*తిలాపాపం తలాపిడికెడు*
అడపా తడపా ఇటువంటి చందమామ కథలు చెప్పుకోవలసి వస్తుంది.
ఒక పాలవాడు ఒక సత్రానికి రోజూ పాలు పోస్తాడు. ఒకనాడు ఎప్పటిలాగే పాల కుండను తలపైన పెట్టుకొని వెళుతుండగా ఆకాశంలో ఒక గ్రద్ద ఒక నాగు పామును వేటాడి తీసుకెడుతూ ఉంటే ఆ పాము నుంచి చిమ్మబడ్డ విషం పాలకుండలో పడుతుంది.
ఇది తెలియని పాలవాడు సత్రంలో పాలు పోస్తాడు. ఆ విషపుపాలతో వండిన వంటకాలు తిన్న వారందరూ చనిపోతారు.
ఈ విషయంపై యమసభలో విచారణ......
పాలవాడు... నాకు విషము పడిందని తెలియదు. పాపం నాది కాదు అని అంటాడు.
పాము... నా చావు బ్రతుకుల్లో అనంకల్పితముగా కారిన విషమది. ఆపాపం నాది కాదు అని అంటుంది.
గ్రద్ద... నా ఆహారపు వేట అది… నా పాపం కాదది అని అంటుంది.
వంటవాడు... పాలు విషపూరితమైనవి అని నాకు తెలియదు. అది నా పాపం కాదు అని అంటాడు.
వడ్డించినవాడు... భోజనం విషపూరితమైనది నాకు తెలియదు. అది నా పాపం కాదు అని అంటాడు.
చనిపోయిన వారు... భోజనంలో విషం ఉందని మాకు తెలియదు కాబట్టి తిన్నాం. అది మా పాపం కాదు.
మరి తెప్పెవరిది? దానికి బాధ్యత ఎవరిది? ఆ పాపం ఎవరిది? ఎంతో తర్జన భర్జన తర్వాత ఆ పాపానికి అందరూ కారకులే, కాబట్టి వారందరికీ తలా పిడికెడు ఆ పాపాన్ని పంచమని యమధర్మరాజు నిర్ణయిస్తాడు…
అలా… తిలా పాపం తలా పిడికెడు అనే నానుడి వచ్చింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి