*దేవాలయాలు - పూజలు 24*
7) *శఠారి= శఠగోపము = శఠగోప్యము* :-
దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు, తీర్థ సేవన అనంతరము అర్చక స్వాముల వారు శఠగోపము భక్తుల శిరస్సుపై ఒక మాత్ర కాలము ఉంచుతారు. శఠగోపమునే శఠారి అని శఠగోప్యము అని వ్యవహరించుట అనాదిగా వస్తున్న వాడుక. శఠగోప్యము దేవాలయంలోని దేవీ/దేవతల విగ్రహాల/మూర్తుల *పాదద్వయ దర్శనానికి* ప్రతీక. దేవాలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడికి దేవీ/దేవతలను స్పృశించు వీలుండదు కావున తీర్థ సంప్రాప్తి తదుపరి అర్చక స్వాముల వారు శఠగోప్యమును భక్తుల శిరస్సుపై ఆనించి భగవత్ స్పర్శ కల్గిస్తాడు. దివ్యమైన శఠగోప్యం తలకు తగలడంతో అందులోని ఆపదుద్ధారక శక్తి వలన భక్తులలో ఆందోళన, భయం లాంటివి తగ్గగలవు.
భగవంతుని సాహచర్యం మనతో భౌతికంగా వుందనడానికి ధైర్యంగా మనమాచరించే ధర్మకర్మ నెరవేర్చగల స్నేహహస్తం మనతో వుందనడానికి సంకేతం. శఠగోప్యం వలయాకారంగా గంట ఆకృతిని కల్గి ఉంటుంది. శఠగోప్యం తయారిలో రాగి, కంచు మరియు వెండిని ఉపయోగిస్తారు. ఈ మూలకాల సహజత్వం ప్రకారం , విద్యుదావేశం జరిగి భక్తుల శరీరం లోని రజో తమో గుణాలు నశిస్తాయి. శుద్ధ సాత్వికత ఏర్పడుతుంది.
గత వ్యాసంలో తెలుసుకున్నట్లుగా శఠగోప్యము భగవత్ పాదుకలను కల్గి ఉంటుంది. సాక్షాత్తు భగవత్ పాదములు భక్తుల శిరస్సును స్పర్శించడం వలన అలౌకిక ఆనందము, అనిర్వచనీయమైన అనుభవము కల్గుట తథ్యము.
గోప్యము అంటే దాప్యము, రహస్యము అని అర్థాలు. శఠగోప్యము భక్తుల తలపై ఉంచినప్పుడు, భక్తులు *నిశబ్దంగా మరియు మౌనంగా* తమ తమ బాధలను, ఇబ్బందులను, కోరికలను భగవంతునికి నివేదించు సదవకాశము.
శఠ అను పదమునకు ఉన్న నానార్థములు= మధ్యస్థ, కుత్సితుడు, మోసగాడు, మూర్ఖుడు. శఠత్వం అంటే మూర్ఖత్వం. గోపం = గోప్యం = రహస్యము, దాచి ఉంచడం. అర్చక స్వాములు అరుదెంచిన వ్యక్తి తలపై శఠారిని ఉంచడం వల్ల ఆ వ్యక్తిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వము, అహంకారము తొలగి జ్ఞానం చేకూరుతుందని ఆధ్యాత్మికుల భావన. *శఠులు* అంటే మోసము చేయువారు అని అర్థము. *అరి* అంటే శత్రువు. *శఠారి* అంటే మోసమునకు శత్రువు. వ్యక్తుల శిరస్సుపై అర్చక స్వాముల వారు *శఠారి* ని ఆనించి నప్పుడు వారిలోని చెడు తలంపులు (ఆలోచనలు), ద్రోహ బుద్దులు శతృ భావము నశించి, సద్వర్తన (positive thoughts)అలవడుతుందని ఈ సంప్రదాయ అంతరార్థము.
*హిందూ సనాతన ధర్మ ప్రాచీనుల ముందు చూపు అమోఘమే గాకుండా అనన్య సామాన్యము. సమాజంలో సజ్జనులే గాకుండా వివిధ మనః ప్రవృత్తుల వారు ఉంటారని ఊహించి, భావించి, దేవాలయాలలో శఠారి సంప్రదాయమును ప్రవేశ పెట్టడం వారి విజ్ఞతకు ఒక మచ్చు తునక*.
*గమనిక* అర్చక స్వాముల వారు భక్తుల శిరస్సుపై *శఠారి* ని మృదువుగా, వాత్సల్య పూరితంగా ఉంచాలి, ఆశీర్వదించాలి.
*ఆశీర్వచనం* ఆశీర్వచనాలు పలు విధాలు, ఒక్కొక్కసారి భక్తుల కోరికల తదనుగుణంగా ఆశీర్వదించవలసి ఉంటుంది.
1) *సుఖీభవ*
2) *దీర్ఘాయుష్మాన్ భవ*
3) *దీర్ఘ సుమంగళి భవ*
4) *ఆయురారోగ్యమస్తు*
5) *పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు*
6) *యశో విభవ ప్రాప్తిరస్తు*
7) *ధార్మికో భవతు*
విశిష్ట ఆశీర్వచనాలు
1) *పశ్యేమ శరదశ్శతం*
*జీవేమ శరదశ్శతం*
*మోదామ శరదశ్శతం*
*నందామ శరదశ్శతం*
*భవామ శరదశ్శతం*
*శృణువామ శరదశ్శతం*
జోక్చస్సూర్యందృశే....
అర్థం:- నిండా నూరేళ్ళు
ఆ సూర్య భగవానుని చూడగలగాలి,వినగలగాలి, ఆనందంగా జీవించాలి.
2) *శతమానం భవతి శతాయు: పురుషశ్శతేన్ద్రియ ఆయుష్యేవేన్ద్రియే ప్రతి తిష్టతి*.
3) *శత మానం భవతి శత మనంతం భవతి, శత మైశ్వర్యం భవతి శత మితి శతందీర్ఘమాయుః* .
అర్చక స్వాముల వారు భక్తులందరిని తర తమ భేదం లేకుండా సమంగా చూడాలి. దేవాలయంలో మూర్తి, ప్రతిమ, చిత్తరువుల రూపంలో ఉన్న భగవంతుడు అప్పటికప్పుడు మాట్లాడకపోయినా, అప్పటికప్పుడు బోధించక పోయినా దేవాలయంలో జరిగే వాస్తవాలను నిత్యజీవితంలో మనం చేసే పనులను *కాలం రూపంలో గమనిస్తూ ఉంటాడు, సమాయానుసారము ఫలితాలను అందిస్తూ ఉంటాడు*.
దేవాలయంలో ఉన్నది ఒక బొమ్మలాంటి మూర్తి, ప్రతిమ, చిత్తరువు అని భావించరాదు. *యంత్ర, తంత్ర మంత్ర సంయుక్తమైన శక్తి అని మరువరాదు*
*దైవాధీనం జగత్ సర్వం*
*మంత్రాధీనంతు దైవతం*
*తన్మంత్రంబ్రాహ్మణాధీనం*
*బ్రాహ్మణో మమ దేవతా*
*ఈ హెచ్చరిక సర్వులకు అంటే భక్తులకు, అర్చక స్వాములకు మరియు యాజమాన్య సిబ్బందికి వర్తిస్తుంది*.
భక్తులందరూ అర్చక స్వాముల వారిని అర్థించి గూడా *శఠగోప్యము* ను పెట్టించుకోవాలి, *ప్రభావితులు కావాలి*.
ధన్యవాదములు.
*(సశేషము)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి