ఆధ్యాత్మిక వేత్త,ప్రసిద్ధ ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు జన్మదినం నేడు. ఆసందర్భంగా వారికి శుభాకాంక్షలు. జననం 14 జూలై 1959
బ్రహ్మశ్రీ చాగంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. వీరు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. బ్రహ్మశ్రీచాగంటి సుందర శివరావు, శ్రీమతి సుశీలమ్మల పుణ్య దంపతులకు వీరు 1959 జూలై 14వ తేదిన జన్మించారు. కోటేశ్వరరావు గారి సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; వీరి ధారణ శక్తి, జ్ఞాపకశక్తి చెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.
మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని,, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు. వీరు ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు కానీ నెమ్మదిగా వాటినుంచి బయటపడ్డారు.
చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు. వీరికి ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. సామాన్య కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న, అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయినుంచే వారి విద్యాబుద్ధులు వికసించాయి.వారు యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.
వారి ధారణాశక్తి చాలా గొప్పది. ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం తన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.
వారు ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.
అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు. వారి స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు.
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు. "మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి. చేసిపెడతాను" అన్నారు పీవీ.
చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.
వారు బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998 లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వంటి వారి ఆవశ్యకత ప్రస్తుత మన తెలుగు సమాజానికి ఎంతేనా వుంది. ధర్మం గాడి తప్పుతున్న ఈ తరుణంలో మన హిందూ సంస్కృతీ, సంప్రదాయాలు, ఆచారాలు, దైవ చింతన తెలిపే మహానుభావుల దివ్య ప్రసంగాలు ఈ సమాజపు దారి తెన్నులు మర్చి హిందుత్వం వైపు సమాజాన్ని నడిపించే దిశగా పయనించాలిసిన అవసరం వుంది. ఇతర మతస్తులు మన మతాన్ని హీనంగా విమర్సిస్తూవుంటే వారి విమర్శలను ఎదుర్కొనే శక్తి ప్రతి హిందువుకు కావలి. అప్పుడే మనం మత మార్పులను ఎదుర్కోగలుగుతాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి