15, జులై 2020, బుధవారం

చిట్టికథ

ఒక మహారాజుకి సకల భోగాలు అనుభవిస్తున్నా తెలియని అసంతృప్తి వెంటాడుతుండేది. ఏదో వెలితి బాధ పెడుతుండేది. అదే వ్యాకులతతో రోజూ సాయంకాలం తన ప్రాసాదంపై ఒంటరిగా పచార్లు చేస్తుండేవాడు.

అలా నడుస్తూ దూరంగా ఓ పూరి గుడిసెలో కుండలు చేసుకుని కాలం గడుపుతున్న ఓ పేద కుటుంబాన్ని గమనిస్తుండేవాడు.

పైకి సామాన్యంగా సాగిపోతున్నా ఆ కుమ్మరి కుటుంబంలో ఏదో తెలియని ఆనందం తాండవిస్తున్నట్లు మహారాజుకు అనిపించింది. ఎలాగైనా ఆ ఆనందం రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడాయన.

మరుసటి రోజు చీకటి పడుతున్న వేళ మహారాజు మారువేషంలో ఆ కుమ్మరి ఇంటి తలుపు తట్టాడు.

అనుకోని అతిథి వచ్చినా, ఆ కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. సపర్యలు చేశారు. ఉన్నదాంట్లోనే మంచి ఆతిథ్యమిచ్చారు.

అప్పుడా మహారాజు ఇంటి యజమానితో, ‘నేనెవరో తెలియకపోయినా ఆత్మీయంగా ఆదరించారు. నేను పక్క ఊరిలో శ్రీమంతుణ్ణి. నా దగ్గర డబ్బుకు కొదవలేదు. ఇదిగో ఈ కానుక తీసుకోండి’ అంటూ వజ్రాల హారాన్ని బహూకరించబోయాడు.

వెంటనే ఆ కుమ్మరి చిరునవ్వుతో ‘మీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ రోజూ కష్టానికి తగ్గట్టుగా సంపాదించుకుంటూ, అందులోనే ఆనందాన్ని వెదుక్కుంటున్న మా జీవితాలను ఈ  బహుమతి కకావికలం చేస్తుంది. లేనిపోని ఆశలను ప్రేరేపిస్తుంది. కొత్త కోరికలవైపు పరిగెత్తిస్తుంది. కుండల అమ్మకంలో నా ఆదాయం పెరిగితే సంతోష పడతాం. తప్ప ఇలా కాదు. ఆకస్మికంగా వచ్చిపడే సంపద తృప్తి కన్నా అపరిమిత దుఃఖాన్ని తెచ్చి పెడుతుంది.’ అని చెప్పాడు.

అలా మహారాజుకు కొత్త పాఠాన్ని నేర్పాడా కుమ్మరి.

ఉన్నదానితో తృప్తిపడేవాడు రాజులా ఉండగలడు .

భోగో యస్య సదాహేయ: ప్రియ: స్యాత్‌ నిత్య మస్తిత:

ససర్వ మంగళో పేతోపి అవశ్యం స్యాదంకిచన:* 

భోగము అనగా సుఖమును అనుభవించవలెను అని కోరిక. భోగము ఎంత ఇష్టమైననూ అది శాశ్వతము కాదు కావున దానిని విడువవలెను. భోగమును బాగా అనుభవించవలెనన్న కోరిక కలవారు సకల శుభములు, సంపదలు కలవారైననూ ఏమీ లేనివారే అగును. 

ఉన్నదంతా అనుభవించాలన్న కోరికతో అనుభవించడం మొదలుపెడితే అన్ని సంపదలు తొలగిపోతాయి.

 అనుభవించేది తృప్తి కొరకే కావున ఒకసారి తృప్తి పొందిన వారు మరల కావాలని అర్రులు చాస్తూ తపిస్తూ ఉంటే అన్ని ఉన్నా లేనివారే అగుదురు.

 భోగాని కి, సంపదకు తృప్తి పరమావధి. ఆ తృప్తి లేనివాడు సంపదలు ఉన్నా లేనివాడే.

కామెంట్‌లు లేవు: