15, మే 2024, బుధవారం

మహాభాగవతం

 *15.5.2024 సాయంకాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఒకటవ అధ్యాయము*


*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*41.43 (నలుబది రెండవ శ్లోకము)*


*తతః సుదామ్నో భవనం మాలాకారస్య జగ్మతుః|*


*తౌ దృష్ట్వా స సముత్థాయ ననామ శిరసా భువి॥9860॥*


అనంతరము వారు (ఉభయులు) సుదాముడను మాలాకారుని గృహమునకు చేరిరి. వారిని చూచినంతనే ఆ సుదాముడు లేచి నిలబడి, వినమ్రతతో వారికి సాష్టాంగముగా ప్రణమిల్లెను.


*41.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*తయోరాసనమానీయ పాద్యం చార్ఘ్యార్హణాదిభిః|*


*పూజాం సానుగయోశ్చక్రే స్రక్తాంబూలానులేపనైః॥9861॥*


అంతట ఆ మాలాకారుడు వారిని ఉచితాసనములపై కూర్చుండబెట్టి బలరామకృష్ణులకును, వారి అనుచరులైన గోపాలురకును, భక్తిశ్రద్ధాపూర్వకముగా అర్ఘ్యపాద్యములను సమర్పించెను. పిమ్మట వారిని పూలహారములు, చందన తాంబూలములు, అనులేపనములు మొదలగు సముచితములైన పూజాద్రవ్యములతో అర్చించెను.


*41.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*ప్రాహ నః సార్థకం జన్మ పావితం చ కులం ప్రభో|*


*పితృదేవర్షయో మహ్యం తుష్టా హ్యాగమనేన వామ్॥9862॥*


పిమ్మట ఆ మాలాకారుడు ఇట్లు విన్నవించుకొనెను- "ప్రభూ! మీ ఇరువురి శుభాగమనమువలన నా జన్మ సార్థకమైనది. మా వంశము ఫునీతమైనది. మా క్షేమములను గోరెడి పితృదేవతలు, దేవతలు, ఋషులు సంతుష్టులైరి.


*41.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరమ్*


*అవతీర్ణావిహాంశేన క్షేమాయ చ భవాయ చ॥9863॥*


"మీరు ఈ సమస్త జగత్తునకు మూలకారణము. ఈ ప్రపంచముయొక్క అభ్యుదయము కొఱకును, సాధుపురుషుల యోగక్షేమముల కొఱకును మీ జ్ఞాన, బల, ఐశ్వర్యాది అంశములతో సంకల్పమాత్రమున మీరు ఈ లోకమునందు అవతరించిన మహాత్ములు".


*41.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*న హి వాం విషమా దృష్టిః సుహృదోర్జగదాత్మనోః|*


*సమయోః సర్వభూతేషు భజంతం భజతోరపి॥9864॥*


*41.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*తావాజ్ఞాపయతం భృత్యం కిమహం కరవాణి వామ్|*


*పుంసోఽత్యనుగ్రహో హ్యేష భవద్భిర్యన్నియుజ్యతే॥9865॥*


"మీరు ఈ అఖిల జగత్తునకు ఆత్మస్వరూపులు, హితైషులు. మిమ్ములను సేవించెడివారిపై మీకుగల అనుగ్రహము అపారము. ఐనను మీరు ఎవ్వరియెడలను ద్వేషభావమును వహింపక సకలప్రాణులపట్లను సమదృష్టినే కలిగియుందురు. నేను మీ సేవకుడను. నేను మీకు ఎట్టి సేవలు చేయవలెనో ఆజ్ఞాపింపుడు. జీవులను ఏదైనను కార్యమునందు నియోగించుటయనగా మీరు వారిని అనుగ్రహించుటయే యగును".


*41.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*ఇత్యభిప్రేత్య రాజేంద్ర సుదామా ప్రీతమానసః|*


*శస్తైః సుగంధైః కుసుమైర్మాలా విరచితా దదౌ॥9860॥*


పరీక్షిన్మహారాజా! ఇట్లు విన్నవించిన పిమ్మట సుదాముడు వారి అభిమతములను గ్రహించి, పరిమళభరితములగు పుష్పములతో సిద్ధపఱచబడిన మాలలను మిగుల భక్తిశ్రద్ధలతో ఆ మహానుభావులకు సమర్పించెను.


*41.50 (ఏబదియవ శ్లోకము)*


*తాభిః స్వలంకృతౌ ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ|*


*ప్రణతాయ ప్రపన్నాయ దదతుర్వరదౌ వరాన్॥9857॥*


సుదాముడు ప్రేమానురాగములతో సమర్పించబడిన పూలమాలలను బలరామకృష్ణులు తమ అనుచరులతో సహా ధరించిరి. అతని సేవలకు వారు మిగుల సంతృప్తులైరి. భక్తులకు కోరిన వరములను ప్రసాదించెడి ఆ మహాపురుషులు తమకు ప్రపత్తితో ప్రణమిల్లిన ఆ సుదామునకు పెక్కు వరములను అనుగ్రహించిరి. 


*41.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*సోఽపి వవ్రేఽచలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని|*


*తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరామ్॥9868॥*


అప్పుడు ఆ మాలాకారుడు కృష్ణప్రభువును ఇట్లు అర్ధించెను- 'స్వామీ సకల చరాచరాత్మకమైన జగత్తునకు ఆత్మస్వరూపుడవైన నీయందు (నీ పాదారవిందములయందు) అచంచలమైన భక్తిని నాకు ప్రసాదింపుము. నేను నీ భక్తులయందు ప్రగాఢమైన మైత్రియు సకల ప్రాణులయెడ అహేతుక దయను కలిగియుండునట్లు అనుగ్రహింపుము,


ఈ సందర్భమున పోతనమహాకవి  రచించిన ఈ పద్యము తెలుగువారి నాల్కలపై నాని నాని, వారి హృదయములలో అమృతపుసోనలను నింపినది.


*కంద పద్యము*


నీ పాద కమల సేవయు , 

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూత దయయను ,

తాపస మందార నాకు దయసేయగదే


*భావము*


"ప్రభూ! నీవు తాపసులకు కల్పవృక్షమువంటివాడవు. నీ పాదకమలములను సేవించుచుండెడి భాగ్యమును నాకు ప్రసాదింపుము. నిన్ను సేవించెడి భక్తులతో మైత్రిని అనుగ్రహింపుము (నన్ను నీ దాసానుదాసునిగా ఆదరింపుము). నాకు ప్రాణులయెడలను అపారమైన దయయుండునట్లుగా చూడుము".


(దశమస్కంధము, పూర్వార్ధము)


*41.52 (ఏబది ఒకటవ శ్లోకము)*


*ఇతి తస్మై వరం దత్త్వా శ్రియం చాన్వయవర్ధినీమ్|*


*బలమాయుర్యశఃకాంతిం నిర్జగామ సహాగ్రజః॥9869॥*


ఇట్లు సుదాముడు వేడుకొనగా, అతడు కోరుకొనిన వరములను ఇచ్చుటయేగాక- శ్రీకృష్ణుడు అతనికి వంశాభివృద్ధికరములైన సకలసంపదలను, చక్కని బలమును, దీర్ఘాయువును, యశస్సును, ఘనమైన తేజస్సును ఒసంగెను. పిమ్మట ఆ స్వామి బలరామునితోగూడి అతని గృహమునుండి బయలుదేఱి వెళ్ళెను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే పురప్రవేశో నమైకచత్వారింశోఽధ్యాయః (41)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట* యను నలుబది ఒకటవ అధ్యాయము (41)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: