*సండే స్టోరీ*
*భరోసా విలువ*
👐
రచన : ప్రతాప వెంకట సుబ్బారాయుడు
రాతి బస్టాండ్ కి వచ్చి భీమవరం వెళ్లే బస్ ఎక్కి కూర్చున్నాను. మనసు పరి పరి విధాలపోతూ వికలంగా వుంది.
అయిదు నిముషాల తర్వాత ఎవరో ముసలాయన వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నాడు. కొద్దిగా ఆయాసపడుతు న్నాడు. ఈ వయసులో చివరి గమ్యం దాకా ప్రయాణించగలడో, లేక మధ్యలో గుటుక్కుమంటాడో. నా పక్క సీటే ఈయనకి రావాలా? ఈయన్ని చూస్తే మా నాన్న గుర్తొచ్చి ఓ మూల జాలేస్తోంది. కానీ అసలే చిరాగ్గా వున్న నా మనసుకు ఇది ప్లస్సయింది.
"బాబూ, నేను మంచినీళ్లు తెచ్చుకోవడం మరచిపోయాను, కాస్త ఇవ్వవూ ట్యాబ్లెట్ వేసుకోవాలి" అని అభ్యర్ధించాడు.
'మందులు వేసుకోవాలని తెలిసినవాళ్లు మంచినీళ్లు తెచ్చుకోవడం ఎలా మరచి పోతారో' అని మనసులో విసుక్కుంటూ బాటిల్ ఇచ్చాను. ఆయన ట్యాబ్లెట్ వేసుకున్నాడు.
డ్రైవర్ వచ్చి కూర్చుని బస్ స్టార్ట్ చేశాడు. రెండు నిముషాల్లో బస్ బయల్దేరింది. కిటికీ లోంచి చల్లటి గాలి వీస్తూ మనసుని ఆహ్లాదపరుస్తోంది.
నా పక్కాయన నిద్రలోకి జారుకున్నాడు. 'భగవంతుడా! అది శాశ్వత నిద్ర కాకుండా చూడు' అని మనసులో అనుకున్నాను.
బస్ వేగంతో పాటు నా ఆలోచనలు క్రమాకృతి దాల్చి మనసులో సినిమాలా కదుల్తున్నాయి.
పల్లెటూళ్లో మధురానుభూతుల మధ్య పెరిగినా, దూరపుకొండలు నునుపు కాబట్టీ పట్నవాసపు సొగసులు, అక్కడి విలాసవంతమైన జీవితాలూ నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తుండేవి. డబ్బు బాగా సంపాదించాలి. సిటీలో సెటిలవ్వాలి. ఇవే నా మ్ముఖ్య ధ్యేయంగా పెట్టుకుని కష్టపడి చదువుకున్నాను. మా నాన్న మొక్కకు కావల్సిన ఎరుపు, నీళ్లు సకాలంలో పోసి సంరక్షించినట్టుగా నా చదువు కోసం కావలసిన వనరులు అన్నీ చాలా శ్రద్ధగా సమకూర్చేవాడు. అందువల్ల నా చదువు నల్లేరు మీద బండి నడకలా ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా సాఫీగా సాగి నా చేతిలో సర్టిఫికెట్ పెట్టింది.
అప్పట్లో అన్ని రంగాల్లోకి తారాజువ్వలా దూసుకెళుతున్న సాఫ్ట్ వేర్ రంగంలో అదృష్టవశాత్తు కాలు పెట్టగలిగాను.
పని..డబ్బు..జల్సా వీటితోటే నా జీవితం ముడిపడిపోయింది.
రాత్రి పగలు ఒకటే పని. చిన్న వయసు లోనే బి పి వచ్చేసింది. పని ఒత్తిడితో, నిద్ర సరిగా లేక ట్యాబ్లెట్లు ఖచ్చితంగా వేసుకోవలసిన కొన్ని వ్యాధులు నా శరీరాన్ని ఆశ్రయించాయి. సంస్థ ఇచ్చిన ఫెసిలిటీస్.. అందుకునే శాలరీ ముందు నాకు అవేం పెద్ద ఇబ్బందులనిపించలేదు.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
అప్పుడప్పుడూ మా ఊరెళ్లినప్పుడు నాన్న మాత్రం "నీ శరీరంలో అసహజ మార్పులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యమే మహా భాగ్యము. జీవించినంత కాలం ఆహ్లాదంగా, ఆనందం గా జీవించాలి. మనకు దొరికిన ఈ మానవ జన్మ అద్భుతమైనది. దాన్ని అనుభూతించాలి. అంతేకాని మరబొమ్మ లా మారకూడదు" అని సున్నితంగా హెచ్చరించేవాడు.
మంచి మాటలు తలకెక్కించుకునే వయసా అది. నవ్వి ఊరుకునేవాడిని.
రెండేళ్ల తర్వాత నా టీమ్ మేట్ గా జూనియర్ పొజిషన్ లో చేరింది స్వప్న. చాలా చలాకీగా ఉండేది. సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ రాయడంలో తనదైన స్టైల్ కనబరిచేది. తను రాసిన ప్రోగ్రామ్స్ లో బగ్స్ ఉండేవి కావు. ఎక్జాక్ట్ అవుట్ పుట్ వచ్చేసేది. క్లయింట్స్ చాలా హ్యాప్పీగా ఉండేవారు.
అప్పటిదాకా పని తప్ప మరో ప్రపంచం తెలియని నన్ను, తన వైపు తన ఆకర్షణ శక్తితో బలంగా తిప్పేసుకుంది. ఇప్పుడు తనే ఒక ప్రపంచమైపోయింది నాకు.
తననే గమనించడం, పనిలో మెళకువలు నేర్పడం, లంచ్ ని షేర్ చేయడం, నా బైక్ మీద డ్రాప్ చేయడం లాంటివి అత్యంత ఇష్టంతో చేస్తున్నాను.
ఒకనాటి సాయంత్రం టాస్క్ సక్సెస్ అయిన నేపథ్యంలో మంచి ఖరీదైన హోటల్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఆఫర్ చేశాను.
ఆ రాత్రి రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నాక, మెల్లగా ఆఫీసు విషయాల్లోంచి టాపిక్ ని డైవర్ట్ చేసి ఆమెకు ప్రొపోజ్ చేశాను. ఆమె బెట్టు చేయడం కానీ, సున్నితంగా తిరస్కరించ డం కానీ చేయలేదు. సింపుల్ గా ఒప్పేసుకుంది.
మామూలు మనిషి ఏనుగు అంబారి ఎక్కేది బహుశా ఇలాంటి సందర్భంలోనే అనుకుంటా. మనసు దూది పింజ అయింది.
"మనిద్దరం యంగ్. బోలెడంత ప్యూచర్ వుంది. మీరూ హేండ్ సమ్ గా, చురుకుగా ఉంటారు. హెల్పింగ్ నేచర్ వుంది. మన మ్యారీడ్ లైఫ్ హాప్పీగా సాగిపోతుందని నాకు నమ్మకం ఉంది. మా నాన్న ఒంగోలులో ఓ చిన్న కౌలు రైతు. తనది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితైనా, చదువులో చురుకైన దాన్ని కావడం వల్ల నా చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకున్నారు.
నేనిక్కడే వర్కింగ్ విమెన్ హాస్టల్లో ఉంటున్నాను. మా వాళ్లు నా మాట కాదనరు, మా కుటుంబ పరిస్థితులు మీకు అభ్యంతరం కాకపోతే, మన విషయం మా వాళ్లతో చెప్పి, మా నాన్నగారిని..మీ వాళ్లని కలవమని చెబుతాను" అంది.
'నేను 'సమ్మతమే' అన్నట్టుగా ఆమె చేతిని అందుకుని సన్నగా నొక్కాను.
సెల్ ఫోన్ లో సంతోషంగా మా వాళ్లకు విషయం చెప్పాను. మొదట్నుంచి వాళ్లు నన్ను స్వేచ్ఛగా పెంచారు. మనసులో ఏదీ దాచుకోవడం మాకు ఇష్టముండదు. అందుచేత నా నిర్ణయానికి అమ్మానాన్న లు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు.
అనుకున్నట్టుగానే ఆమె తల్లిదండ్రులు మా వాళ్లని కలిసారు. తర్వాత వచ్చిన మంచి రోజులు మా ఇద్దర్నీ ఒక్కటి చేశాయి.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
లక్షల్లో హోమ్ లోన్ తీసుకుని మాదాపూర్ లో ఫ్లాట్ తీసుకున్నాము. మాదైన చిన్న ప్రపంచం ఏర్పడిపోయింది. కొంతకాలానికి మరో ఇద్దరు బుజ్జి అతిధులు వచ్చారు. కాలం కమ్మగా పీచు మిఠాయిలా కరిగిపోతోంది. పెన్నులో ఇంక్ బదులు మధురం నింపి డైరీల్లోని పేజీలను నింపుకుంటున్నాం. డబ్బుని వెదజల్లి.. సుఖాలను సొంతం చేసుకుంటూ జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగిపోతున్న ప్పుడు ఒక చిన్న జర్క్.
రిసెషన్...(మాంద్యం)
శిశిరంలో వృక్షాలు ఆకులు రాల్చేసినట్టు టపటప మని అన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు ఉద్యోగులను తొలగించేశాయి.
స్వప్న ఉద్యోగం పోయింది.
ఇంకోటి దొరుకుతుందన్న ఆశ కూడా లేదు, ఎందుకంటే అవకాశలు లేవు, ఉన్నా ఎనార్మస్ స్కిల్స్ తో ఎక్విప్ అయి వున్న తన తోటివాళ్ల తోటే తనకు పోటీ. పోనీ మేమేమన్నా చిన్న ఉద్యోగులమా? ఏదో ఒక పని చెయ్యడానికి. ఏ సీ లకీ, ఫెసిలిటీస్ కి, క్యాబ్ లకీ అలవాటు పడిన జీవితాలు మావి. ఎండలోకి వెళ్తే గట్టిగా నాలుగడుగులేయలేం. మానసిక క్షోభ. అనుక్షణం రంపపు కోత.
రెండు జీతాలకు అలవాటు పడిన మా ఇంటికి ఇది అశనిపాతం. ఇంటి లోన్ కు దాదాపు ఒక జీతం వెళ్లిపోతుంది. అలాంటిది ఒక్క జీతంతో అన్నీ ఎలా? ఎలా?? పోనీ దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవడం కోసం ఏవైనా పొదుపు చేసి కూడబెట్టామా? అంటే, అదీ లేదు. అసలు రేపటి గురించి ఆలోచన ఉంటేగా!
భవిష్యత్తు కూడా వర్తమానం లానే బంగారంలా ఉంటుందనుకున్న మా ఆశలు అలా ఆవిరయ్యాయి.
నిన్నటి దాకా మాల్స్, మల్టిప్లెక్స్ ల్లో గీక్కో మని క్రెడిట్ కార్డ్ లు నిర్లక్ష్యంగా విసిరేసిన మేము, సరుకుల కోసం మార్వాడీ వాళ్ళ షాపులకు వెళ్లగలమా? అసలు అంత ఛేంజ్ ని ఒక్కసారిగా మనసు డైజెస్ట్ చేసుకోగలుగుతుందా?
మా సంస్థలో కూడా మ్యాన్ పవర్ రిడక్షన్ మొదలైంది. 'భగవంతుడా నా పేరు ఆ లిస్ట్ లో ఉండకుండా చేయి' అని నా మనసులో వేలసార్లు మౌన ప్రార్ధనలు
చేశాను. నిజం చెప్పాలంటే బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నాం.
ఒక నెల భారంగా గడిచింది. చివరికి అనుకున్నంతా అయింది.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
నేనెళ్లేసరికి హెచ్ ఆర్ నుంచీ వచ్చిన లెటర్ నా కోసం ఎదురు చూస్తోంది. నా మెదడు శూన్యమయిపోయింది.
రేపటి నుంచీ ఎలా? ఎలా?
శరీరం నుంచీ రక్తం పీల్చేసినట్టు నా అడుగులు తడబడుతూ ఇంటికి చేరాను.
తలుపు తీసిన స్వప్న నేను విషయం చెప్పకుండానే గ్రహించింది.
ఇద్దరి మనసులోనూ రేపెలా? అన్నదే దొలిచేస్తున్న ప్రశ్న. ఆ రాత్రి మేము నిద్ర పోకుండానే తెల్లారింది.
నిన్నటిదాకా తెల్లారుతోందంటే ఎంత ఉత్సాహంగా ఉండేది? కొత్త టాస్క్ లు అలాట్ చేయబడతాయని, వాటిలో మన పెర్ఫార్మెన్స్ కు తగిన షేర్ ఉంటుందనీ.
కానీ ఇప్పుడు రోజులు అతి భయానకం గా, భారంగా గడుస్తున్నాయి. తెల్లారితే సమస్యలు పలకరిస్తాయి కాబట్టి, అసలు తెల్లవారకూడదనిపిస్తోంది.
మా సంగతి సరే, పిల్లలు ఎలా? వాళ్లని పోషించడమూ కష్టమే! మా పెద్దవాళ్ల దగ్గర వదులుదామంటే, ఇన్నాళ్లూ మా సంతోషం మాదే గానీ వాళ్లని అసలు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలం? ముఖ్యంగా మా అమ్మానాన్నలు. వాళ్లని చూసి చాలా కాలమయింది. మా అమ్మ ఫోన్ చేసి నన్ను చూడాలని విలవిల్లాడిపోయేది. తీరికుంటేగా! వీకెండ్స్ మా ఎంజాయ్మెంట్ కే సరిపోయేది కాదు.
మా నాన్నతో, అమ్మని తీసుకుని మా ఇంటికి రమ్మని ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పాను. ఇక్కడి కంఫర్ట్ లైఫ్ గురించి ఏకరువు పెట్టేవాడిని. అయినా 'తనకు అక్కడే స్వేచ్ఛగా ఉంటుందనీ, రాలేనని' నిర్ద్వందంగా తిరస్కరించేవారు. రోజు రోజుకి పరిస్థితి అద్వాన్నమవుతోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఇప్పటికే ఇంట్లో వున్న బంగారం, ఖరీదైన వస్తువులు అమ్మి ఎనిమిది నెలలు గడిపేశాం. ఇక పైన కష్టం.
రోజులు ఇలాగే కొనసాగితే 'డిప్రెషన్ లోకెళ్లి ఆత్మహత్య చేసుకుంటామేమో' అన్న అనుమానం వస్తోంది.
ఏదో ఒకటి చేయాలి. లాభం లేదు.
"స్వప్నా" పిలిచాను.
నీరసంగా వచ్చింది.
"నేను ఇవాళ బయలుదేరి మా నాన్న దగ్గరకు వెళ్లి వస్తాను. నువ్వూ, పిల్లలూ జాగ్రత్త. మా నాన్న అనుభవం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని నా నమ్మకం. ఊళ్లో వాళ్లకు ఎన్నోసార్లు సరైన సలహాలు చెప్పడం విన్నాను. నాకు ఇన్నాళ్లు ఆయన గుర్తుకు రాకపోవడమే ఆశ్చర్యంగా వుంది" అన్నాను ఉద్వేగంగా
చమార్చిన కళ్ళతో...
నా సంతోషం, స్వరంలో వినిపించేసరికి తనకు కూడా కాస్త జీవం వచ్చినట్టుంది.
"అలాగేనండీ, మనకిప్పుడు కావలసింది పెద్దవాళ్ల సపోర్టే! మా వాళ్లు ఆర్థికంగా అంత ఉన్నవాళ్లు కాదు. మా నాన్నకు అంత లౌకిక జ్ఞానమూ లేదు. మన సమస్యకు పరిష్కారం మీ నాన్న ఇవ్వగలరంటే, ఇప్పుడే, ఇంకాలస్యం చేయకుండా వెళ్లిరండీ" అంది తొందరగా బ్యాగ్ సర్ది చేతికిస్తూ.
నేను కలల ప్రపంచంలోంచి హఠాత్తుగా ఈ లోకంలోకి వచ్చి చూసేసరికి బస్సు పచ్చటి పొలాల మధ్య పరిగెడుతూ మాకు స్వచ్ఛమైన ప్రాణ వాయువుని ఇస్తోంది. ఆ పచ్చటి పైరునీ.. పొలాలని చూసేసరికి ప్రాణం లేచొచ్చింది.
ఎప్పుడు లేచాడోగానీ నా పక్కన ఉన్న ముసలాయన పేపర్ చదువుతున్నాడు. నిన్న రాత్రి ఆయన పట్ల నాకు కలిగిన ఆలోచనకు నవ్వొచ్చింది.
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
మా ఊరి బస్టాండ్ లో దిగగానే వేప్పుల్ల తో పళ్లు తోముకునేవాళ్లు, మోకాళ్ల దాకా నిక్కర్లు వేసుకున్నవాళ్లని చూడంగానే మా ఊరు, మా వాళ్ల మధ్యకొచ్చేశానన్న ఏదో తెలియని అనుభూతి మదిని చుట్టేసింది. దూరంగా వున్న చంటి హోటల్ నుంచి వచ్చే ఇడ్లీ ఆవిరి వాసనా, దోశ కాలిన వాసనా కలగాపులగంగా అయినా కమ్మగా నాసికా పుటల్ని సోకాయి.
రెండు ఇడ్లీలు తిని కాస్త కాఫీ తాగుదామ నుకున్న నాకు స్వప్న, పిల్లలూ గుర్తొచ్చి కాళ్లను ఇంటి వైపు నడిపించాను. గోదావరి ఒక పాయ మా ఇంటి ముందు
నుంచీ ఒంపుసొంపులతో ప్రవహిస్తుంది. దాన్ని తాకుతూ సాగే మట్టి రోడ్డు మీద నడవడం నాకు ఎప్పుడూ ఇష్టమే! మధ్య మధ్యలో పెంకులు అందుకుని నీళ్లపై కప్పు గంతులేయిస్తూ తాత్కాలికంగా మురిసిపోయాను, అన్ని సమస్యలు మర్చిపోయి, మానసికంగా..!
ఇంటి ముందుకు చేరేసరికీ మా నాన్న వసారాలో కూర్చుని పేపర్ చదువుకుంటు న్నాడు.
నేను గేటు తీయంగానే ఆ చప్పుడుకు నా వైపు చూసి నాలోని నిస్తేజాన్ని తన అనుభవంతో పరిశీలించి, ఏదో సమస్య నన్ను వేధిస్తోందని గ్రహించి, నా దగ్గర కొచ్చి ఆప్యాయ్యంగా నా బుజం మీద చేయి వేసి "మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు ఫ్రెష్ అయి కాసేపు విశ్రాంతి తీసుకో. అప్పటికి నీ మనసులోని అలజడి కాస్త సద్దుమణు గుతుంది" అన్నాడు అనునయంగా.
నేను 'సరే' అన్నట్టుగా ముందుకు కదిలాను. అమ్మ ఎదురొచ్చి "ఏరా, ఇంతగా చిక్కిపోయావు. నువ్వు సంతోషంగా వున్నావనుకున్నాం గానీ ఇలా అయిపోయావేమిట్రా? అవునూ, అమ్మాయిని పిల్లల్ని తేలేదేమిటి?" అంది కళ్ల నీళ్లతో నన్ను నిలువెల్లా అపేక్షగా తడుముతూ.
"అన్నీ చెబుతాడు, ముందు వాడిని ప్రయాణ బడలిక పోగొట్టుకోనీ, రాజ్యం" అన్నాడు నాన్న అమ్మతో.
నేను లోపలికెళ్లి స్నానం ముగించి వచ్చే సరికి అమ్మ నా కోసం వేడి వేడిగా చింతపండు పులిహార సిద్ధం చేసింది. తిన్నాక నిద్ర ముంచుకువచ్చింది. ఆ నిద్ర.. నిద్ర మధ్యాహ్నం ఒంటిగంటకు లేచాను. చాలా కాలానికి మాంఛి నిద్ర పట్టింది. అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోయాను.
నేను లేచేసరికి నాన్న లేడు. పని మీద బయటకి వెళ్లాడని అమ్మ చెప్పింది.
కాసేపటి తర్వాత భోజనానికి వచ్చాడు.
మా అమ్మ చేసిన పదార్థాలు నా ఆకలిని ద్విగుణీకృతం చేసి చల్లబరచాయి. అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే!
https://chat.whatsapp.com/L1U7VgqJf648XU8zen6US2
తిన్నాక వాయువ్యం వైపున్న విశాలమైన గదిలో కూర్చున్నాం. నేను మధ్యాహ్నం వేసుకోవలసిన అయిదు రకాల ట్యాబ్లెట్లు వేసుకున్నాను.
మెల్లగా ఉద్యోగంలో ఆకాశ విహారం.. రిసెషన్.. కొంతకాలంగా మేము ఎదురు కుంటున్న గడ్డు పరిస్థితి పూసగుచ్చాను.
అన్నీ విన్న ఆయన "ఇందులో బాధ పడడానికి ఏముంది? సుఖ దుఃఖాలు, చీకటి వెలుగులూ సహజమే! వాటికి బెంబేలెత్తితే ఎలా? నీ ఆలోచనలు, నీ మొన్నటి స్థాయికి తగ్గట్టు ఉన్నాయి కాబట్టే సతమతమవుతున్నావు. 'ఎవరికీ ఏదీ శాశ్వతం కాదు' అన్న ఎరుక కలిగి వుంటే ఇబ్బంది ఉండదు. సృష్టిలో ఏ జీవీ ఆకలితో చచ్చిపోదు, అది ఎక్కడో అక్కడ తన కడుపుకు ఎంత కావాలో అంత సంపాదించుకుంటుంది. మనలాగా దాచుకోవడం కూడా తెలియదు. అయినా బతికినంతకాలం హాయిగా, సుఖంగా బతుకుతుంది. మనమే లేని పోని భేషజాలకు పోయి తినడానికన్నా విలాసాల కోసం, సౌకర్యాల కోసం నేల విడిచి సాము చేస్తాం. అప్పుడు భంగ పాటు తప్పదు.
'కడుపులో చల్ల కదలకుండా' అని మన వాళ్లు ఊరికే అనలేదు. ఎండమావుల కోసం పరిగెత్తి చివరకు అలసిపోయి కూలబడిపోవడం తప్ప, ఓ సుఖమా, సంతోషమా? నన్ను నువ్వు ఎన్నోసార్లు రమ్మన్నావు, వచ్చానా? లేదు. ఎందుకంటే వస్తే వాటికి దాసోహం అయ్యే అవకాశం ఉంది.
ఇక్కడ పల్లెటూరిలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? అంతెందుకు నువ్వు నీ శరీరాన్ని అంటిపెట్టుకున్న అనారోగ్యా నికి ఎన్ని మందులేసుకున్నావో ఇందాక చూశాను. నాకు ఇంతవరకు తలనొప్పి ఎలా ఉంటుందో తెలియదు, అదీ వ్యత్యాసం. ఏసీ గదులతోనూ, సకల సౌకర్యాలతోను శరీరాన్ని సుఖబెట్టి దాన్ని కష్టపడమంటే ఎందుకు కష్టపడుతుంది? కష్టబడితేనే కదా సుఖం. ఎప్పటికైనా సుఖం నుండి లభించే సుఖం కాదు కష్టం నుంచీ లభించే సుఖమే విలువైనది.”
ఇవన్నీ ముందే చెప్పొచ్చు కదా! ఇప్పుడు 'చేతులు కాలాక' ఎందుకు 'చెబుతున్నా డు' అని నువ్వనుకోవచ్చు. దేనికైనా సమయం రావాలి. భగవద్గీత ఆవిష్కరణ కురుక్షేత్ర యుద్ధంలోనే జరిగింది. మొదలే చెప్పుంటే నువ్వు నాతో పోట్లాడి మరీ, ఈ ఇంటి గుమ్మం దాటేవాడివి. దాని ఆకర్షణ అలాంటిది. అప్పుడు మళ్ళీ ఈ ఇంటి తలుపు తట్టడానికి సంకోచించేవాడివి. అందుకే అప్పుడు మౌనం వహించాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మిమ్మల్ని చూసుకోవడానికి పెద్ద దిక్కు మేమున్నాం. అమ్మాయినీ పిల్లల్నీ కూడా ఇక్కడకు వచ్చేయమను. పసిపిల్లల మీద విషపు ఛాయలు పడనీయకండి.
కొన్నాళ్లు కలుషితానికి దూరంగా ఇక్కడి ప్రకృతిలో మమేకమై కాలం గడపండి. మానసికంగా సేద దీరండి.. సాంత్వన పొందండి. మనసు ఎప్పుడైతే ప్రశాంతత పొందుతుందో, సరైన ఆలోచనలకు మార్గం సుగమం అవుతుంది. ఆడంబరా లన్నీ మన ఊరి పొలిమేరలో వదిలేసి రండి. జీవించడానికి కడుపునింపుకోవా లి. కడుపు నింపుకోవడం ఇక్కడ కష్టం కాదు. నెమ్మదిగా అన్నీ కుదుటపడ్డాక ఏంచేయాలన్నది ఆలోచిద్దాం" అన్నాడు.
ఊరిలో ప్రతి తండ్రీ తన అనుభవంతో బిడ్డలకు కౌన్సిలింగ్ ఇవ్వగలడు. సైకియాట్రిస్ట్ కాకుండానే మనసుకు మందేయగలడు. కానీ మనం.. పెద్ద చదువులు చదువుకున్న వాళ్లమని, దేశ విదేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నామని విర్రవీగుతూ, 'పల్లెటూరి వాళ్లు.. వాళ్లకేం తెలియదని' తేలికగా తీసిపారేస్తాం. ఆత్మహత్య దాకా ఆలోచించిన మనసుకు, మా నాన్న తన మాటలతో ఊరటనిచ్చారు. 'బతకగలం' అనే భరోసానిచ్చారు.
ఒక్కోసారి సమస్యలో కూరుకుపోయిన ప్పుడు మనకు మనంగా పైకి రాలేం. అందులోనే ఉండడం వల్ల దారులన్నీ మూసుకుపోయనట్టు అనిపించి జీవితం అంతం చేసుకోవాలనుకుంటాం. అలాంటి విపత్కర సమయంలో మనకు మరో దారి చూపించి మానసికంగా బలాన్నిచ్చేవాళ్లు కావాలి. అందుకే పెద్దవాళ్ళు దగ్గరగా ఉండాలి. ఇలాంటప్పుడే అమ్మ నాన్న ల విలువ తెలుస్తుంది.
సిటీలో ఐతే మానసిక వైద్య నిపుణులు ఆ పని చేస్తారు. కానీ ఎంతమంది వాళ్లని ఆశ్రయిస్తారు ? అయినా ఇప్పుడంటే అలాంటి అవకాశాలు ఉన్నాయి గాని, ఒకప్పుడు పెద్దవాళ్లే కదా ఆ బాధ్యత నెరవేర్చేది. అందుకే పెద్దవాళ్ల, అనుభవ జ్ఞుల సలహలూ తీసుకుంటూ ఉండాలి. 'గతం ఓ పీడకల. దాన్ని వీలైనంత త్వరగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి' అనుకున్నాక నా మళ్లీ మనసులో ఉత్సాహం ఉరకలేయడం మొదలెట్టింది.
సెల్ తీసుకుని స్వప్నకు ఫోన్ చేసి 'రాత్రికి బయల్దేరి ఊరొచ్చేయమ' న్నాక నా మనసు పూర్తిగా కుదుటపడింది.
నాన్న తనకు ఏదో పనుందని బయటకి వెళ్లిపోయారు. నేనూ అలా ఊళ్లోకి బయల్దేరాను. రేపట్నుంచి, పిల్లలకు చదువు చెప్పడమో, పొలం పనుల్లో నాన్నకు చేదోడువాదోడుగా ఉండడమో చెయ్యాలి కదా...! మళ్ళీ ఒక సరికొత్త జీవితం ప్రారంభించాలి కదా......
🪷
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
*1 YEAR SUBSCRIPTION 120/-*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి