25, డిసెంబర్ 2024, బుధవారం

11-26,27-గీతా మకరందము

 11-26,27-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి


అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః 

సర్వే సహైవావనిపాలసజ్ఘైః | 

భీష్మో ద్రోణస్సూతపుత్ర స్తథాఽసౌ

సహాస్మదీయైరపి యోధముఖ్యైః || 


వక్త్రాణి తే త్వరమాణా విశన్తి 

దంష్ట్రాకరాలాని భయానకాని | 

కేచిద్విలగ్నా దశనాన్తరేషు 

సందృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః ||  


తా:- ఈ ధృతరాష్ట్రుని కుమారులందఱును, భీష్ముడును, ద్రోణుడును, కర్ణుడును, వారిసేనయందలి సమస్తరాజసమూహములును, అట్లే మనసేనయందలి సైనికప్రముఖులును - నిన్ను త్వరితముగ జేరుచున్నవారై కోరలచే భయంకరములుగ నున్నట్టి మీనోళ్లయందు ప్రవేశించుచున్నారు. (వారిలో) కొందఱు మీ పండ్లసందులయందు చిక్కుకొనినవారై చూర్ణమొనర్పబడిన శిరస్సులతో కనుపించుచున్నారు. 

 

వ్యాఖ్య:- పరమాత్మయందు 

భూతభవిష్యద్వర్తమానకాలభేదము లేదు. కాలాతీతుడగు భగవానునియందు కాలమునకు సంబంధించిన విభేదములుగాని, విభజనలుగాని ఉండనేరవు. కనుకనే భవిష్యత్తునందు జరుగబోవునదియంతయును వర్తమానమందే విశ్వరూపమున అర్జునునకు గోచరించుటకు కారణమైనది. భీష్మద్రోణకర్ణాది కౌరవపక్షవీరులు, మరియు పాండవపక్షమువారు భవిష్యత్కాలమున మృతినొంది కాలగర్భమున ప్రవేశించుటను అర్జునుడు విశ్వరూపమున స్పష్టముగ గాంచగల్గెను. దీనిభావమేమి? భూతభవిష్యద్వర్తమానములన్నియు పరమాత్మయందు ఒకటే. గడచిన అనేకయుగములకాలము. రాబోవు అనేకయుగములకాలము పరమాత్మయందు వర్తమానకాలమేయగును. ఆతడు కాలాతీతుడు, కాలకాలుడు. కాలము వారియందు కల్పింపబడినది. 

    ఈ శ్లోకమందు వ్యక్తమొనర్పబడిన భావములను బాగుగ విచారించిచూచినచో గొప్పవైరాగ్యము జీవునియం దుదయింపగలదు. ఏలయనిన, ప్రత్యక్షముగ కానుపించు భీష్మద్రోణాదులు, తక్కిన వీరులు ఆ క్షణముననే భయంకరమగు కాలముయొక్క కరాళవదనమందు త్వరితముగ ప్రవేశించుచున్నట్లు అర్జును డెట్లు గాంచగల్గెనో ఆ ప్రకారమే ఇపుడు ప్రత్యక్షముగా గానుపించు ఈ బంధుమిత్రదారాసుతాదులు, ధనధాన్యాదులు, భవనములు, క్షేత్రారామములు, సంపదలు అన్నియు కాలగర్భమున విలీనమైపోవునవే యనియు - జీవుడు భావించుకొనవలెను. ఈ సత్యమును చక్కగ భావించుకొనినచో దృశ్యపదార్థములం దంతట వైరాగ్యభావ ముప్పతిల్లగలదు. 

    భవిష్యత్తును వర్తమానమున జూడగల్గుటయే జ్ఞానదృష్టి. రాబోవు మృత్యువును ఇప్పుడు భావించగల్గుటయే జీవుని విఙ్ఞతయైయున్నది. అట్టి భవిష్యద్భావనచే, మృత్యుచింతనచే జీవుడు వైరాగ్యోపేతుడై జీవితమును జాగ్రత్తగ నడుపు కొనగలడు. అత్తఱి భోగాదులం దాతనికి విరక్తియు, భగవంతునియందు భక్తియు ఉదయించును. మరణము సంభవింపకమునుపే లక్ష్యప్రాప్తినొందవలెనను దృఢనిశ్చయము కలుగజేసికొని అందులకై తీవ్రతరముగ ప్రయత్నించును. 

      కాబట్టి విశ్వరూపమున అర్జునుడు చూడగల్గిన భవిష్యత్కాలచిత్రమును ప్రతిముముక్షువు తన హృదయవీధియందు చిత్రించుకొని, వైరాగ్యయుక్తుడై లక్ష్యమగు పరమాత్మ ప్రాప్తికై అనవరతము యత్నము గావించుచుండవలెను.

కామెంట్‌లు లేవు: