🙏 *ద్వాదశ ఆళ్వారులు-*
*2. పూదత్తాళ్వార్ :*
💫 పొయ్‌గై అళ్వార్ కు సమకాలికులైన ఈ రెండవ ఆళ్వార్, శ్రీహరి యెక్క 'కౌమోదకి' గదాంశతో, ఒకానొక పుష్పంలో జన్మించారని ప్రతీతి. పుష్పంలో నుండి ఉద్భవించిన కారణంగా వీరిని *'పూదత్తాళ్వార్'* గా వ్యవహరిస్తారని కొందరు అభిప్రాయపడతారు.
💫 వీరు కూడా మొదటి ఆళ్వార్ వలె సిద్ధార్థి నామ సంవత్సరం లోనే జన్మించారు. తులామాసపు ధనిష్ఠానక్షత్రం, నవమి తిథినాటి బుధవారపు దినాన వీరి జననం సంభవించింది. ఈనాడు మహాబలిపురంగా ప్రసిద్ధికెక్కిన 'మామల్లపురం' వీరి జన్మస్థలం.
💫 వీరికి భూతాళ్వార్, ఉత్పలముని, ద్వితీయయోగి అనే నామాంతరాలు కూడా ఉన్నాయి. పంచభూత తత్వాన్ని ఆమూలాగ్రం ఎరిగిన వారు కావున 'భూతాళ్వార్' గాను; ఆళ్వార్ లలో రెండవ వారు గావున 'ద్వితీయముని' గాను పిలువ బడుతున్నారని కొందరు విశ్వసిస్తారు.
💫 స్వామిని దర్శించాలనే దృఢసంకల్పంతో, కౄరమృగాలు, ఎండవానల వంటి ఈతిబాధలను లక్ష్య పెట్టకుండా, తిరుగులేని భక్తివిశ్వాసాలతో తిరుమలక్షేత్రాన్ని సందర్శించుకున్న వీరు పర్వతమార్గం లోని అందచందాలను, మార్గమధ్యంలో వారి అనుభూతులను తమ పాశురాలలో హృద్యంగా వర్ణించారు. వేంకటాచల క్షేత్రాన్ని ఆకుపచ్చటి వెదురుపొదలకు, నిత్యం పర్వతసానువుల నుండి జాలువారే జలధారలకు, తామరపూలతో నిండి ఉండే సరోవరాలకు నిలయంగా తమ పాశురాలలో అభివర్ణించారు. మదపుటేనుగులు లేత వెదురుకాండాలను పుట్టతేనెలో రంగరించి తమ ప్రియురాళ్ళకు అందజేస్తాయంటూ మూగజీవుల ప్రేమను కవితాధోరణిలో వెలువరించి; తన సృజనాత్మకతను చాటుకున్నారు.
💫 వీరు రచించిన నూరు పాశురాల సంకలనాన్ని *'ఇరండాం తిరువందాది'* గా పేర్కొంటారు. ఇందులో తిరువేంగడపు ప్రాకృతిక శోభనే కాకుండా, విష్ణుమహిమను కూడా అత్యద్భుతంగా తెలియజెప్పారు. ఈ పాశురాలను బ్రహ్మోత్సవాలలో రెండవరోజు ఉదయం, సాయంత్రాలలో జరిగే చిన్నశేషవాహనము, హంసవాహన ఉత్సవాల సందర్భంగా పఠిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి