15, మే 2024, బుధవారం

వైశాఖ పురాణం🚩*_ _*7

 🌷 *గురువారం - మే 16, 2024*🌷

   _*🚩వైశాఖ పురాణం🚩*_

      _*7 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  *వైశాఖమాస దానములు*

☘☘☘☘☘☘☘☘☘

అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగు బాగు వినుమని యిట్లు వివరింపసాగెను.


రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, వైశాఖవ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు.


సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు , సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి , అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట , మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట , చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకఱ్ఱలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు, దిగుడుబావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము దానముచేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము వైశాఖ అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను.


ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ, గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట, ముఖ్యకర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి కావలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ  విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్న నివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.


పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక, విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును ఈయవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను, సంపదలను, కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా !


   *వైశాఖ పురాణం ఏడవ*    

   *అధ్యాయం సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

కామెంట్‌లు లేవు: