పొలం నుంచి , పొట్టలోకి విషం!
వ్యవసాయ రంగంలో చీడపీడల బెడద పెరుగుతోంది. నియంత్రణకు పురుగు మందులను విచ్చలవిడిగా వాడుతుండటంతో , తీరని నష్టం కలుగుతోంది. విష ప్రభావంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార పదార్థాలూ విషతుల్యమవుతున్నాయి.
సాగులో చీడపీడలు, తెగుళ్ల సమస్యను అధిగమించేందుకు పలు మార్గాలున్నా, రసాయన మందులపై ఆధారపడక తప్పని పరిస్థితి రైతులది.
"దేశంలో అత్యంత ప్రమాదకర పురుగు మందుల వాడకం ఏటేటా పెరుగుతోంది. ఆసియా పసిఫిక్ పెస్టిసైడ్స్ యాక్షన్ నెట్వర్క్ సర్వే, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల్లో ఇదే తేలింది. పిచికారీ సమయంలో అజాగ్రత్త వల్ల,దేశంలో ఏటా ఏడువేల మంది ప్రాణాల్ని బలిగొంటోందని జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక లోగడ పేర్కొంది.
పురుగుమందుల ఉత్పత్తిలో భారత మార్కెట్ ఏటికేడు విస్తరి స్తోంది. వినియోగంలో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి ఎగబా కింది. పురుగు మందులను పంజాబ్, హరియాణాలు అత్యధికంగా వినియోగిస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణవే, తెలుగు రాష్ట్రాల్లో నకిలీ బీటీ పత్తి సాగు ఎక్కువ , దీనివల్ల పైరును రసం పీల్చే, కాయను తొలిచే పురుగు ఆశిస్తోంది. మిరప, హైబ్రిడ్ వరి రకాలనూ చీడపీడలు దెబ్బతీస్తున్నాయి. వీటిని తట్టుకునేందుకు రైతులు అశాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్నారు. మూణ్నాలుగు మందుల మిశ్రమాన్ని పిచికారీ చేస్తున్నారు. మోతాదుకు మించి వాడుతున్నా తెగుళ్లు, పురుగులు నియంత్రణలోకి రావడంలేదు. పైగా కొత్తరకం
తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. పల్లెల్లో కూలీల కొరత తీవ్రంగా వేదిస్తోంది. పంటపొలాల్లో కలుపుతీతకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దాంతో రైతులు కలుపు నాశిని విషాలపై ఆధారపడుతున్నారు. ఇవికూడా అత్యంత విషపూరితమైనవే. పిచికారీ వేళ అజాగ్రత్త వల్ల,క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధులకు దారితీస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. ధూమపానం కంటే అత్యధిక ముప్పు దీంతో పొంచి ఉందని తాజాగా ఓ పరిశోధన వెల్లడించింది. భూమిలేని కూలీలకు పిచికారీ ప్రక్రియ ఉపాధి మార్గమైంది. కానీ, వారిలో 80శాతం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ఎలాంటి రక్షణ కవచం లేకుండా చాలామంది గాలికి వ్యతిరేక దిశలో పిచికారీ చేయడం, శక్తిమంతమైన విదేశీ స్ప్రేయర్లు వినియోగిస్తుండటంతో , మందు నీటి తుంపర్లు శరీరాన్ని తడిసి ముద్దచేస్తున్నాయి. నోరు, ముక్కు ,కళ్లు, చర్మం ద్వారా చేరుతున్న విషపూరిత రసాయనాలు అవయవాల పనితీరును దెబ్బతీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పొలాల్లో పనిచేసే మహిళలపై ఈ విష ప్రభావం కనిపిస్తోంది. వారిలో సంతానలేమి, గర్భవిచ్ఛిత్తి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
తినే తిండితోనూ ప్రమాదమే
పంటలపై పిచికారీ చేసే విషాలు , లక్షిత పురుగుల్ని తాకేది కేవలం 0.01 శాతమేనని దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. పెస్టిసైడ్స్ ను విచ్చలవిడిగా వాడటంవల్ల లక్షల ఎకరాల్లో నేల సారాన్ని కోల్పోతోంది. సింథటిక్ రసాయనాల అవశేషాలతో మనం తినే అన్నం, కూర గాయలు, పండ్లు, పప్పుధాన్యాలు విషంగా మారుతున్నాయి. ఈ సమస్యకు సురక్షిత, సమగ్ర సస్యరక్షణ పద్ధతులే సరైన పరిష్కారమార్గాలు. స్థానిక సేద్య విధానాలను అన్నదాతలు అవలంబించడం శ్రేయోదాయకం. హాని చేయని పర్యావరణహితకర రసాయన, బయో పెస్టిసైడ్స్ తయారీ దిశగా కంపెనీలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఒక ఎకరానికి పెట్టే పెట్టుబడిలో రైతులు నాలుగింట ఒకవంతు పురుగు మందులకే వెచ్చిస్తున్నారని అంచనా ! సేంద్రియ సాగుతో ఈ భారం తప్పుతుంది. ఇలాంటి పర్యావరణ హితకర విధానాలను సాగు రంగానికి మరింత చేరువచేయాలి. ఈ బాధ్యత క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులదే. తక్కువ ధర ఆశజూపి గ్రామాల్లో అంటగడుతున్న నకిలీ, నిషేధిత ఉత్పత్తులెన్నో ఉన్నాయి. టాస్క్ఫోర్స్ బృందాలు అలాంటి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలి. క్రిమిసంహారక, పెస్టి సైడ్ మేనేజ్మెంట్ చట్టాల నిబంధనలను మరింత పదును తేల్చాలి. అప్పుడే సాగు రంగంతోపాటు ప్రజారోగ్యమూ సురక్షితమవుతుంది.
మాడుగుల గోపయ్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి