27, అక్టోబర్ 2022, గురువారం

Bhagavatham

 [ Srimadhandhra Bhagavatham -- 41 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

నాభి ఒక కొత్త మార్గమును ఆవిష్కరించాడు. ఆయన యజ్ఞముయొక్క  గొప్పతనమును ఆవిష్కరించాడు. యజ్ఞము చేత భక్తిచేత పరమేశ్వరుడిని కట్టి ఎలాగ తన కొడుకుగా తెచ్చుకోవచ్చునో నిరూపించాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చునో తెలియజేశాడు. ఆయన భగవంతుడిని మోక్షం ఇమ్మని అడగలేదు. ఋషభుడిని కొడుకుగా పొంది వైరాగ్య సంపత్తి చేత తాను మోక్షమును పొందాడు. ఇది నాభి వృత్తాంతము.

ఋషభుడు చాలాకాలం రాజ్యం చేసి వివాహం చేసుకున్నాడు. తరువాత తన కుమారులను పిలిచి రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు పిల్లలను పిలిచి ఒకమాట చెప్పాడు. ఋషభుడి చరిత్రవింటున్న వారికి చదువుచున్న, వారికి సాక్షాత్తుగా శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెపుతారు. ‘కుమారులారా! కుక్క ఎన్ని కష్టాలు పడుతోందో అత్యంత పవిత్రమయిన ఉపాధిని పొందిన మనిషికూడా అన్ని కష్టాలు పడుతున్నాడు. దేనివల్లనో తెలుసా? కేవలము కామము చేత కష్టములు పడుతున్నాడు. కామము అంటే కేవలము స్త్రీ పురుష సంబంధమయిన గ్రామ్యసుఖము మాత్రమే కాదు. కామము అంటే కోరిక. కోరికకు ఒక లక్షణము ఉంటుంది. అది లోపల అంధత్వమును ఏర్పరుస్తుంది. మీరు ఒక కోరికకు లొంగినట్లయితే ఒక పరిమితమయిన కోర్కె పెట్టుకొని మీ శక్తిని దృష్టిలో పెట్టుకుని అక్కడవరకు ప్రయాణము చేయడము గృహస్థాశ్రమంలో దోషం కాదు.   వాళ్ళను చూసి వీళ్ళను చూసి అలవికాని కోర్కెను పెంచుకుంటే ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది. ధర్మము గాడితప్పవచ్చు లేదా ఉండవలసిన దానికన్నా అనవసరమయిన దానికి తిరగడములో చేయవలసిన ఈశ్వరారాధన   వదులుకుంటున్నారు. కోరికలు బంధించి వేసి కళ్ళల్లో ధూళి పోసి కనపడకుండా చేస్తాయి. మనిషి కుక్కకన్నా హీనం అయిపోతాడు. అందరిచేత ఛీ అనిపించుకుంటాడు. కామమును అదుపు చెయ్యి. మనసులో ధారణ ఉండాలి, పూనిక ఉండాలి.  కామము పెరిగిపోవడమే బంధహేతువు అవుతుంది. దీనిని విరగ్గొట్టడానికి నేను రెండుమార్గములు చెపుతాను. అందులో మొదటిది తపము చెయ్యడం. తపము లేక ధ్యానము చెయ్యండి. ఈశ్వరునియందు భక్తిని పెంపొందించుకోండి. రెండవది సజ్జనసాంగత్యము. సజ్జనసాంగత్యము ఒక్కటే ఈశ్వరుని దగ్గరకు తీసుకువెళుతుంది. ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి. క్రమక్రమముగా అంతటా ఈశ్వరుడిని చూడడము నేర్చుకోవాలి. ‘నేను, నాది’ అనే భావన విడిచిపెట్టాలని బిడ్డలకి చెప్పి నేను బయలుదేరుతున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆయన రూపమును చూసి ఏమి అందగాడని ప్రజలంతా మోహమును పొందారు. ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. స్నానం లేదు. ఒళ్ళంతా ధూళి పట్టేసింది. ఇంతకు పూర్వం ఋషభుడిని చూసిన వారు ఇప్పుడు ఆయనను చూసినా గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అలా వెళ్ళిపోయి చాలా కాలానికి ‘అజగరవ్రతము’ అని ఒక చిత్రమయిన వ్రతం పట్టాడు.

అజగరము అంటే కొండచిలువ. కొండచిలువ ఎలా భూమిమీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒకచోట భూమిమీద పడి ఉండిపోయాడు. అతడు పొందిన యోగసిద్ధికి సిద్దులన్నీ  మేము నిన్ను వరిస్తున్నాము స్వీకరించండి’ అని అడిగాయి. నాకీ సిద్ధులు అక్కరలేదని వెళ్ళిపొమ్మన్నాడు. అలా చాలాకాలం పడివుండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రమునందున్న అరణ్యమునందు నడుస్తున్నాడు. ఆయన అలా నడిచివెడుతుంటే అక్కడ వున్న చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి ఒక అగ్నిహోత్రము బయలుదేరింది. పెద్ద అగ్నిజ్వాలలు రావడం ప్రారంభించాయి. ఆయన వాటివంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. అవి వచ్చి అంటుకుంటే శరీరము పడిపోతుంది అనుకున్నాడు. యధార్థమునకు అలా ఉండడము అంత తేలికకాదు.  ఋషభుడి కథ అసుర సంధ్యవేళ ఎవరు వింటున్నారో వాళ్లకి సమస్త కామితార్థములు ఇవ్వబడతాయని చెప్పబడింది. ఆ అగ్నిహోత్రం శరీరమును పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు. శరీరం కాలిపోయింది. తాను ఆత్మలో కలిసిపోయాడు. ఋషభుడు ఇలా శరీరమును వదిలిపెట్టాడని రాజ్యమును ఏలుతున్న అరహన్ అనే రాజు తెలుసుకున్నాడు. తెలుసుకుని ‘మనకు ఒక సత్యం తెలిసింది. లోపల ఉన్నది ఆత్మ. ఈ శరీరము మనది కాదు. కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళెవరూ స్నానం, సంధ్యావందనం చేయనక్కరలేదు. దేవాలయములకు వెళ్ళక్కరలేదు. పూజలు చేయనక్కర లేదు. బ్రాహ్మణులను గౌరవించనక్కరలేదు. యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతారు’ అని చెప్పాడు. వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలుపెట్టారు.

  వ్యాసులవారు ఇది మహాదోషము అన్నారు. ఎందుచేత? ఇది కలియుగ లక్షణము. మీరు ప్రయత్నపూర్వకముగా జ్ఞానిని అనుకరించలేరు. ఎన్నడూ అజ్ఞానిని అనుకరించరాదు. మీరు కర్మ చెయ్యాలి. అదే మిమ్మల్ని జ్ఞానిని చేస్తుంది.  మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చేయాలి. అది వైరాగ్యమును ఇచ్చి ఒకనాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు. ఇక్కడ కొంతమంది పొరపడుతుంటారు. అదే అరహన్ చేసిన భయంకర కృత్యము. ఒక మహాపురుషుని జీవితకథగా దీనిని విని, చేతులు ఒగ్గి నమస్కరించాలి. అలా చేస్తే మీకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి మీరు కృష్ణ పాదములను చేరుకుంటారు. మీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది.

2. భరతుని చరిత్ర:

మహానుభావుడయిన ఋషభుని కుమారుడే భరతుడు. ఆయన పరిపాలించాడు  కనక మనదేశమునకు భరతఖండము అను పేరువచ్చింది. ఆయన విశ్వరూపుడు అనే ఆయన కుమార్తె ‘పంచజని’ని వివాహం చేసుకుని సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, దూమ్రకేతువు, అను ఐదుగురు బిడ్డలను కన్నాడు. ఆయన భక్తి వైరాగ్యములతో కొన్ని వేల సంవత్సరములు భరత ఖండమును పరిపాలించాడు. ఆయనలా పరిపాలించిన వారు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశమునకు ‘భరత ఖండము’ అన్న పేరు వచ్చింది.

ఆయన ఒకరోజు  ‘ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తాను? ఇక్కడి నుండి బయలుదేరి పులహాశ్రమమునకు వెళ్ళిపోతాను. అక్కడ గండకీనది ప్రవహిస్తోంది.  సాలగ్రామములు దొరుకుతూ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను’ అని బయలుదేరి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు తెల్లవారు జామునే సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణ దర్శనము తెల్లవారిన తరువాత జరుగుతుందనే ఉద్దేశంతో నదీస్నానం కొరకని చీకటి ఉండగానే వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని జపం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక చిత్రమయిన సంఘటన జరిగింది. అక్కడికి నిండుచూలాలయిన ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంతలో అక్కడే అరణ్యంలో సింహం ఒకటి అరణ్యము బ్రద్దలయిపోయేటట్లు గర్జించింది. సింహం అరుపు విని నిండుగర్భిణి అయిన లేడి భయపడిపోయి నీటిలోకి దూకేసింది. వెంటనే దానికి ప్రసవమై ఒక లేడిపిల్ల పుట్టింది. లేడి వరదలో కొట్టుకుపోయింది. దానిని భరతుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ పిల్లను తెచ్చాడు. అయ్యో! తల్లి మరణించిందే అనుకుని ఈ లేడిపిల్లను ఆశ్రమములో తనపక్కన పెట్టుకున్నాడు. మెల్లమెల్లగా దానికి లేత గడ్డిపరకలు తినిపించడము కొద్దిగా పాలుపట్టడము దానిని పులో, సింహమో వచ్చి తినేస్తుందని ఎవరికీ దొరకకుండా ఆశ్రమంలో తలుపులు వేసి పడుకోబెట్టడము చేసేవాడు. ఎప్పుడూ లేడిపిల్ల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. జపం మొదలు పెట్టేవాడు.   నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడి ఎక్కడికయినా వెళ్ళిపోతుందేమో ఏ పులో దానిని తినేస్తుందేమోనని దానిని చూసుకుంటూ ఉండేవాడు. రానురాను ఆయన దేనికోసం తపస్సుకు వచ్చాడో అది మరచిపోయి లేడిపిల్లను సాకడములో పడిపోయాడు.

భరతునికి అంత్యకాలం సమీపించింది. ప్రాణం పోతున్నది. మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను. నా లేడి ఏమయిపోతుందోనని ఆ లేడివంక చూస్తూ కన్నులనీరు పెట్టుకుని లేడినే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు. ఈశ్వరుడికి రాగద్వేషములు ఉండవు. ఆఖరి స్మరణ లేడిమీద ఉండిపోయింది  లేడిగా పునర్జన్మను ఇచ్చారు. ‘అయ్యో! నేను లేడిని పట్టుకోవడం వలన కదా నాకీ సంగం వచ్చింది. అసలు నేను ఎవరినీ ముట్టుకోను’ అని వ్రతం పెట్టుకున్నాడు. పచ్చగడ్డి తింటే దానిమీద వున్న క్రిములు చచ్చిపోతాయని ఆ లేడి (భరతుడు) ఎండుగడ్డిని మాత్రమే తినేది. అంత విచిత్రమయిన వ్రతం పెట్టుకుని పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విడిచాడో ఆ పులహాశ్రమమునకు వచ్చాడు. ఆ లేడి లోపల ఎప్పుడూ నారాయణ స్మరణము చేసుకుంటూ అలా ఎండుటాకులు ఎండుగడ్డి తింటూ జీవితమును గడిపి అంత్యమునందు భగవంతుడినే స్మరిస్తూ శరీరము విడిచిపెట్టింది. మోక్షం పొందడానికి మరల మనుష్య శరీరములోకి రావాలి. ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు.



భరతుడు ఈసారి అంగీరసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు. ఆయన పుట్టిన తరువాత కొంతకాలమునకు ఉపనయనము చేశారు. తరువాత ఆయనకు మనస్సులో ఒక భావన ఉండిపోయింది. ‘అప్పుడు పులహాశ్రమానికి వెళ్లాను. లేడిమీద భ్రాంతి పెట్టుకుని లేడిని అయ్యాను. ఎలాగోలాగ కష్టపడి మనసులో భగవంతుడిని పెట్టుకుని లేడిని వదిలి ఇపుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను. ఇప్పుడు కానీ నేను గాయత్రిని చేయడం, ఈయన చెప్పిన మంత్రములన్నీ నేర్చుకుంటే నాకు వివాహం చేస్తానని నాకు పెళ్ళి చేసి నన్ను సంసారంలో పడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మరల భ్రష్టుడనయిపోయి మరల ఎటు జారిపోతానో! అందుకని నేనెవరో ఎవరికీ తెలియకుండా ఉంటాను. నేనొక వెర్రివాని వలె వుంటే నాకు పిల్ల నిచ్చేవాడెవడు ఉంటాడు?’ అని నిర్ణయించుకుని వెర్రివాడిలా అలా కూర్చుని ఉండేవాడు. ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు. తల్లి సహగమనం చేసింది. సవతి బిడ్డలయిన అన్నదమ్ములు 'వీడికేమి వచ్చు. వీడికి శాస్త్రం ఏమిటి! వీడిని గొడ్లశాల దగ్గర కూర్చోబెట్టండి. పొలానికి పంపించండి. ఆ పనులన్నీ చూస్తుంటాడు అని అతనిని ఒరేయ్ పేడ ఎత్తరా అనేవారు. ఎత్తేవాడు. పాసిపోయిన అన్నం పెడితే మారుమాట్లాడకుండా అదే తినేవాడు. ‘సర్వం బ్రహ్మమయం జగత్’ అని బ్రహ్మమునందు మనస్సు కుదుర్చుకుని ఉండిపోయాడు. ఒకరోజు అన్నదమ్ములు ‘నువ్వు పొలానికి వెళ్ళి పంటని కాపలా కాయమన్నారు. ఆయన పొలం వెళ్ళి మంచెను ఎక్కి వీరాసనం వేసుకుని కూర్చున్నాడు.

లోకమునందు కొంతమంది చిత్రవిచిత్రమయిన ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. పిల్లలు లేని ఒక వ్యక్తి కాళికా దేవికి మంచి అవయవ హీనత్వం లేని వ్యక్తిని బలి ఇస్తే పిల్లలు పుడతారు అనుకుని వీడెవడో బాగానే ఉన్నాడు. మాట కూడా మాట్లాడడం లేదు వీడిని తీసుకుపోదాం అని వెళ్ళి తాళ్ళు వేసి కడుతున్నారు. బ్రహ్మజ్ఞానుల జోలికి వెళితే లేనిపోని ప్రమాదములు వస్తాయి. చక్కగా కట్టించేసుకున్నాడు. పద అన్నారు. వెళ్ళిపోయాడు. ఆలయానికి తీసుకుని వెళ్ళారు. ఏదో పెట్టారు. తినేశాడు. తరువాత వంగు, నరికేస్తాము అన్నారు. వంగాడు. కత్తియందు బ్రహ్మము, నరికేసేవారియందు బ్రహ్మం. అంతటా బ్రహ్మమును చూసి తలవంచాడు. వెంటనే కాళికాదేవి విగ్రహములో నుంచి బయటకు వచ్చి ‘ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు. అంతటా ఈశ్వర దర్శనం చేస్తున్నవాడు. ఆయన మీదనా మీరు కత్తి ఎత్తుతారు అని కత్తి తీసి ఆ వచ్చినవారి శిరసులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది. ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేశాడు. బ్రహ్మమే అనుకుని ఒక నమస్కారం పెట్టుకుని మరల తిరిగి వచ్చేస్తున్నాడు. అలా వచ్చేస్తుంటే సింధుదేశపు రాజు రహూగణుడు (రాహుగణుడు) ఇక్షుమతీ నదీతీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర తపోపదేశం కోసమని వెళుతున్నాడు. బోయీలు పల్లకిని మోస్తున్నారు. ఒక బోయీకి అలసట వచ్చింది. వాడిని అక్కడ వదిలేశారు. నాలుగో బోయీ కోసం చూస్తుంటే ఈయన కనపడ్డాడు. మంచి దృఢకాయుడై ఉన్నాడు. ఈయనను తీసుకురండి పల్లకీ మోస్తాడు అన్నారు.

బాగా పొడుగయిన వాడు పల్లకీ పట్టుకుంటే ఒక ఇబ్బంది ఉంటుంది. ఈయన పల్లకీ మోస్తున్నాడు. అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనంద పడిపోవడములో ఒక్కొక్కసారి ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి అడుగులు తడబడేవి. ఎత్తు పల్లములకు లోనయి పల్లకీ లోపల కూర్చున్న రాజుగారి తల పల్లకి అంచుకు గట్టిగా తగిలేది. ఆయన రెండుమూడు మాటలు చూసి ‘ఎందుకురా అలా ఎగిరెగిరి పడుతున్నారు. ఒంటిమీద తెలివి ఉందా’ అని అడిగారు. వాళ్ళు ‘అయ్యా! మా తప్పు కాదు. కొత్త బోయీ సరిగా లేడు. వీడి ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నాడు’ అన్నారు. రాజుగారికి చాలా కోపం వచ్చి ఆ బోయీవంక చూసి పరిహాసమాడాడు. మోస్తున్న వాడు బ్రహ్మజ్ఞాని. అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసం ఆడడం. రాజుగారు పల్లకి తెర తప్పించి క్రిందికి చూసి ‘తిన్నగా నిందించకుండా పరిహాసపూర్వకమయిన నింద చేశాడు. అలా చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తాను అన్ని మాటలు అన్నాడు కాబట్టి జాగ్రత్తగా మోస్తాడని రాజు అనుకున్నాడు. ఈయన మరల బ్రహ్మమునందు రమించిపోతూ మళ్ళీ దూకాడు ఎందుకో మళ్ళీ రాజుగారి బుర్ర ఠంగుమని తగిలింది. అపుడు రాజు ‘ఒరేయ్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపడడము లేదు. నిన్ను రాజ దండనము చేత నా మార్గములోనికి తిప్పే అవసరము నాకు కనపడుతోంది. పలకవేమిటి?’ అన్నాడు. ఇప్పటివరకు పుట్టిన తరువాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. ‘రాజా, నువ్వు మాట్లాడింది నిజమే. నువ్వు ఎవరికి శిక్ష వేస్తావు? ఈ దేహమునకు శిక్ష వేస్తాను అంటున్నావు. ఈ దేహం నేను కాదు. నేను ఆత్మని ఉన్నవాడిని నేను. ఇది నీ మాయని నీ అజ్ఞానమును బయటపెడుతున్నది’ అన్నాడు.

ఈమాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. ‘ మోస్తున్న వాడెవడో సామాన్యుడు కాదు. ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు’ అని పల్లకి ఆపమని గభాలున క్రిందికి దూకి ఆయనవంక చూస్తే గుర్తుపట్టడానికి యజ్ఞోపవీతం ఒక్కటే కనపడింది. ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు. అయ్యా! నన్ను పరీక్ష చేయడానికి బహుశః కపిలుడే ఇలా వచ్చాడని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు? నిజం చెప్పండి. మీవంటి బ్రాహ్మణులు జోలికి నేను రాను. మీమాటలు నన్ను చాలా సంతోష పెట్టాయి. నాకొక్క మాట చెప్పండి. లేనిది ఎలా కనపడుతోంది? ’ అని క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళమీద పడ్డాడు రాజు. భరతుడు నవ్వి ‘రాజా! నువ్వు ఉపదేశం పొందడానికి అర్హత పొందావు. అందుకని చెపుతున్నాను. ‘నేను’ అనబడే పదార్థము ఈ కన్నుల చేత చూడలేనిది కాదు. ఈ కన్నులకు కనపడుతుంది. దీనిని తిరస్కరించక పోతే ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే. ఇంకా నీకు బోధ ఎందుకు? ఈ నేత్రానికి మూడిటి వలన అనేకము కనపడతాయి. అవి కాలము, బుద్ధి, నామములు. రూపము ఉంటే నామము ఉంటుంది. నామము ఉంటే రూపము ఉంటుంది. నామము రూపము రెండూ లేకపోయినట్లయితే మాయ పోయినట్లు అవుతుంది. రూపము చేత నామము మారదు. నామము రూపము చేత మారవలసిన అవసరం లేదు. ఈ రెండూ అశాశ్వతమే. నామము, రూపము రెండూ అబద్ధమే. నామ రూపములుగా కాలగతియందు బుద్ధిచేత తిరస్కరింపబడుతుంది. మాంస నేత్రముచేత మగ్నము చేయబడుతుంది. అది నీవు తెలుసుకుంటే నేను చెపుతాను. ఒక్కమాట ఆలోచించు. ఇది పృథివి. ఈ భూమిమీద నా చరణములు పృథివి. నా చరణముల మీద నా కాళ్ళు పృథివి. ఇవన్నీ పృథివీ వికారములే. ఈ మాత్రం వికారమునకు నీవు ఒక పేరు పెట్టుకున్నావు. ‘నేను మహారాజును – వాడు బోయీ’ అనుకుంటూ నన్ను నిందించి మాట్లాడుతున్నావు. నీవు మాట్లాడడానికి ఆధారమయిన ఆత్మ, నాలో వున్న ఆత్మ ఒక్కటే. రెండూ రెండు శరీరములను ధరించాయి. ఈ రెండూ నామరూపముల చేత గుర్తించ బడుతున్నాయి. ఇవి మాయ వీటికి అస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతం. రాజా నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలుసుకున్నట్లే. నీకు తత్త్వం అర్థం అయింది. సంసారం అనే అడవి దీనిని అర్థం కాకుండా చేస్తుంది. అక్కడ బంధుత్వములనే తోడేళ్ళు ఉంటాయి. అవి మేకలవెంట తరుముకు వచ్చినట్లు వస్తాయి. ప్రతివాని ఇంట్లో ఈగలు ఉంటాయి. పొమ్మంటే పోవు. వాటిని తోలుకు తిని బతుకుతూ ఉంటారు. అలాగే పిల్లలు భార్య వెంబడించి ఉండనే ఉంటారు. కామము పోయినట్లు ఉంటుంది. మళ్ళీ వచ్చి చేరుతుంది. రాజా వ్యవసాయం బాగా చెయ్యాలని ఆనుకున్న వాడు కలుపుమొక్కని కత్తిరిస్తే సరిపోదు. మళ్ళీ మొక్క పెరిగిపోతుంది. మొదటంట తీసి బయటపారేసి ఎండిపోయిన తరువాత తగులబెట్టెయ్యాలి. తరించాలనుకున్నవాడు కామమును ముందు గెలవాలి.

అలా గెలవలేకపోతే ఏమవుతుంది? అడవిలో వెళుతుండగా నిన్ను చూసి ఆరుగురు దొంగలు వెంట పడతారు. ఆ ఆరుగురు ఎక్కడో లేరు. ఇక్కడే ఉన్నారు. అయిదు ఇంద్రియములు, మనస్సు – ఈ ఆరుగురు లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా, ఇంత ధర్మం కలిగినా ఎత్తుకు పోతారు. నువ్వు పతితుడవయిపోయి పతనమయిపోయి మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండడం శరీరంలోకి వెడుతూ ఉండడం ఇది ‘నేను’ అనుకోవడము దీని అనుబంధములతో మగ్నం అయిపోవడం ఈశ్వరుడిని తెలుసుకోవడం. అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు. రాజా! ఏనాడు నీ జ్ఞాన నేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల పాదసేవ చేస్తావు. వారి పాదముల మీద పడతావు. బ్రహ్మ జ్ఞానమును పొందుతావు. భక్తితో ఉంటావు. కర్మా చరణమును చేసి వైరాగ్యమును పొందుతావు. అదే మనిషి పొందవలసిన స్థితి. అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెబితే రహూగణుడు విని వైరాగ్యమును పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతమును తెలుసుకున్నాడు భరతుడు మోక్షమును పొందాడు.

ఇలా ఎంతోమంది ఒక చిన్న పొరపాటుకి ఎన్నో జన్మలను ఎత్తవలసి ఉంటుంది. మనిషి సాధన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అరణ్యమునకు వెళితే మోక్షం వచ్చేస్తుందని అనుకోవడం చాలా అమాయకత్వం. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు. ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటకు వెళ్ళి ఋషభుడు మోక్షమును పొందాడు. ఇంట్లో ఉంటే నన్నేదో పట్టేసుకుందని భయపడిపోయి అరణ్యము వెళ్ళి మూడు జన్మలు ఎత్తి మోక్షం పొందాడు భరతుడు. పాడుచేసేది ఇల్లు కాదు. లోపల వున్న మనసు. అందుకే ఆధునిక కవి ఒకమాట అన్నారు.

'తలనీలాలు అస్తమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది? మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకు నిలయమయిన మనస్సును ప్రక్షాళన చేయాలి. నీ మనస్సే నీ ఉన్నతికి గాని, పతనమునకు గాని కారణము అవుతోంది అని ఒక అద్భుతమయిన విషయాన్ని నలుగురి యందు నాలుగు విషయములను ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమయిన ఘట్టమును గృహస్థాశ్రమంలో తరించడానికి మనకి ఉన్న అనుమానములను నివృత్తి చేస్తూ వ్యాసభగవానుడు ఇచ్చిన అమృతఫలములను పోతనగారు ఆంధ్రీకరించి మనలను ఉద్దరించారు.



షష్ఠ స్కంధము – అజామిళోపాఖ్యానం:

ఒకానొక సమయంలో కన్యాకుబ్జము అనబడే ఒక నగరం వుండేది. ఆ నగరంలో ఒక శ్రోత్రియుడయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనమును ఆచరించి వేదవేదాంగములను తాను పఠించి పదిమందికి వేదమును వివరణ చేస్తూ పదిమందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితమును గడపగలిగిన సమర్థుడు. యాదృచ్ఛికముగా ఆయనకు ఐశ్వర్యము సమకూరింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుని యందు రమించే స్థితిని కలిగి ఉన్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అజామీళుడు. ఆయనకు ఒక ఉత్తమమయిన సౌందర్యవతియైన కన్యను తెచ్చి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది? పుట్టినపుడు గతంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులమున జన్మించాడు. సత్కర్మ అంటే చేసిన పని. అజామీళునికి యజ్ఞోపవీతము ఉన్నది సంధ్యావందనం చేసిగాయత్రీమంత్రం జపించేవాడు. ఈవిధంగా అతడు జ్ఞానమును పొందినవాడు. శాంత లక్షణమును కలిగి ఉన్నాడు. బ్రాహ్మణునకు మొట్టమొదటి లక్షణము శాంతము.

దాంతుడై ఉన్నాడు. దాంతుడు మనసును గెలవడం. మనస్సు ఇంద్రియముల మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మనసును ఇంద్రియములను గెలిచాడు. ఇక్కడే ఒక విషయమును గుర్తుపెట్టుకోవాలి. ఒకరాజు ఒక రాజ్యమును గెలిస్తే ఆయన మరణించే వరకు ఆ రాజ్యం ఆయనదై ఉంటుందనే నమ్మకమేమీ ఉండదు. ఈయనకన్నా బలవంతుడయిన రాజు వచ్చి ఈయనను చంపి ఆ రాజ్యం ఆయన కొల్ల గొట్టవచ్చు. అలాగే ఇంద్రియములను గెలిచినా వాడు మరొక పదినిమిషములు గడిచిన తరువాత పతనమై క్రిందపడి పోవచ్చు. ఆయన మోక్షమును పొందితే ఆయన ఇంద్రియములను మనసును గెలిచినట్లు లెక్క. అవి ఏ క్షణంలో అయినా కాటు వేయడానికి నిరంతరము కాచుకుని ఉంటాయి. మంచి యౌవనమును పొందడానికి ముందు భార్యను చేపట్టక ముందు శాంతుడై, దాంతుడై ధర్మసంశీలుడై ఉన్నాడు.

శీలము అంటే స్వభావము. అజామీళుడు నిరంతరము తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించ గలిగినవాడు. తన ధర్మమును తాను నెరవేర్చిన వాడు. అంతమాత్రం చేత జ్ఞాని అయ్యాడని అనడానికి లేదు. తాను చదువుకున్నది అనుష్ఠాన పర్యంతము తీసుకువచ్చాడు. ఎన్నోమంత్రముల సిద్ధిని పొందాడు. అతని శరీరము మంత్రపూతమయింది. అంతగా దేవతానుగ్రహమును పొందాడు.

అజామీళుడు సత్యభాషణ నియమమును పెట్టుకున్నాడు. ధర్మమును వదలలేదు. నిత్య నైమిత్తిక కర్మలను వదిలి పెట్టలేదు. ఈవిధంగా అజామీళుడు రాశీభూతమయిన బ్రాహ్మణ తేజస్సు.

భగవంతుని గొప్పతనం గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీళుడి యౌవనం గురించి పోతన గారు అన్ని పద్యములు వ్రాశారు. కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేనిని అసలు పెట్టుకోవాలి. దేనిని వదిలిపెట్టాలి అని తెలుసుకో గలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యౌవనము మాత్రమే. ఈ యౌవనమును ప్రధానముగా రెండు భ్రంశము చేస్తాయి. ఒకటి అర్థార్జన. అర్థ సంపాదనకు అనువుగా అధికారులను పొగడుట యందు నిమగ్నమయిన వాడు, బెల్లపు పరమాన్నమయినా అదే రుచి, పంచదార పరమాన్నమయినా అదే రుచి – ఒకే పాయస పాత్రను తీసుకువచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకు తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక కామినీ పిశాచము పట్టుకుని తన ధర్మపత్ని జంట ఉండగా ఇతర స్త్రీలయందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించి పోతున్నాడు. ఈ రెండింటి చేత యౌవనము నశించిపోతున్నది. అలా నశించిపోవడం అత్యంత ప్రమాదకరము.

అజామీళుడికి యౌవనం అంకురించింది. మానవుడు అయిదు ఇంద్రియములతో భోగములను అనుభవించవచ్చు. ఈశ్వరుడిని చేరుకోవచ్చు. కన్ను తప్పుగా భ్రమను కల్పిస్తే దీపపుపురుగు నశించి పోతుంది. దీపపు పురుగు దీపమును చూసి తినే వస్తువు అనుకుని దీపం మీదకి వెళుతుంది. రెక్కలు కాలి క్రింద పడిపోయి మరణిస్తుంది. దాని దృష్టికి దీపము ఆకర్షించేదానిలా ప్రవర్తిస్తుంది. మా ఇంటి దీపమే కదా అని ముసలాయన దీపమును ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్లు యౌవనంలో ఉన్న పిల్లవాడిని పొగిడి పాడు చేయకూడదు. కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించి పోయింది.

పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటకాడు రెండు మూడురోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తానొక చెట్టు మీద కూర్చుని పాట పాడతాడు. ఎక్కడో గడ్డి తింటున్న లేడి ఆపాట విని దానికోసం పరుగెత్తుకుంటూ వచ్చి వేటగాని వలలో పడిపోతుంది. వెంటనే వేటగాడు దానిని చంపేస్తాడు. చెవి వలన లేడి మరణిస్తోంది.

చర్మమునకు కండూతి’ అనగా దురద ఉంటుంది. ఈ దురద ఏనుగుకి ఉంటుంది ఈ కండూతి దోషం. ఏనుగులను పట్టుకునే వారు గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలయిన పరికరములు అక్కడ పెడితే ఏనుగు అక్కడకు వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఆ కర్రలకు తగులుతుంది. ఆ ఊగుడికి పుచ్చు కర్రలు విరిగిపోయి గోతిలో పడుతుంది. అలా ఏనుగు దొరికిపోతుంది. ఈవిధంగా స్పర్శేంద్రియ లౌల్యం చేత ఏనుగు నశించి పోతున్నది.

నాల్గవది రసనేంద్రియము – నాలుక. దీనివలన పాడయిపోయేది చేప. ఈశ్వరుడు చేపలకు మొప్పలతో ప్రాణ వాయువును తీసుకుని బ్రతకగల శక్తిని ఇచ్చాడు. కానీ దానికి రుచులు అంటే ఎంత ఇష్టమో. ఎరను తిందామని ఉచ్చులో చిక్కుకుని ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. ఈవిధంగా రసనేంద్రియం చేత చేప నశించి పోతోంది.

ఇక వాసన. పద్మమునందు సుగంధము ఉంటుంది. ఆ సుగంధమును అనుభవించడం కోసం ఎక్కడినుంచో వస్తుంది సీతాకోక చిలుక. అది పువ్వులలో మకరందమును పీల్చి మకరందం అయిపోయినా సరే కాసేపు అక్కడే పడుకుంటుంది. దానికి ఆ వాసన మరిగి మత్తెక్కుతుంది. ఒక్కొక్క సారి చీకటిపడి పువ్వు ముకుళించుకు పోతుంది. అది పువ్వులో చిక్కుకు పోతుంది. ఆ సమయమునకు నీళ్ళు త్రాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్ళు త్రాగి వెళ్ళిపోతూ ఈ పద్మములను తొండముతో పీకివేసి నేలమీద పారవేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ ఉన్న సీతాకోకచిలుక ఏనుగు పాదము క్రింద పడి మరణిస్తుంది. వాసన మరిగి సీతాకోక చిలుక నశించింది.

ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించి పోతోంది. ఈ ఇంద్రియములలో ఏ ఇంద్రియమయినా మిమ్మల్ని కరచి వేయవచ్చు. ఇంద్రియములను త్రిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవరు ఉపయోగించడో వాడు నశించిపోతాడు. అజామీళుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. భాగవతమును అందరూ వినవచ్చు. యౌవనంలో ఉన్నవాడు విన్నట్లయితే జీవితమును సార్థకత చేసుకోగలడు. ఆయనను తండ్రిగారు ఒకరోజు పిలిచి రేపటి పూజకు దళములు, దర్భలు పువ్వులు తీసుకు రావలసినదని చెప్పారు. తండ్రి మాటప్రకారం అడవికి వెళ్ళి పువ్వులు, సమిధలు కోసి సంతోషముగా ఇంటివైపుకి వచ్చేస్తున్నాడు. అంతలో అతనికి ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. దానిని ముందు చెవి గ్రహించింది. అది వినవలసిన ధ్వని కాదని ఆయన వెళ్ళిపోయి ఉంటే వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది. పొదవైపు చూశాడు. కల్లుకుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమయిన జన్మను పొందిన ఒక స్త్రీ, ఆ కల్లును తాను విశేషముగా సేవించి శారీరకమయిన తుచ్ఛమయిన కామమునందు విశేషమయిన ప్రవేశము అనురక్తయిన ఒక స్త్రీ కల్లు సేవించిన పురుషుడు శృంగార క్రీడయందు విశేషమయిన అభినివేశము ఉన్న వాడితో ఆనందముగా పునః పునః రతిక్రీడ జరుపుతున్నది.

అజామీళుడు ఆ సన్నివేశము చూశాడు. శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. బ్రహ్మమని ఆయన వెళ్ళిపోయాడు. భాగవతం చెప్పగలిగాడు. అజామీళుడి మనస్సును ఆ దృశ్యము ఆక్రమించింది. కర్మేంద్రియ సంఘాతము ఆయనను నిలబెట్టేసింది. చూస్తున్న సన్నివేశం మనస్సులో ముద్రపడడం ప్రారంభం అయింది. అలా నిలబడి తమకముతో ఆ సన్నివేశమును వీక్షించాడు. ఇన్నాళ్ళు వశములో ఉన్న ఇంద్రియ లౌల్యము గెలవడం ప్రారంభం అయింది. వారిద్దరూ వెళ్ళిపోయిన తరువాత తాను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి దర్భలు తండ్రికి ఇచ్చి అసురసంధ్య వేళ సంధ్యావందనమునకు కూర్చున్నాడు. మనస్సులో కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము కాదు. పొదలమాటున తన కన్ను దేనిమీద నిలబడిందో అది కనపడుతోంది. ఇంట ధర్మపత్నియై సుగుణాల రాశియై సౌందర్యవతియైన భార్య ఉన్నది. ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించింది. ఆచార్య వాక్కులు గుర్తు తెచ్చుకుని అధిగమించాలని ప్రయత్నం చేశాడు. అతడు చూసిన సన్నివేశము వీటన్నింటిని తొలగదోసినది. ఒకనాటి రాత్రి తన భార్యకు తల్లికి, తండ్రికి తెలియకుండా ఆహీనకుల సంజాత అయిన ఆ స్త్రీని చేరాడు. సంధ్యావందన భ్రష్టుడై రాత్రింబవళ్ళు అక్కడే ఉన్నాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు. భార్యను విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వారి ధనమును దోచుకున్నాడు. కులట స్త్రీయందు తొమ్మిదిమంది బిడ్డలను కన్నాడు.

అతడు చేసిన ఒకే ఒక మంచి పని – ఆవిడ కడుపున పుట్టిన ఆఖరు బిడ్డడికి ‘నారాయణ’ అని పేరు పెట్టడము. ఆఖరి పిల్లాడు అవడము వలన వాడిమీద మమకారము ఉండిపోయి వాడిని నారాయణ నారాయణ అంటూ తరచూ పిలుస్తూ ఉండేవాడు. ఆవిడ పిల్లల పోషణార్థమై డబ్బు సంపాదించుకు రమ్మనేది. అందుకుగాను దొంగతనములు చేయడం మొదలు పెట్టాడు. ఎంతో వేదము చదువుకుని, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినవాడు, శాంతు డై, దాంతుడై సకల వేదములను చదివి, మంత్రసిద్ధులను పొందిన అజామీళుడు ఈవేళ ఆరితేరిన దొంగయై అంతటి దొంగ లేడని అనిపించుకున్నాడు.

ఇంత పతనము ఒక్క ఇంద్రియలౌల్యం వల్ల వచ్చింది. మనిషి మనిషిగా బ్రతకడం, ఈశ్వరుని చేరుకోవడం ఇంద్రియములను గెలవడం ఎంతో కష్టము.




ఇంద్రియములను గెలవడం చాలా కష్టం. ఇంద్రియములను తొక్కిపట్టి ఉంచితే అవి వాటికి అవకాశం వచ్చినప్పుడు కాటువేసి మనిషిని పతనం చేస్తాయి. ఈవిధంగా అజామీళుడు చిట్టచివరకు దొంగ అయ్యాడు. అతను గ్రహించుకోలేనిది ఒకటి ఉన్నది. దాని పేరు కాలము. అది ఎవ్వరి గురించి ఆగదు. ఎప్పుడో ఒకరోజు మహా మరణకాలము వస్తుంది. ఆ మృత్యువు కబళించక ముందే ఈశ్వరనామమును చెప్పుకోవాలి. అజామీళుడు భోగములు, సుఖములు శాశ్వతం అనుకున్నాడు. అతనిని తీసుకువెళ్ళి పోయే సమయం వచ్చేసింది. భటులు భయంకరమయిన రౌద్ర రూపములతో వచ్చారు.  అంతా వచ్చి ఏడుపులు మొదలుపెడతారు. ఆ సమయంలో రక్షించేది ఏదయినా ఉన్నది అంటే అది నీవు చేసుకున్న సాధన ఒక్కటే! స్వామి నామమును ఉచ్ఛరించగలగాలి. శరీరమును విడిచి పెట్టేటప్పుడు మురికిలో పడిన ఉత్తరీయము తీసి విసిరి పారేసినట్లు శరీరమును వదిలి ఈశ్వర పాదములయందు ప్రవేశించ గల ధృతిని పెంచుకో' అంటారు. అందుకు సాధన అవసరం. యమదూతలు వచ్చి అజామీళుడి ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళను చూసేసరికి ఈయనకు విపరీతమైన భయం వేసింది. అంత భయంలో ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నముగా నారాయణా! అని తన కొడుకును తలచుకుంటూ గొణిగాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇంతవరకు ఎంత భయమును పొందాడో ఆ భయమును మాయం చేయగలిగిన విచిత్ర విషయమును చూశాడు.

నలుగురు దివ్య తేజోవంతులయిన మహాపురుషులు వచ్చి యమధర్మరాజు భటులతో ఆ పాశములను తీసివేయమని చెప్పారు. యమధర్మరాజు భటులు ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నించారు. ‘మేము ఎవరిమో చెప్తాము. ముందు ఆ పాశములను తీసివెయ్యండి’ అన్నారు. యమదూతలు తమ పాశములను విడిపించారు. అజామీళుడికి పూర్వపు ఓపిక వచ్చింది. వాళ్ళ మాటలు బయట వాళ్ళకు వినబడడం లేదు. కానీ అజామీళుడు మాత్రం వాళ్ళ మాటలను వింటున్నాడు. ఆవచ్చిన వాళ్ళు ఎవరా? అని అజామీళుడు విష్ణుదూతల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. యమదూతలు 'వీడెవడో తెలుసా! పరమ దుర్మార్గుడు. ఇటువంటి వాడిని మేము ఎందుకు విడిచిపెట్టాలి? మీరు ఎందుకు వదలమంటున్నారు? మీరు ఎందుకు వచ్చారు? అసలు మీరు ఎవరు? అని అడిగారు.

విష్ణుదూతలు 'మమ్ములను విష్ణు పార్షదులు అంటారు. మేము శ్రీవైకుంఠమునుండి వచ్చాము. అజామీళుడిని విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు. అందుకని వచ్చాము’ అన్నారు.

యమభటులు ‘ఇది ధర్మమా? ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతాము?’ అని అడిగితే విష్ణుదూతలు ‘ ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరుగా గలిగిన యమధర్మరాజు గారిని అడగండి. మీరు ఇతడు ఈ జన్మలో చేసిన పాపముల గురించి మాట్లాడుతున్నారు. మేము ఇతని కోటిజన్మల పాపముల గురించి మాట్లాడుతున్నాము. అంత్యమునందు శరీరమునందు ప్రాణోత్క్రమణం జరుగుతున్న సమయములో ఇతడు ఈశ్వరుని నామమును పలికాడు. అది అమృత భాండము. శ్రీహరి నామమును పలికిన కారణం చేత కోటిజన్మల పాపరాశి ధ్వంసము అయిపోయింది. ఇతనిని మీరు తీసుకుని వెళ్ళడానికి అర్హత లేదు’ అన్నారు. యమదూతలు ‘అయితే వీడు చేసిన పాపములు అన్నీ ఏమయ్యాయి?' అని అడిగారు. విష్ణుదూతలు నీవు మాతో రావచ్చు అని అజామీళుడిని వైకుంఠమునకు తీసుకు వెళ్ళిపోయారు. ఆయన శ్రీమన్నారాయణునిలో ఐక్యం అయిపోయాడు. భాగవతుల తోడి అనుబంధమే మనలను రక్షిస్తుంది.

వెనుదిరిగి వెళ్ళిపోయిన యమదూతలు యమధర్మరాజుగారి వద్దకు వెళ్ళి 'మాకో అనుమానం. ఇన్నాళ్ళ నుండి నీవు తీసుకురమ్మన్న వాళ్ళను మేము వెళ్ళి తీసుకు వచ్చేవాళ్ళం. ఈవేళ మేము వెళ్లేసరికి అక్కడికి నలుగురు వచ్చి అజామీళుడిని వదిలిపెట్టమన్నారు. తెలిసో తెలియకో భగవంతుని నామం చెప్పడం వలన అతని పాపములు పోయాయి అంటున్నారు. పాపములు అలా నశించి పోతాయా? మా సందేహములను నివృత్తి చేయవలసింది' అని కోరారు. యమధర్మరాజు తన భటులను అందరినీ పిలిపించి ఒక సమావేశమును ఏర్పాటు చేసి 'జీవులు తమ జీవితములయందు అనేక పాపకర్మలను చేసి ఉంటారు. చేసినపాపం నశించడం మాట ఎలా ఉన్నా చేసిన పాపము చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉన్నది. దానికి ప్రాయశ్చిత్తకర్మ అంటారు. ప్రాయశ్చిత్తము చేత వారు చేసిన పాపముల వ్యగ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కర్మను భక్తివైపుకి తిప్పుకోవాలి. భక్తికి బదులు వెర్రి అనుమానములు ప్రారంభమయిపోకూడదు. కలలో ఇందిరారమణుని పాదములు కనపడని వాడు ఎవడయినా ఉంటే వాడిని మీరు తీసుకువచ్చేయవచ్చు. అర్హతను మరచి పెద్దలు వ్రాసిన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని, యాత్రలకు వెళ్ళి గుడిని సమీపించి గుడిలోని దేవుని దర్శించని వాళ్ళను, దేవుని ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవం చూడడానికి అడుగుతీసి అడుగు పెట్టని దుర్మార్గమయిన పాదములు ఉన్నవారిని, మహాభాగవతులయిన వారి పదముల అడుగున ఉన్న ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నిలబడడమేమిటని ధ్వజ స్తంభములా నిలబడిపోయిన దౌర్భాగ్యులను తీసుకు వచ్చేయండి. నే చెప్పిన వారినే కాదు. ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ పుడుతున్నారో వారికి సంబంధించిన వారిని నాలుగు తరముల వరకు ఏరి అవతల పారెయ్యండి. అలాంటి వారి దగ్గరకు చేరి దిక్కుమాలిన మాటలు మాట్లాడేవారిని కూడా లాగి అవతల పారవేయవచ్చు.

నా స్వామి చరణములు నాకు చాలని స్వామి పాదములను గట్టిగా పట్టుకొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదములు పట్టుకుంటున్నారో కష్టంలో సుఖంలో ఆయన పేరు చెబుతుంటారో అటువంటి వారిని, ఈశ్వరుని నామం చెప్పిన వారిని, వారికి సంబంధించిన నాలుగు తరముల వాళ్ళని, వారితో కలిసివుండే వాళ్ళని తొందరపడి తీసుకురావద్దు. బాగా పరిశీలించండి. సాధ్యమైనంత తేలికగా విడిపించండి. ఈలోగా అక్కడికి విష్ణుదూతలు కనుక వచ్చినట్లయితే మీరు వచ్చేయండి. వాళ్ళ జోలికి వెళ్ళవద్దు’ అని తీర్పు చెప్పాడు. దీనిని బట్టి మనకు అన్నిటికన్నా ఈశ్వరనామము గొప్పదని తెలుస్తోంది. నామమును పట్టుకోవడం ముందు నేర్చుకోవాలన్న విశిష్టమయిన విషయమును చెప్పినది ఈ ఆఖ్యానము. ‘నిరంతరము నా నాలుకమీద ఈశ్వరనామము నర్తన చేయగలిగిన అదృష్టమును ఈశ్వరా! నిర్హేతుకముగా కటాక్షించు’ అన్నారు రామదాసుగారు. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం!! అని మార్కండేయుడు ఈశ్వరనామమును చెపుతుంటే స్వామి యమధర్మరాజు గారిని తన్నాడు.

వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం

భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణమ్

కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే

మచ్చేతో మణి పాదుకా విహరణం శంభో! సదాఽo గీ కురు!!

అంటూ శంకరభగవత్పాదులు శివానందలహరిలో పొంగిపోతారు. అటువంటి వైభవము కలిగిన నామము ఏది ఉన్నదో ఆ నామము వ్యాసభగవానుడి అనుగ్రహముగా, పోతనామాత్యుల అనుగ్రహముగా, మన గురువుల అనుగ్రహముగా, శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహముగా, నిరంతరము మన నాలుకయందు నర్తించు భాగ్యము మనకు కలుగుగాక! అని ఈశ్వరుడు మనలను కటాక్షించుగాక!

ఈ అజామిళోపాఖ్యానం ఎవరు చదివిన వారికి, విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరించిన వాళ్లకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదని వ్యాసమహర్షి అభయం ఇచ్చారు. అదీ దాని ఫలశ్రుతి!





కామెంట్‌లు లేవు: