19, జనవరి 2021, మంగళవారం

*ఆ దైవం ఎవరు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *ఆ దైవం ఎవరు?*

                  ➖➖➖✍️


*దైవము కంటికి కనిపించడు..కదిలే కాలము కంటికి కనిపించదు. అయితే.. కనిపించని కాలాన్ని మనకు తెలియచెప్పేది.. ఆ కనిపించని దైవమే. అదే.. కాలా నికి, దైవానికి ఉన్న అవినాభావ సంబంధం.* 


*మరి.. ఆ దైవం ఎవరు ? ఇంకెవరు? సూర్య భగవానుడే. ఆయన కదలికే... కాలం కదలిక. అందుకే.. సూర్యుని ‘ప్రత్యక్షదైవమ్’ అన్నారు. ఇది నిరంతర ప్రయాణం. మరి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది కదా.* 


*ఉంది. ఏమిటా గమ్యం? ‘జననం నుంచి..జననం’ అనే గమ్యానికి చేరడమే ఈ నిరంతర ప్రయాణానికి ఉన్న లక్ష్యం. ఇదేమిటి? జననానికి మరణమేకదా... చివరి గమ్యం? అనే ప్రశ్న మీకు కలుగవచ్చు. మరణమే.. చివరి గమ్యమైతే...అక్కడితో కాలం యొక్క ప్రయాణం ఆగిపోయినట్టే. మరి కాలం ఆగదు కదా. జననానికి..మరణం ఓ మజిలీ మాత్రమే. ఇక్కడే.. మీరు నిశితంగా పరిశీలించాలి. జన్మించిన జీవి..మరణించి, మరో జీవిగా జన్మించి... ఈ నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే.. ఈ ప్రయాణం, మరణం అనే మజిలీ గుండా సాగుతుంది. అంతే! ఈ కాలరథానికి సారధి ‘సూర్యుడు’. ఎందుకంటే... జీవికి..ఉత్పత్తి, ఎదుగుదల, నాశనము అనే మూడు దశలు ఉన్నట్టే..సూర్యునకు ఉదయము, పూర్ణవికాసము, అస్తమయము అనే మూడు దశలు ఉన్నాయి. బాలభానుడుగా ఉదయించిన సూర్యుడు.. మధ్యాహ్నానికి పూర్ణవికాసుడై.. సాయంకాలానికి అస్తమిస్తాడు.* 


*నిజానికి సూర్యునకు అస్తమయం ఉందా.. లేదే. ఇక్కడ ఆయన అస్తమయం.. మరొకచోట ఉదయానికి నాంది. అంతే. అలాగే.. జీవికి మరణం.. మరోచోట జననానికి నాంది.* 


*అందుకే అస్తమయం లేని సూర్యుడు.. జననం నుంచి జననం అనే గమ్యానికి చేర్చే సారధి అయ్యాడు. జీవికి ఈ వైరాగ్యాన్ని తెలియచెప్పడమే..ఆయన ఉదయ, మాధ్యాహ్నిక, సాయం సంధ్యల లక్ష్యం.*


*ఈ లక్ష్యాన్ని గుర్తించడం కోసమే., ఈ త్రిసంధ్యలలో సూర్యుని ఉపాసించాలి అనే నియమాన్ని మనకు ఏర్పాటు చేసారు... మన ఋషులు.*


*సూర్యోపాసన వల్ల...తేజస్సు, బలము, ఆయువు, ఆరోగ్యము వృద్ధిపొందుతాయి. అంతేకాదు.. జన్మించిన జీవి.. మరోజన్మ అనే గమ్యం చేరాలంటే ‘మరణం’ అనే మార్గం గుండానే వెళ్లాలని చెప్పాను కదా. ఈ మరణమార్గం సూర్యలోకం గుండానే సాగుతుంది.*


* మరల జన్మే లేకపోతే..కాలం ప్రయాణం ఆగదుకానీ.. జీవికి, ప్రయాణం ఆగిపోతుంది. అదే ‘మోక్షం’. ఆ మోక్షమార్గమే..పరమాత్ముని సన్నిదికి చేర్చే ‘పరమపద సోపాన మార్గం’. జీవికి ఈ నిత్య సత్యాన్ని తెలియచెప్పడమే.. సూర్యగమనం యొక్క సారాంశం.*


*అందుకే..ఆ ప్రత్యక్షదైవాన్ని త్రిసంధ్యలలోనూ ఉపాసించాలి. అదే...మనం చేసే ఈ జనన, మరణ ప్రయాణానికి మనం చెల్లించే ప్రయాణ మూల్యం.*✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: