*తిరుప్పావై 10పాశురం*
🕉🌞🌏🌙🌟
🕉🌞🌏🌙🌟
*నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!*
*మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్*
*నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్*
*పోత్తప్పఱై తరుమ్* *పుణ్ణియనాల్! పణ్డోరునాళ్*
*కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్*
*తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?*
*ఆత్త* *అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!*
*తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.*
*భావం*
ॐॐॐॐॐॐॐ
నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! తలుపును తెరువుము, తలుపును తెరువకపోయినను మానెగాని, నోటినైనను తెఱచి పలుకవచ్చునుకదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటె వారి శ్రీ సూక్తులను వినటమే చాల ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి). పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను (పఱై) ఇచ్చునుకద! పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను మేల్కొలుపు చున్నారు.
మేము రాకముందే నోమునోచి, దానిఫలముగ సుఖానుభవమును పొందిన తల్లీ ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాట ఐననూ పలుకవా ! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమియూలేని మావంటి వారము మంగళము పాడినను 'పఱ' అను పురుషార్థమును ఇచ్చెడి పుణ్యమూర్తి, ఒకనాడు మృత్యువు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఒడింపబడి తనసొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఇచ్చినాడా ! ఇంట అధికమగు నిద్రమత్తు వదలని ఓతల్లీ ! మాకందరకు శిరోభూషణమైనదానా ! నిద్రనుండి లేచి, మైకము వదిలించుకొని, తేరుకొని వచ్చి తలుపు తెరువుము. నీనోరు తెరచి మాట్లాడుము. ఆవరణము తొలగించి నీ దర్శనము ఇవ్వు.
*అవతారిక:-*
ॐॐॐॐॐॐॐॐॐ
తనను పొందుట భగవానునికి ఫలము కాని, తనకు కాదు కనుక ఉద్వేగము పొందవలసినది పరమాత్మనే కానీ - తనకెందుకు అని నిశ్చలముగా ఉండెను. ఒకవేళ బ్రహ్మానుభవ సుఖము లభించినను దానియందు మమకారము లేకయుండును. ఆ సుఖము వానిదికదా ! తనకెందుకు సుఖమునందు మమకారము ? శ్రీకృష్ణునికి పొరుగింటనున్నది, నిరంతరము క్రిష్ణానుభావమునకు నోచుకొన్నదియై ఉన్నది. అట్టి ఆ గోపికను (ఈ పాశురములో) నిద్దురలేపుచున్నారు.
వేదములను అధ్యయనం చేయటానికి సమర్ధుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్ధులైన ఒక నాయకుడో, నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలెకదా! ఆ వూరి యంతటికిని కృష్ణ సంశ్లేషమున సమర్ధురాలైన ఒక గోప కన్యక, యీ గోపకన్యలందరును కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనంతయు శ్రీ కృష్ణుడే పడునట్లు చేయ సమర్ధురాలైనది, శ్రీకృష్ణునికి పొరిగింటనున్నదియై, నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకొన్నదియై వున్నది. అట్టి ఆ గోపికను (యీ పదవ మాలికలో) లేపుచున్నారు.
*(బిలహరి రాగము - రూపక తాళము)*
ప.. నోము నోచి సుఖములను పొందగ దలచిన ఓయమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయ వేలనో యమ్మా!
అ..ప.. ఏమి తలుపు తీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!
చ.. పరిమళించు తులసి మాలల కిరీటధారుడు
నారాయణుడే మనచే కీర్తింపబడువాడు
పురుషార్థము నిచ్చునట్టి శ్రీహరి ధర్మాత్ముడు
పురుషోత్తము గొలువ తెలివిగొని తలుపులు తీయవె!
చ.. శ్రీరాముని కాలమందు మృత్యు నోట బడె నొకడు
ఘోర నిద్ర కామించెడి వీర కుంభకర్ణుడు
ఆ రాక్షసుడోడి నీకు దీర్ఘనిద్ర నిచ్చెనో - మా
శిరోభూషణమ్మ! తెలివి చెంది తలుపు తీయవె!
నోమునోచి సుఖములను పొందదలచిన ఓయమ్మా!
ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయవేలనో యమ్మా!
*ముని యొక్క దశ*
*ఆండాళ్ తిరువడిగలే శరణం*
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
ఆండాళ్ తల్లియొక్క సంకల్పం అందరూ కలవాలి,వైయత్తు వాళ్ వీర్గాళ్ ఈ భూమిమీద ఉన్నవాళ్ళంతా ఒకటి, ఇది మన ఆండాళ్ తల్లి హృదయ వైశాల్యం. ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దూ అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది.
శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్టిలో చేరుస్తుంది. పైపైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెపుతున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం.
మానవ జీవితం అనగా సుఖ దుఖాఃలు నదీ తరంగాలుగా ఒక దానివెంట ఒకటి వస్తూనేవుంటాయి. సుఖమైనా దుఖఃమైనా ఎప్పటికి నిలిచి ఉండవు. అవి ఎలా మారినా నీవు మాత్రం మారకుండా ఉండాలి.
సుఖ దుఖాఃలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్దం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు. మానసిక ఏకాగ్రత ఎట్లా చెడుతుంది, అయితే దుఖం వల్లనన్నా లేక సుఖం వల్ల నన్నా చెడుతుంది.
సుఖం వచ్చినప్పుడు మిడిసి పడ కూడదు. సుఖః దుఖాఃలు ప్రమాదకరం కాదు, వాటియందు మనం పెట్టుకున్న పట్టు ప్రమాదకరం. అలాంటి సమయంలో ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఏంచెయ్యాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.
*దుఖేఃషు అణుద్విజ్ఞమనాః సుఖేషు విగతస్పృహః |*
*వీత రాగ భయ క్రోదః స్తితధీః మునిరుచ్యతే ||*
మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం. నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి- వాడినే ముని అంటారు. అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై సృహ ఉండకుండా చేసుకోకు, దుఖం వచ్చినప్పుడు మనస్సు ఉద్విజ్ఞం చెందకుండా ఉండాలి.
మనకు వీటియందు పట్టు ఉండకుండాచూసుకోవాలి. మనలోని రాగం భయంగా మారి క్రోధం గా మారుతుంది. ఈరోజు మన ఆండాళ్ తల్లి లేపే గోపబాలిక ఇలాంటి జ్ఞానం కల్గి ఉన్నది.
*"నోత్తు"* మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు, కానీ నీనోము అయిపోయింది.
ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది. *"చ్చువర్ క్కం పుగుగిన్ఱ"* నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టు ఉన్నావు, అంటే కృష్ణుడు నీవద్దే ఉన్నాడు. కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే. సకలలోకాలనన్నినింటిని తనలో చూపించాడుకదా, ఎప్పటికీ మారకుండా ఏక రూపంగా ఉన్న ఆనందమే భగవంతుడు అని అంటే, ఆ భగవంతుడే రూపు దాల్చి వచ్చినదే శ్రీకృష్ణ అవతారం.
ఆయనలో సకలం ఉన్నట్లేకదా, ఆయన ఒక్కడు చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా. *"తేషాం రాజన్ సర్వ యజ్ఞాః సమాప్తాః "* ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు అనుష్టించాల్సిన అవసరం ఉండదు.
*"అమ్మనాయ్"* ఓ యజమానురాలా! యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి. *"మాత్తముం తారారో"* ఒక మాట మాతో మాట్లాడరాదా *"వాశల్ తిఱవాదార్"* తలుపులు తర్వాత తీద్దువుగాని, లోపలనుండే మాట్లాడు. నీవు భాగవతోత్తమురాలివి, నిన్ను సేవించుకోవటం ముఖ్యం. నీన్ను శ్రీకృష్ణ సేవనుండి మేం వేరు చేయటంలేదు. నీ మాట చాలు మాకు. అది మాకు ప్రాణం కాపాడుతుంది. జ్ఞానం పొందాలనుకొనే వ్యక్తికి మహానుభావుల వాక్కు మొదటి రక్ష.
వీళ్ళు కృష్ణుడులోపల ఉన్నాడని వీళ్ళు అనుమానిస్తున్నారు, ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పు పడతారు అని లోపల గోప బాలిక ఏం పలకలేదు. లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్లుగా ఆమె వీళ్ళను పట్టించుకోలేదు. *"నాత్తత్తుళాయ్ ముడి"* లోపలుండే వాడు మన స్వామియే, ఎందుకంటే తులసిని ధరించిన వాడు మన స్వామియే కదా. ఎవరికి ఆపద వాటిల్లినా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు. మేము ఆ వాసన గుర్తించాం.
లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి, చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడెక్కడినుండి వస్తాడు అని అంది.
*"నారాయణన్"* అంతటా వ్యాపించినవాడేకదా ఆయన, సకల చేతన అచేతన వస్తువులకన్నింటికీ లోపన పైన వ్యాపించి ఉండేవాడు. అలాంటి వానికి తలుపులు అడ్డా! *"నమ్మాల్ పోత్త ప్పఱై తరుం"* దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులందరికి అందేవాడు ఆయన. *"పుణ్ణియనాల్"* పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు. ఆయన అందరికి అందాల్సినవాడు నీ ఒక్కదాని వద్దే పెట్టుకోవడం సబబా!
*"పండొరునాళ్"* ఇదివరకు ఒకనాడు *"కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం"* మృత్యువు నోట్లో దూరాడు కుంభకర్ణుడు.
రాముడు అందరినీ రక్షించగల ఉదారుడు, ఆయన కుంభకర్ణుడిని చంపలా, కుంభకర్ణుడే మృత్యువు నోట్లో దూరాడు. దీప కాంతికోసం వచ్చిన కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపందా!
బుద్దిమంతుడూ ఆ దీపకాంతినే వాడుకొని బాగుపడతాడు, బుద్ది హీనుడు దానిలోనే పడి ప్రాణం తీసివేసుకుంటాడు. *"తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో"* ఇంతగా మేం చెబుతుంటే వినట్లేదంటే ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా. పైపైకి సరదాగా చెప్పినా లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది అండాళ్ తల్లి.
ఒక దివ్యమైన జ్ఞానం కల మహనీయుడితో పోలుస్తుంది. ఎవరు అంటే, కుంభంను కరణముగా కల్గిన వ్యక్తి, అగస్త్యుడు ఓడి పోయి తన శక్తిని నీకు ఇచ్చేసాడా అంటుంది.
అగస్త్యుడు అనే ఋషి ఒక కుండలో పుట్టిన వాడు. శివుని వివాహానికి హిమాలయాపర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందట. వింధ్య పర్వతం మేలుపర్వతానికి పోటితో పెరుగుతుంటే దేవతలంతా గాబరా పడి ఈయనని అడిగితే, వింధ్య పర్వతం ఈయన శిష్యుడు.
ఈయన దగ్గరకు రాగానే ఆ పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తధాస్తు అని పెరుగుదలని వంచాడు అది ఆయన గొప్ప తనం. మామూలుగా మనం ఒక్కొక్క పర్వతానికి అదిష్టాన శక్తివిశేషం ఉంటుంది మనం దాన్నే పర్వతం అంటాం.
ఈ భూమినీ మనం అలాగే భావిస్తాం, ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు, అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి ఆంటాం. అగం-పర్వతం స్త- పెరుగుదలని నిలిపిన వాడు అందుకే ఆయన పేరు అగస్త్య అయ్యింది. మనలో పెంచుకున్న పాపపు కొండలని స్తంభింపజేయువాడు ఆయన.
ఒకనాడు మొత్తం సముద్రాన్ని పానం చేసిన మహనీయుడు. ద్రావిడ భాషకంతటికి ఆయన వ్యాకరణ సూత్రాలను రచించిన మహనీయుడు. వాతాపిని సంహరించిన మహనీయుడు. అలాంటి మహనీయుడు కూడా నీవద్ద ఓడిపోయాడా అన్నట్లుగా ఆండాళ్ తల్లి చెబుతుంది.
లోపల గోపబాలిక లేచి కృష్ణా అంటూ లేచింది, *"ఆత్త అనందల్ ఉడైయాయ్!"* పెద్ద బద్దకం కల దానా, *"అరుంగలమే"* అతిలోక సుందరి, ఒక మంచి ఆభరణం లాంటి దానివి. జ్ఞానులు అలా ఉంటారు, వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసినవారుకాదు. *"తేత్తమాయ్ వందు తిఱవ్"* తొందరగా సర్దుకొని రావమ్మా.
*తిరుప్పావై 10వ పాశురం అనువాద పద్యం*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
ॐॐॐॐॐॐॐॐॐॐ
*నోత్తుచ్చు వర్గం పుహునిన్ఱ*
*సీ,ద్వారంబు తీయక దారిని చూపక*
*నిద్ర వీడని కళ్ళు నిద్ర నుంచు*
*మాట మాత్రము కూడ మాకైన తెలుపక*
*మౌన ముద్రను దాల్చె మగువ యిపుడు*
*స్వర్గ సుఖములెల్ల చక్కగా పొందుచు*
*ఆనంద మందెడు చాన యగుచు*
*నారాయణుని చేరి నారీ శిరోమణి*
*బృందమై కదలెను సుందరముగ*
*తే.గీ. తులసి మాలికలను తెచ్చి తోయజాక్షు*
*కంఠమునలంకరించగా కదలినారు*
*కరుణజూపుము వాయిద్య పరను యిమ్ము*
*వరము లొసగెడు స్వామికి వందనములు*
*శ్రద్ధ భక్తిని యందించి బుద్ధినిమ్ము*
*శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!*
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి