుమారా, నాయనా ఇంతకీ ఇప్పుడు నా కర్తవ్యము ఏమిటి చెప్పు. నేను ఈ జన్మ పరంపరలలో ఇలా మునిగి తేలవలసిందేనా ! దీనికి విముక్తి ఏమిటి ? దయచేసి తెలియచెప్పు. కన్నకొడుకుతో మాట్లాడుతున్నానన్న చనువు, మహాజ్ఞానితో మాట్లాడుతున్నానన్న బెరుకు తండ్రి స్వరంలో వినిపించాయి. సుమతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తండ్రితో ఇలా అన్నాడు. తండ్రీ నా మాటలమీద నీకు నిజంగా గురి కుదిరింది కదా ! అయితే చెబుతాను విను. ఈ సంసారము నిస్సారమని ముందు నువ్వు గ్రహించు. ఆ తరువాత ఆలస్యం చేయకుండా గృహస్థాశ్రమం వదలి వానప్రస్థం స్వీకరించి అమ్మతో సహా అడువులకు వెళ్లి భగవధ్యానం చేసుకుంటూ నిస్సంగత్వం అలవరుచుకో, ఆ పైన సన్యాసం స్వీకరించు.క్షేత్ర, క్షేత్రజ్ఞ విలువలను గుర్తించు, ద్వంద్వ ప్రవృత్తిని జయించు. ఏకాంతవాసంతో, యోగాభ్యాసంతో అంతరేంద్రియాలను నిగ్రహించు. భిక్షాటనతో దేహాన్ని నిలుపుకుంటూ నిరంతరం జాగరూకుడవై యోగ మార్గాన పయనిస్తే ఆత్మ బ్రహ్మైక్యానుసంధానం చెందుతుంది, భవరోగాలన్నింటికీ అదే దివ్య ఔషధం. జనన మరణాల చక్రము నుండి బయటపడే సాధనం ఇదే, మరొకటి లేదు. యోగమార్గాన ప్రయాణం చేయడమే శరణ్యం. ఈ క్షణములోనే నీవు ధృడంగా సంకల్పించుకో. నాయనా ! కళ్ళు తెరిపించావు. ఈ సంసారము నుండి బయటపడాలి. బయటపడాలి అనుకోవడమే తప్ప

బయటపడే మార్గం తెలియక ధైర్యంచాలక కొట్టుకుంటున్నాను. దారి చూపించావు. ధైర్యం కలిగించావు. జన్మ పరంపరల సుడిగుండం నుంచి తప్పించే యోగవిద్య నాకు ఉపదేశించు. భవదావాగ్నిలో మాడిపోతున్న నా అంతరంగానికి బ్రహ్మ జ్ఞానమనే జడివానతో ఉపశమనం కలిగించు. అవిద్య కృష్ణసర్పం కాటువేసి మూర్ఛపోయిన నన్ను నీ మంత్రోపదేశంతో బయటపడేయి. . ఇల్లు వాకిలి ఇల్లాలు బిడ్డలు ధనధాన్యాలు ఇలా వేయి పాశాలు ముడివేసుకొని గిలగిలా కొట్టుకుంటున్నాను. యోగవిద్య అనే ఖడ్గంతో నా బంధనాలు ఛేదించి స్వేచ్ఛ ప్రసాదించు. తండ్రీ! యోగాభ్యాసానికి కావలసిన పరిణతి నీకులభించింది. తప్పకుండా ఉపదేశిస్తాను. వెనుక దత్తయోగీంద్రుడు

అలర్కుడికి చెప్పిన యోగవిద్య నీకు చెప్తాను, శ్రద్ధగా విను. నాయనా కుమారా నువ్వు బోధించే యోగవిద్యలో ఈ అంశాలు వస్తాయో రావో, మళ్ళీ చివరలో ఈ సందేహాలు గుర్తుంటాయో ఉండవో అందుకని ముందే అడుగుతున్నాను. దత్తయోగీంద్రుడు ఎవరు? అలర్కుడు అంటున్నావు. ఆయన ఎవరు? వీళ్ళ జన్మ వృత్తాంతాలు ముందుగా చెప్పి ఆపైన యోగవిద్య చెబుదువుగాని. తండ్రీ అడగవలసిందే అడిగావు. వీరిద్దరి గురించి చెప్పకుండా యోగవిద్య ఎలా చెప్పగలను. ముందుగా దత్త యోగీంద్రుని ఆవిర్భావానికి హేతువయిన పావన గాధ చెబుతాను విను.


Post:- సనాతన ధర్మం,



ఓం శ్రీదత్తాయ గురవే నమః 

హరిః ఓం తత్సత్ 

ఓం తత్సత్  ఓం తత్సత్ ఓం తత్సత్

కామెంట్‌లు లేవు: