2, ఆగస్టు 2024, శుక్రవారం

శుద్ధోఽసి, బుద్ధోఽసి”

 “శుద్ధోఽసి, బుద్ధోఽసి”

(తొలి జోలపాట మరియు మేలుకొలుపు)


శుద్ధ, బుద్ధ, గుహ్య, శుచితత్త్వమీవు! సం-

సారమాయ నిన్ను చేరలేదు,

స్వప్నమిదియె విడుమ సమ్మోహ నిద్ర, మ

దాలసమ్మ జోల నాలకించి.. ॥ 1 ॥


పేరు లేదు నీకు! పేరుకొన్నట్టి యా 

భూత పంచకపు విభూతి వలన  

దేహ మనెడి భ్రాంతి, దెలియుము నీవద్ది 

కాదు కాదు, కాన రోదనేల.. ॥ 2 ॥


విశ్వసాక్షివీవు విలపింపనేలయా? 

పలుకు శబ్ద చయము పరమమాయ,  

నిండు కల్పితములు నీదు గుణగణము  

లింద్రజాలమాడు నింద్రియములు..  ॥ 3 ॥


భూతగతులు మార పుష్టి వ్యష్టియగును, 

భూతతతులు జేర భూరి వృద్ధి, 

ఆటుపోటులిచ్చు నన్నపానంబులు, 

లేదు పెంపు నీకు, లేదు తరుగు.. ॥ 4 ॥


దినము దినము చినుగు దేహవస్త్రంబునున్ 

కట్టుకొంటివీవు గుట్టునెరుగు, 

కాయకంచుకంబు కప్పియుంచెను నిన్ను 

పాపపుణ్య కర్మఫలము వలన.. ॥ 5 ॥


తండ్రివందురొకరు, తనయుడవందురే, 

తల్లివందురొకరు, దార వంద్రు, 

నాదు వానివంద్రు, నావాడు కాదంద్రు, 

బాహ్య రూపమెంచి, బంధమిచ్చి..  ॥ 6 ॥


తోషమిచ్చునెపుడు తొలగించి దుఃఖంబు 

లనుచు వస్తువులను జనులు వలచు, 

నేడు సుఖమునిచ్చి రూఢిగా దుఃఖముల్

పిదప దెచ్చుననుచు విజ్ఞులరయు.. ॥ 7 ॥


రథమునెక్కి సాగు రథికుని భంగి, యీ 

దేహమందు కలడు దేహియొకడు, 

దేహధారి వీవు! దేహము వేరుగా  

కాంచ వలయు రెండు, కావునొకటి..  ॥ 8 ॥


మార్కండేయ పురాణంలోని, మదాలస చరిత్ర అనే ఘట్టంలో, త్యాగయ్య, అన్నమయ్యల సాహిత్యానికి ముందే, మన భారత వాఙ్మయంలో వెలువడిన “తొలి జోలపాట”గా మరియు, “అద్వైతాధ్యాత్మికతకు మేలుకొలుపు”గా గుర్తింపబడిన గీతమిది. గిటార్ వంటి తంత్రీ వాద్యముల సహకారంతో పాశ్చాత్య సంగీత సాధనలోను, ఆధ్యాత్మిక యోగబోధనలోను సుప్రసిద్ధమైన గీతమని యూట్యూబు ద్వారా తెలిసింది. దీనిని నిన్ననే, తొలిసారిగా, “A Journey to Kasi” అనే చిత్రంలో చూశాను/విన్నాను. విన్నప్పటి నుండి, మరిన్ని పర్యాయాలు వినమని, పదేపదే విని అర్థతాత్పర్యములను అవగాహన చేసికొమ్మని, ఆపై శక్తికొలది సరళమైన తెలుగులోకి అనువదించమని, నన్ను వెంటాడుతూనే ఉంది. అలా, ఇరవై నాలుగ్గంటల పురిటినొప్పుల కృత్యాద్యవస్థ తరువాత అమ్మ వరప్రసాదంగా ఆవిష్కరించిందీ ఆటవెలదుల పద్యానువాదం. తప్పులుంటే మన్నించి సర్దుబాట్లను, దిద్దుబాట్లను తెలియచేయమని, మీ మనసుకు నచ్చితే పదిమందితో పంచుకోమని సవినయ విన్నపం.


🙏🕉️🙏


- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్

కామెంట్‌లు లేవు: