2, ఆగస్టు 2024, శుక్రవారం

మఱ్ఱి చెట్టు.

 

               మఱ్ఱి చెట్టు.          

 వేయి పుల్గులు రేయి విదిత నిద్రాముద్ర 

నంకించి సుఖియించి టెంకిపట్టు 


పగటియెండకు తాపభరి తాంగములు వసి 

వాడు పాంథుల కెల్ల నీడ పట్టు 


వంగవోల్ సరకుల బండ్లకు మరలి పో 

యెడు వేళ యగు దాక విడిది పట్టు 


 చుట్టు పట్టుల నుండు బొట్టె ల కానంద 

మను పదమ్మును పంచు నాట పట్టు 


క్రమ్మి నంత మేరయు నంగి గప్పి పుచ్చు 

దట్టపుo జొంపముల తోడ నిట్టు నట్టు 

గాలి కూగాడు కొమ్మలై కొంచు వారి 

మనము లలరించు నా పెద్ద మఱ్ఱి చెట్టు. 


పండ్ల కెంపులు నాకుల పచ్చలును చి 

గుళ్ల పగడాలు పండు టాకులను దర్శ 

నీయ గోమేది కములు నై నిత్య రత్న 

మండనాంచిత మా పెద్ద మఱ్ఱి చెట్టు. 


అవసరమ్మని తోచి నపుడెల్ల కొమ్మలు 

కఱకు గొడ్డళ్లతో నఱకుచున్న 


విస్తళ్ళకని యెల్ల వేళల నేచి యా 

కులను దోటుల తోడ కోయుచున్న 


దంత ధావనకు నుత్తమమములం చెగబడి 

చేసేత నూడలు చీల్చుచున్న 


వైద్యమ్మునకు పాలు వలెనంచు కత్తులు 

పెట్టి బోదెకు గాట్లు పెట్టుచున్న 


నడరు వడక పరోపకారార్థ మీ శ 

రీరమని పూని తను వెల్ల చూఱ లిచ్చు 

మనజులకు వితరణ గుణ మాననీయ 

విమలతర కీర్తి న్యగ్రోధ వృద్ధ మూర్తి. 

దేవీదాస శర్మ.

కామెంట్‌లు లేవు: