శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము
క. బ్రాహ్మణప్రియుడగు విష్ణువు
బ్రాహ్మణు వెతలెల్ల బాప భావించి మదిన్
బ్రాహ్మణు నడుగగ యవ్విధి
బ్రాహ్మణు డిట్లనియె భక్తి భావము పొంగన్ 29
ఆ. "బ్రాహ్మణుండ నేను బహుశాస్త్ర పఠితుడ
యుంఛవృత్తితోడ నుండు చుందు
దార సుతులతోడ దారిద్ర్యమున నుండి
బ్రతుకు నీడ్చుచుంటి భారముగను 30
క. సతతము శ్రీహరి నుతులతొ
ప్రతి గేహముచెంత బిక్ష ప్రార్ధించడుగన్
యతితక్కు వొచ్చుభిక్షతొ
సతిసుతులతొబ్రతుకుచుందు సతమతమౌచున్"31
క. విప్రు0డాడిన మాటలు
విప్రోత్తమ వేషధారి విష్ణుడు వినియున్
విప్రుని కావగ దలచియు
'విప్రా ! చింతించ వలదు విను'యంచనియన్ 32
ఆ. "నీదు పేదతనము నిస్సేషముగ బోవ
దివ్య వ్రతము నొకటి తెలియ సేతు
యాచరించ దాని యాత్మ సాక్షిగ నీవు
పొందగలవు యిలను భూరిసుఖము 33
ఆ. అదియె నరునికిచ్చు యాముష్మికంబును
అదియె నరునికిచ్ఛు యాత్మశాంతి
యెయ్యది హరి దొల్లి యెఱిగించె , నయ్యదే
సత్య దేవు దివ్య సద్వ్రతంబు 34
తే. విష్ణుదేవుని దివ్యమౌ వేఱు రూపె
సత్యనారాయణస్వామి సత్త్వరూపు
సత్యదేవుని మనసార సన్నుతించ
సకల కోర్కెలు దీరును సర్వులకును 35
క. వేగమె పేదరికంబును
పోగొట్టగ జాలునట్టి పుణ్య వ్రతంబున్
రాగముతో గృహ మందున
జాగించుక సేయకుండ సల్పుము భక్తిన్ " 36
ఆ. విప్ర వేష ధారి విష్ణుడా విధముగ
పేదబ్రాహ్మణునకు ప్రియము తోడ
సత్యవ్రతమువిధిని సంపూర్ణముగ జెప్పి
మహిమ తోడ యపుడు మాయ మయ్యె 37
తే. వృద్దవిప్రుని మాటలు విశ్వసించి
సత్యనారాయణస్వామి సద్వ్రతమును
చేతు రేపని మనమందు చెప్పి కొనియు
విప్రవర్యుడు నిద్రించె వీడి చింత 38
సశేషము….
✍️ గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి