15, జులై 2020, బుధవారం

ముచ్చటైన కుండ

        ఒక ఊరిలో ఒక కుమ్మరి ఉండేవాడు. కుమ్మరి అంటే తెలుసు కదా... మట్టితో మన ఇంటికి కావలసిన వస్తువులను తయారుచేసేవారిని కుమ్మరి అంటారు. ఒకసారి ఆ కుమ్మరి  చాలా కుండలు చేశాడు. వాటిని సంతలో అమ్మడానికి బైలు దేరాడు. దారిలో ఆకలయితా వుంటే ఒకచోట కుండలు దించి అన్నం తినసాగాడు.
అప్పుడు ఒక అందమైన రంగురంగుల కుండ అక్కడినుంచి దొర్లుకుంటా... దొర్లుకుంటా చాలా దూరం పోయింది. కుమ్మరి అది గమనించలేదు. అన్నం తిని మిగతా కుండలు తీసుకొని వెళ్ళిపోయాడు.
కొంచెం సేపటికి ఒక ఈగ ఎగురుకుంటా ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ... ఎంత బాగుంది ఈ ముచ్చటైన కుండ. ఇదే ఇప్పటినుంచీ నా ఇల్లు” అనుకొంది. 
“లోపల ఎవరయినా ఉన్నారా” అని గట్టిగా అరిచింది ఈగ. ఏమీ శబ్దం రాలేదు. దాంతో సంబరంగా ఎగురుకుంటా లోపలికి పోయింది. 

కాసేపటికి ఒక కప్ప ఎగురుకుంటా ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ... ఎంత ముచ్చటగా ఉంది ఈ రంగురంగుల కుండ. ఇలాంటి అందమైన దానిలో నివాసిస్తే ఎంత బాగుంటుంది” అనుకొంది.
 “లోపల ఎవరయినా ఉన్నారా” అని అడిగింది. “నేనున్నా... నేనున్నా” అంటూ అరిచింది లోపల నుంచి ఈగ. “నేనుగూడా లోపలికి వద్దునా” అని అడిగింది కప్ప. “దా... దా... ఇద్దరమూ కలిసే వుందాం. చాలా స్థలముంది” అంది ఈగ. కప్ప సంబరంగా ఎగురుకుంటా లోపలికి పోయింది.
కాసేసటికి ఒక ఎలుక ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ ఎంత బాగుంది ఈ కుండ. చూస్తేనే మనసుకు ఇంత హాయిగా ఉంది. ఇక దీనిలోనే వుంటే ఇంకెంత బాగుంటుందో” అనుకొంది.
“లోపల ఎవరయినా ఉన్నారా” అని అడిగింది. 
“మేమున్నాం... మేమున్నాం” అంటూ అరిచాయి ఈగ, కప్ప. “నేనుగూడా లోపలికి వద్దునా.మీతో ఉండనిస్తారా” అని అడిగింది ఎలుక. 
“దా... దా... ముగ్గురమూ కలిసే వుందాం” అన్నాయి ఈగ, కప్ప. ఎలుక సంబరంగా లోపలికి పోయింది. 
కాసేపటికి ఒక నక్క ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ ఎంత బాగుంది ఈ రంగురంగుల కుండ. దీన్ని నా ఇల్లుగా చేసుకుంటే ఇంకెంతో బాగుంటుంది” అనుకొంది. “లోపల ఎవరయినా ఉన్నారా” అని అడిగింది. “మేమున్నాం... మేమున్నాం ...” అంటూ అరిచాయి ఈగ, కప్ప, ఎలుక. “నేనుగూడా లోపలికి వద్దునా” అడిగింది నక్క.
“వద్దొద్దు. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. ఇందులో పట్టవు. అన్నాయి కప్ప, ఎలుక, ఈగ. నక్క కోపంగా నన్నే లోపలికి రావద్దు అంటారా... ఎంత థైర్యం మీకు అంటూ కుండలోపలికి పోబోయింది. కానీ నక్క కుండకన్నా పెద్దగా వుంటుంది గదా... దాంతో అది అడుగు పెట్టగానే కుండ ఫక్కున పగిలిపోయింది.
ఈగ , ఎలుక , కప్ప బాధతో మరో అందమైన ఇంటిని వెతుక్కుంటా బైలు దేరాయి. మీకు ఎక్కడైనా మంచి రంగురంగుల ఇల్లు కనబడితే పాపం వాటికి చెప్పండి. వెదికీ వెదికీ అలసిపోతున్నాయి.
********

ఏది గుడ్డిది 
**********
     ఒక రైతు దగ్గర ఒక ఆవు వుండేది. ఒక రోజు ఒక దొంగ దాన్ని ఎత్తుకొని పోయాడు. రైతు చాలా బాధపడ్డాడు. ఇంటిలో పాలకు ఇబ్బంది అయింది. ఇంకొక ఆవును కొందామని పక్క ఊరిలో జరుగుతున్న సంతకు పోయాడు. ఆ దొంగకూడా అదే సంతకు దొంగతనం చేసిన ఆవును అమ్మడానికి తెచ్చాడు. అవును చూడగానే రైతు అది తనదే అని కనుక్కున్నాడు. కానీ ఆ దొంగ ఆ ఆవు తనదే అన్నాడు. ఇద్దరూ ఆవు నాదంటే నాదని గొడవ పడడంతో జనాలంతా చుట్టూ గుంపుగా చేరారు.

 అంతలో రైతు ఛటుక్కున ఆవు రెండు కళ్ళు మూసేసి 'ఈ ఆవు నీదే అయితే దీని రెండు కళ్ళలో ఏది గుడ్డిదో చెప్పుకో చూద్దాం' అన్నాడు. దొంగకు ఎంత ఆలోచించినా ఏ కన్ను గుద్దిదో తెలియలేదు. సరే ఏమైతే అదే కానీ ఒక రాయి విసిరి చూద్దాం అని  'కుడివైపుది' అన్నాడు. రైతు 'కాదు' అన్నాడు. వెంటనే దొంగ తడబడుతూ కుడి వైపుది కాదు, ఎడమ వైపుది. తొందరపాటులో మరిచిపోయా అన్నాడు. రైతు జనాల వైపు తిరిగి “అయ్యలారా ! నిజానికి దీని రెండు కళ్ళూ బాగానే వున్నాయి. దొంగను పట్టించడానికే ఒక కన్ను గుడ్డిదని చెప్పాను. కావాలంటే చూడండి" అని చేతులు తీశాడు.

జనాలంతా ఆవు వంక చూశారు. రైతు చెప్పినట్టే ఆవు రెండు కళ్ళూ బాగున్నాయి. దాంతో వాళ్ళు దొంగను మెత్తగ తన్ని ఆవును రైతుకు అప్పగించారు
**********
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

కామెంట్‌లు లేవు: