*15.5.2024 ప్రాతఃకాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది ఒకటవ అధ్యాయము*
*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*41.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*ప్రాసాదశిఖరారూఢాః ప్రీత్యుత్ఫుల్లముఖాంబుజాః|*
*అభ్యవర్షన్ సౌమనస్యైః ప్రమదా బలకేశవౌ॥9846॥*
శ్రీకృష్ణదర్శనానందముతో ఆ నగరస్త్రీల ముఖారవిందములు చక్కగా వికసించెను. మేడలపై చేరియున్న ఆ ముదితలు హర్షముతో బలరామకృష్ణులపై పూలను వర్షించిరి.
*41.30 (ముప్పదియవ శ్లోకము)*
*దధ్యక్షతైః సోదపాత్రైః స్రగ్గంధైరభ్యుపాయనైః|*
*తావానర్చుః ప్రముదితాస్తత్ర తత్ర ద్విజాతయః॥9847॥*
ఆ పరమ పురుషులను దర్శించుటకై అచ్చటచ్చట చేరియున్న ద్విజులు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు) పెఱుగు, అక్షతలు, జలపాత్రలు, పూలహారములు, చందనములు మొదలగు వానిని, తదితరములగు కానుకలను సమర్పించుచు, సంతోషముతో ఆ మహాత్ములను అర్చించిరి.
*41.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*ఊచుః పౌరా అహో గోప్యస్తపః కిమచరన్ మహత్|*
*యా హ్యేతావనుపశ్యంతి నరలోకమహోత్సవౌ॥9848॥*
అప్పుడు పురజనులు తమలో తాము ఇట్లనుకొనిరి- 'గోపికలు నిజముగా ఎంత ధన్యాత్మలోగదా! మానవాళికి పరమానంద దాయకములైన ఈ మహానుభావులను నిత్యము దర్శించెడి భాగ్యమునకు నోచుకొనిన ఆ గోపవనితలు ఎంతటి తపస్సులను ఆచరించిరోయేమో?"
*41.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*రజకం కంచిదాయాంతం రంగకారం గదాగ్రజః|*
*దృష్ట్వాయాచత వాసాంసి ధౌతాన్యత్యుత్తమాని చ॥9849॥*
*41.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*దేహ్యావయోః సముచితాన్యంగ వాసాంసి చార్హతోః|*
*భవిష్యతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయః॥9850॥*
ఇంతలో వస్త్రములను శుభ్రముగా ఉతికెడువాడు, వాటికి రంగులు అద్దెడు వాడైన ఒక చాకలి శ్రీకృష్ణునకు కనబడెను. అప్పుడు ఆ స్వామి, 'మేలైన ఉతికిన వస్త్రములను ఇమ్ము' అని అడుగుచు అతనితో ఇట్లనెను - "మిత్రమా! అర్హులమైన మా ఉభయులకును కొన్ని మంచి వస్త్రములను ఇమ్ము. గుడ్డలను ఇచ్చినందున నీకు చక్కని శ్రేయస్సు కలుగును. ఇది ముమ్మాటికిని నిజము".
*41.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*స యాచితో భగవతా పరిపూర్ణేన సర్వతః|*
*సాక్షేపం రుషితః ప్రాహ భృత్యో రాజ్ఞః సుదుర్మదః॥9851॥*
పరీక్షిన్మహారాజా! అన్నివిధములుగా పరిపూర్ణుడైన (ఆప్తకాముడైన) కృష్ణభగవానుడు ఇట్లడుగగా, కంసరాజునకు భృత్యుడు మిగుల గర్వితుడు ఐన ఆ రజకుడు ఎంతయు క్రుద్ధుడై ఆ నందనందనుని ఆక్షేపించుచు ఇట్లు నుడివెను-
*41.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*ఈదృశాన్యేవ వాసాంసీ నిత్యం గిరివనేచరాః|*
*పరిధత్త కిముద్వృత్తా రాజద్రవ్యాణ్యభీప్సథ॥9852॥*
*41.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*యాతాశు బాలిశా మైవం ప్రార్థ్యం యది జిజీవిషా|*
*బధ్నంతి ఘ్నంతి లుంపంతి దృప్తం రాజకులాని వై॥9853॥*
గుట్టలలో, అడవులలో తిరుగుచుండెడి గోపాలులారా! మీరు నిత్యము ఇట్టి మేలైన వస్త్రములనే ధరించుచుందురా? మీరు మిగుల మదించియున్నట్లు కనుబడుచున్నారు. మీ కనులు నెత్తికెక్కినవా? రాజుగారు ధరించుచుండెడి ఈ వస్త్రములను కోరుకొనుటకు మీకు ఎన్ని గుండెలు? మూర్ఖులారా! ప్రాణములపై ఆశయున్నచో మీరు ఇట్లు అడుగదగదు. వెంటనే ఇక్కడినుండి పాఱిపొండు. లేనిచో రాజభటులు దుష్టులైన మిమ్ము పట్టి బంధించెదరు. చావగొట్టెదరు. అంతేగాదు, మీ వస్తువులను అన్నింటిని లాగుకొనెదరు".
*41.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*ఏవం వికత్థమానస్య కుపితో దేవకీసుతః|*
*రజకస్య కరాగ్రేణ శిరః కాయాదపాతయత్॥9854॥*
చాకలి యుక్తాయుక్తములను మఱచి ఇట్లు వదరుచున్నందులకు శ్రీకృష్ణుడు మిక్కిలి కుపితుడయ్యెను. వెంటనే ఆ ప్రభువు తన కరాగ్రముతో (చేతి ముందుభాగముతో) ఆ చాకలి శిరస్సు తెగిపడునట్లుగా కొట్టెను.
*41.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*తస్యానుజీవినః సర్వే వాసః కోశాన్ విసృజ్య వై|*
*దుద్రువుః సర్వతో మార్గం వాసాంసి జగృహేఽచ్యుతః॥9855॥*
అంతట ఆ చాకలియొక్క అనుచరులు తమ గుడ్డలమూటలను అక్కడనే పడవేసి, ఎటువారటు కాలికి బుద్ధిచెప్పిరి. పిదప శ్రీకృష్ణుడు తనకు అనువగు వస్త్రములను ఆ చాకలి మూటలనుండి తీసికొనెను.
*41.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*వసిత్వాఽఽత్మప్రియే వస్త్రే కృష్ణః సంకర్షణస్తథా|*
*శేషాణ్యాదత్త గోపేభ్యో విసృజ్య భువి కానిచిత్॥9856॥*
అనంతరము శ్రీకృష్ణబలరాములు తమకు బాగుగా నచ్చిన వస్త్రములను ధరించిరి. మిగిలిన వాటిలో కొన్నింటిని తమ అనుచరులగు గోపాలురకు పంచియిచ్చిరి. తక్కిన గుడ్డలను అక్కడనే వదలివేసిరి.
*41.40 (నలుబదియవ శ్లోకము)*
*తతస్తు వాయకః ప్రీతస్తయోర్వేషమకల్పయత్|*
*విచిత్రవర్ణైశ్చైలేయైరాకల్పైరనురూపతః॥9857॥*
*41.41 (నలుబది ఒకటవ శ్లోకము)*
*నానాలక్షణవేషాభ్యాం కృష్ణరామౌ విరేజతుః|*
*స్వలంకృతౌ బాలగజౌ పర్వణీవ సితేతరౌ॥9858॥*
రామకృష్ణులు కొంతముందునకు నడువగా ఒక నేతవాడు వారికి ఎదురయ్యెను. అప్పుడు అతడు వారి దర్శనమునకు ఎంతయు సంతష్టుడయ్యెను. పిదప అతడు, తాను స్వయముగా నేసిన వస్త్రములతో వారి రూపములకు అనువగు రంగురంగుల వస్త్రములతో వారిని అలంకరించెను. అంతట బలరామకృష్ణులు వివిధములగు రంగుల వస్త్రములను దాల్చి, ఉత్సవసమయములయందు బాగుగా అలంకరింపబడిన తెలుపు నలుపువన్నెలుగల ఏనుగు గున్నలవలె శోభిల్లిరి.
*41.42 (నలుబది రెండవ శ్లోకము)*
*తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్సారూప్యమాత్మనః|*
*శ్రియం చ పరమాం లోకే బలైశ్వర్యస్మృతీంద్రియమ్॥9859॥*
నేతవాని సేవలకు శ్రీకృష్ణపరమాత్మ ఎంతయు ప్రసన్నుడయ్యెను. పిమ్మట ఆ స్వామి అతనికి ఈ లోకమున (జీవితకాలమున) చక్కని సిరిసంపదలను, బలమును, ఐశ్వర్యమును, భగవద్భక్తిని, జితేంద్రియత్వమును ప్రసాదించెను. అంతేగాక, దేహాంతమున అతనికి తన సారూప్యముగూడ ప్రాప్తించునట్లు అనుగ్రహించెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి