11, జూన్ 2024, మంగళవారం

భగవంతుడి భాష*

 2909A-1.0404c-6.110624-5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           *భగవంతుడి భాష*

                ➖➖➖✍️


*మనసులోని ఆలోచనల్ని వ్యక్తం చేయడానికి మనం భాషను సముచిత మైన సాధనంగా వినియోగించు కుంటున్నాం. భాషాపటిమ లేనప్పుడు అభినయం, హావభావాల ద్వారా వ్యక్తంచేస్తున్నాం. మరి భగవంతుడికి కూడా భాషేదైనా ఉన్నదా? ఆ భాష ఏమిటి, ఎలా ఉంటుంది, ఆ భాష ద్వారా ఏం చెబుతున్నాడు, మనం దాన్ని ఎలా గ్రహిస్తున్నాం? ఇలాంటి సందేహాలు కలగడానికి ఆస్కారముంది.*


*నశ్వరమైన ఈ శరీరానికే భాష ఉన్నప్పుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైన పరమాత్మకు మాత్రం భాషెందుకుండదు? ఉంది. భాషంటే మాటలా, వాక్యాలా, శబ్దాలా? మౌనం కూడా భాషేనా? రమణమహర్షి మౌని. ఆయన భాష మౌనమే. ఆయన బోధలూ మౌనంద్వారానే భక్తులకు సంప్రాప్తించాయి. దక్షిణామూర్తి మౌనసాధనం ద్వారానే జ్ఞానబోధ చేశాడు. అలాగే మహానుభావులెందరో మౌనంగా ఉంటూనే తత్వబోధ చేశారు. భగవంతుడూ మౌనంగానే ప్రకృతి ద్వారా మనకు జ్ఞానం ప్రసాదించాడు.*


*నదులు, పర్వతాలు, వృక్షాలు, కొమ్మలు, కాయలు, పూలు, పండ్లు, మేఘాలు, గాలి, నేల- వీటన్నింటి ద్వారా పరమేశ్వరుడు మనకెన్నో అమూల్య సందేశాలు అందజేస్తున్నాడు. జ్ఞానసంపదను పంచి పెడుతున్నాడు.*


*ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతి వస్తువూ మనకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని అందజేస్తోంది. సూర్యుడు వెలుగునిస్తున్నాడు. చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు. పూలు పరిమళాలిస్తున్నాయి. నదులు నీటినిస్తున్నాయి. మబ్బులు వర్షిస్తున్నాయి. పక్షులు కిలకిలారావాలతో ప్రకృతిని పులకింపజేస్తున్నాయి. పొలాలు సస్యాలనిస్తున్నాయి. గోవులు క్షీరధారలిస్తున్నాయి. గాలి శ్వాస ద్వారా సకల ప్రాణి కోటికీ మనుగడనిస్తోంది. సృష్టిచక్ర నిర్వహణకు ఒక్కో వస్తువుకు, ఒక్కో రకమైన సామర్థ్యం, శక్తీ ఏర్పాటు చేశాడు భగవంతుడు.*


*అన్నీ మౌనంగా జరిగిపోతున్నా అవన్నీ భగవంతుడి భాషలే. వాటిలో వాక్యాలు, మాటలు ఉండవు. అన్నీ వేటికవే పరమాత్మ సంకేతాలు అందినట్టుగా, తమ తమ విధులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తున్నాయి. అనంతకోటి నామధేయాలున్నట్టే ఆయనకు అనంతకోటి భాషలూ ఉన్నాయి. ఎవరికి ఏ భాష ద్వారా కర్తవ్యబోధ చేయాలో అలా చేస్తున్నాడు. అలాగే మనకు తన మౌన భాష ద్వారా అనేక విధాలైన బోధలు చేస్తున్నాడు. వాటిని గ్రహించటం, ఆచరించటం- మన సుకృతం, వివేకం, ఆసక్తి మీద ఆధారపడ్డాయి.*


*వేదాలు, శాస్త్రపురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీతాది పవిత్రగ్రంథాల ద్వారా మనకెన్నో ధార్మిక విషయాలు, నీతి సిద్ధాంతాలు నిర్దేశితమయ్యాయి.*


*తపస్సంపన్నులు, మునులు, రుషులు, బుధులు, వేదజ్ఞులు, పౌరాణికులు, పండిత శ్రేణులు, ప్రవక్తలు మనకు పరమాత్మ భాష ద్వారానే రసానంద సిద్ధిని కలగజేస్తున్నారు. మన సుఖ జీవనయాత్రకు ఉపయోగపడుతున్న విషయ పరిజ్ఞానమంతా పరోక్షంగా ఆయన భాషా వ్యవహారమే. ఒక్క మనిషి తప్ప ప్రకృతిలోని ప్రత్యణువూ నిస్వార్థంగా సేవచేస్తోంది. ఆ సేవలు, సుఖాలు పొందిన మానవుడు మాత్రం కృతజ్ఞతాహీనుడై ప్రవర్తిస్తున్నాడు. అందుకే ప్రకృతినుంచి పరమాత్మ భాషను, భావాన్నీ, సందేశాన్నీ గ్రహించి, తదనుగుణంగా నడచుకోవాల్సి ఉంది.*


*అనంతమైన భగవంతుడి భాషల్లో కొన్ని మనకు బాగా తెలిసినవే. అవే సత్యం, అహింస, ప్రేమ, పరోపకారం, భూతదయ, సచ్ఛీలం, క్రమశిక్షణ, సమయపాలన, నిస్వార్థబుద్ధి, త్యాగశీలత, ధర్మం, దానం, నమ్రత, వాత్సల్యం, విధినిర్వహణ... ఇలాంటివి. ఇవన్నీ మనకు ఎంత బాగా తెలుసో, అంత బాగా మనసుకు దూరంగా ఉంచుతాం. అందుకే భగవంతుడి భాష అవగతం కాదు. ఆ సద్గుణాలన్నింటినీ మహానుభావులెందరో ఎప్పుడో సుగ్రాహ్యం చేసుకున్నారు. ఆచరించి చూపారు.*


*కనుక, వారందరికీ భగవద్భాష సుబోధకమే అయింది. ప్రధానంగా గ్రహించవలసింది- భక్తి ఒక్కటే మనల్ని ఎక్కువ దూరం తీసుకెళ్లలేదు. ఆర్తుల సేవ దానికి తోడైతేనే ఆధ్యాత్మికంగా ముందుకు పురోగమించగలం.*


 *అప్పుడే మనం భగవద్భాషను సంపూర్ణంగా సాకల్యంగా అవగాహన చేసుకున్నవాళ్లమవుతాం. సద్గురువు మార్గప్రదర్శనంలో సముచితమైన శిక్షణ పొంది, సాధనచేసి సార్థక జీవన ప్రస్థానం సాగిస్తే భగవంతుడి భాషలన్నీ మనకు అర్థమైనట్టే.*


*జీవించి, వికసించి, తత్వాన్ని తెలుసుకొని, ముక్తిని పొందడమే జీవితం. 'నేను' అనే మాటకు అర్థం తెలుసుకో గలిగితే, ఆ మాటను హృదయం నుంచి తొలగించగలిగితే భగవద్భాషా పరిజ్ఞానం పొందగలిగినట్టే! అదే మనం సాధించగలిగే మహత్కార్యం, మహావిజయం. అందుకే వీలైన్నన్ని భగవంతుడి భాషల్ని నేర్చుకునేందుకు ప్రయత్నిద్దాం.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774.

లింక్ పంపుతాము.దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు🙏

కామెంట్‌లు లేవు: