16, ఏప్రిల్ 2021, శుక్రవారం

భగవంతుణ్ణి పొందాలంటే

 మనం భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా, ఏదో బాహ్యంగా పైపైన చేస్తూఉంటాము. బయటకు మాత్రం "ఓ భగవాన్! నేను నీ దాసుడను, నాకు నీవుతప్ప వేరే దిక్కులేదు"అంటూ ఉంటాము. కాని మన ప్రవర్తన అందుకు విరుధ్ధముగా ఉంటుంది.


మనస్సు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనస్సు, మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం ?. 


మనం బయటకు ఏం మాట్లాడుతామో, మన మనస్సులోని ఆలోచనలు కూడా అదేవిధంగా ఉండాలి. 

అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. 

భగవంతుని నామం, ఆయన రూపం వేరుకాదు .


భగవన్నామస్మరణలో ఆనందం అధికమౌతుంది. ఆయన ప్రేమమయుడు. ఆనందమయుడు.ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాము .

        సాధారణంగా మన మనస్సు నానా విషయాల పట్ల పరుగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనస్సును నియంత్రించి భగవంతుని పై కేంద్రకరించడానికి ప్రయిత్నించాలి....!


సూదిబెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒక్కటిగా చేయాలి. దారపుపోగులు విడివిడిగా ఉంటే సూదిబెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం"


అలాగే భగవంతుని యందు మనస్సును నిమగ్నం చేయాలంటే బాహ్యవిషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రం చేయాలి


ఇంద్రియనిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు .

భగవంతుణ్ణి పొందాలంటే  పరితపించడమే పరమోత్తమ సాధన

కామెంట్‌లు లేవు: