19, జనవరి 2021, మంగళవారం

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము 🌹



ఇరు ధర్మ సతులతో తిరుమల జేరియు 

               యానందు డయ్యెను యన్నమయ్య 

దివ్య పుష్కరణిలో తీర్థ స్నానము జేసి 

              శ్రీ వరాహు గుడిని చేరి మ్రొక్కె 

పసిడి వాకిలి దాటి పరమాత్ము దర్శించి 

              తీర్థ ప్రసాదముల్ తీసుకొనియె 

కడుసంతసంబున కాన్కల నర్పించి 

             సాష్టాంగ దండముల్ సల్పె హరికి 

మంటపంబులు మఱియును వంట శాల 

పరవశంబున  జూచియు బయటకొచ్చి 

స్వామి సత్రంబు నందున సతుల తోడ

స్థిరముగా నుండె దివ్యమౌ తిరుమలందు 


సతు లిద్దఱు పరిచర్యల

నతి నిష్ఠతొ  జేయు చుండ నానందముగన్ 

యతులిత మగు స్థిర భక్తి తొ 

సతతము హర్యర్చనంబు సల్పగ సాగెన్ 


అనయము హరి కీర్తనముల 

వినయంబున పాడు కొనుచు వీడని భక్తిన్ 

ఘనుడగు యా యన్నమయ్య 

వినుతించుచు నుండె హరిని విభవము తోడన్ 


తిరుమలందు కలలొ శ్రీ యన్నమయ్యకు 

వేంకటేశ్వరుండు యెదుట నిలిచి 

యతడు జెప్పినట్టి హరికీర్తనములను 

యమిత శ్రద్ధతోడ యాలకించె


తడుప రన్నమయ్య తత్ కల యోచించి 

పాట వినిన యట్టి ప్రభుని దలచి 

శ్రీనివాసు పైన చెప్పంగ మదిదల్చె 

దినము కొక్క పాట వినయముగను 


దినమున కొక సంకీర్తన 

వినయంబున జెప్పు టకును విడువక యెపుడున్ 

మనమున స్వామిని దలచుచు 

ఘనుడగు శ్రీ యన్నమయ్య కాంక్షించె మదిన్ 




గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: