11, జూన్ 2024, మంగళవారం

ఆకులు చెప్పిన పాఠాలు."*

 *"ఆకులు చెప్పిన పాఠాలు."*


*మామిడి ఆకు* - "ప్రతీ శుభ కార్యంలోనూ నేను తప్పని సరి. నేను లేనిదే ఏ శుభకార్యం జరుగదు" అంది గర్వముగా. దేవుడు చిన్నగా నవ్వాడు. తలుపు గుమ్మానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు.


*కరివేపాకు* - "వంటలలో నేను లేనిదే రుచి లేదు" అంది గర్వముగా. తినేటప్పుడు కరివేపాకుని ఏరి పార వేసే ఆలోచనను మనిషికి కలిగించాడు.


*అరటి ఆకు* - "ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు. నేను మీకంటే గొప్ప" అని అన్నది. దేవుడు ఆలోచించాడు. అరటి ఆకు తిన్న తరువాత దాని బ్రతుకు చెత్తకుప్పలో పడేటట్లు చేశాడు.


*తమలపాకు* -"నేను శుభ కార్యాలకే కాదు, నన్ను తాంబూలం గా వేసుకొంటే నోరు ఎర్రగా పండుతుంది. నాకు సాటి ఎవరూ లేరు" అన్నది. దేవుడు దాని పొగరు అణచాలను కొన్నాడు. తమలపాకు నమిలి రసం మ్రింగి, తరువాత బయటకు ఉమ్మేసేలా చేసాడు.


*తులసి ఆకు:* "నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం" అంది వినయంగా. దేవుడు సంతోషించాడు. తన మెడలో హారంగా, తన పాదాల చెంత తులసీదళంలా భక్తులు సేవించే తీర్ధంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు.


*నీతి* - "నేను, నా వల్లే," అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు. వినయంగా వున్నవారు ఉన్నత స్థానం పొందుతారు.


(సేకరణ)

కామెంట్‌లు లేవు: