11, జూన్ 2024, మంగళవారం

హనుమజ్జయంతి ప్రత్యేకం - 11/11

 ॐ         హనుమజ్జయంతి ప్రత్యేకం -  11/11

       (ఈ నెల 1వ తేదీ హనుమజ్జయంతి) 


XI. హనుమ - శ్రీరాముడు 


1.మొదటిసారి వచ్చి చూసి,  హనుమ పలికిన మాటలు విన్న శ్రీరాముని వ్యాఖ్య : 


    ఇట్టి గుణగణములు గల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద ఉంటారో, 

    ఆ రాజు కార్యములు ఆ దూతలచే నిర్వర్తించబడి సిద్ధిస్తాయి. 


ఏవం గుణగణైర్యుక్తా 

యస్య స్యుః కార్యసాధకాః I 

తస్య సిధ్యన్తి సర్వార్థా 

దూతవాక్యప్రచోదితాః ॥ 

             - కిష్కింధ 3/35 


2.సీతాన్వేషణకై వానర భల్లూక  సైన్యం నలుదిశలా పంపబడుతున్నప్పుడు,  హనుమగూర్చి శ్రీరాముడు : 


    మహాతేజశ్శాలియైన ఆ శ్రీరాముడు, 

    ఉద్యమము చేయడంలో చాల సమర్థుడైన ఆ హనుమంతుని చూచి, 

    ఇంద్రియములు మనస్సు ఆనందంతో నిండగా, 

    తన పని పూర్తి అయినట్లు భావించాడు. 

    పిమ్మట ఆ రాముడు సంతోషిస్తూ, 

    సీతకు ఆనవాలు కోసమై,    

    తన నామధేయం చెక్కిన ఉంగరాన్ని హనుమంతునకు ఇచ్చాడు.


తం సమీక్ష్య మహాతేజా 

వ్యవసాయోత్తరం హరిమ్ I 

కృతార్థ ఇవ సంవృత్తః 

ప్రహృష్టేన్ద్రియమానసః ৷৷ 

దదౌ తస్య తతః ప్రీత| స్వనామాఙ్కోపశోభితమ్ I 

అఙ్గులీయమభిజ్ఞానం 

రాజపుత్ర్యాః పరన్తపః ৷৷ 

          - కిష్కింధ 44/11,12 


3.సీతామాత జాడ తెలుసుకొనివచ్చిన హనుమ గూర్చి శ్రీరాముని ప్రశంస, సత్కారం : 


   "కార్యము చేయుటకై నియుక్తుడైన హనుమంతుడు ఆ పనిని సాధించినాడు. తనను ఏ మాత్రము తేలికపరచుకోలేదు. సుగ్రీవునకు సంతోషం కలిగించాడు. 

    హనుమంతుడు ఇప్పుడు సీతను చూచివచ్చి, నన్నూ రఘువంశమునూ, మహాబలుడైన లక్ష్మణునీ ధర్మానుసారము రక్షించినాడు. 

    కానీ నేను, ఈ ప్రియవార్తను చెప్పిన ఇతనికి తగు ప్రాయమును చేయజాలకున్నాను. 

    అదియే దీనుడనైన నా మనస్సును చాలా పీడిస్తోంది. 

    అట్టి మహాత్ముడైన హనుమంతునికి, ఈ సమయమున నేను, 

    నా సర్వస్వమైన ఆలింగనమును ఇస్తున్నాను."  


తన్నియోగే నియుక్తేన 

కృతం కృత్యం హనూమతా I 

న చాత్మా లఘుతాం నీతః 

సుగ్రీవశ్చాపి తోషితః ।। 

అహం చ రఘువంశశ్చ 

లక్ష్మణశ్చ మహాబలః I 

వైదేహ్యా దర్శనేనాద్య 

ధర్మతః పరిరక్షితాః ।। 

ఇదం తు మమ దీనస్య 

మనో భూయః ప్రకర్షతి I

యదిహాస్య ప్రియాఖ్యాతుః 

న కుర్మి సదృశం ప్రియమ్ ।।         

ఏష సర్వస్వభూతే 

పరిష్వఙ్గో హనూమతః I 

మయా కాలమిమం ప్రాప్య  

దత్తస్తస్య మహాత్మనః ।।

                   - యుద్ధ 1/10,11,12,13 


    హనుమని ప్రార్థిస్తూ, హనుమ చూపిన శ్రీరామ సేవా మార్గంలో పయనించి, స్వామి అనుగ్రహం పొందుదాం. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్                    


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

కామెంట్‌లు లేవు: