15, మే 2024, బుధవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 15.5.2024 బుధవారం


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*371వ నామ మంత్రము* 


*ఓం వైఖరీరూపాయై నమః*


విశేషముగా కఠినమైన రూపము గలిగిన పరమేశ్వరికి నమస్కారము.


చెవులకు స్పష్టముగా వినిపించు వాగ్రూపిణి యైన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వైఖరీరూపా* యను ఐదక్షరముల (పంచాక్షరీ)  నామ మంత్రమును *ఓం వైఖరీరూపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి చక్కని మాటకారితనమును అనుగ్రహించి పలువురి మన్ననలందునటులు ప్రవర్తింపజేయును.


జగన్మాత మిక్కిలి కఠినరూపము గలిగినది. నాలుగు వాగ్రూపములలో (పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ) నాలుగవది అయిన వైఖరీవాగ్రూపిణి. ఈ నాలుగవ స్థితిలో వాక్కు స్పష్టముగా చెవులకు సోకుతుంది. అందుచే అమ్మవారు *వైఖరీరూపా* యని అనబడినది. యోగశాస్త్రంలో విఖరము అనే వాయువుచేత ప్రేరేపింపబడిన వైఖరీ వాగ్రూపిణి. పరా, పశ్యంతి, మధ్యమ అను స్థితులనుండి వైఖరీ స్థితికి వచ్చిన వాక్కు స్పష్టత కలిగియుండును. వైఖరీ వాక్కు నాలుక, దంతాలు, పెదవులు మొదలైన స్థానములను తాకుతూ, స్పష్టత సంతరించుకొని, వాయువు ఆధారంగా వెలికివచ్చి, ధ్వనితరంగమై, కర్ణములకు చేరి స్పష్టత పొందియుంటుంది. అకారాది క్షకారాంతము వరకు గల వివిధ అక్షరములు, అట్టి అక్షరముల కూర్పుతో మాటలు మరియు అట్టి మాటలకు జోడింపబడిన సంగీతముతో కూడిన గానము - ఇది అంతయు ఆ పరమేశ్వరి స్వరూపము గనుకనే ఆ తల్లి *వైఖరీరూపా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వైఖరీరూపాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: