23, జులై 2020, గురువారం

*అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ప్రథమాధ్యాయము*

*మన్వంతరముల వర్ణనము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ఋషేస్తు వేదశిరసస్తుషితా నామ పత్న్యభూత్|*

*తస్యాం జజ్ఞే తతో దేవో విభురిత్యభివిశ్రుతః॥6346॥*

ఆ మన్వంతరమున వేదశిరుడు అను ఋషివలన అతని పత్నియైన  తుషిత యందు భగవంతుడు అవతరించి, విభువు అను పేరుతో ప్రసిద్ధిగాంచెను.

*1.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అష్టాశీతిసహస్రాణి మునయో యే ధృతవ్రతాః|*

*అన్వశిక్షన్ వ్రతం తస్య కౌమారబ్రహ్మచారిణః॥6347॥*

అతడు తన జీవిత పర్యంతము బ్రహ్మచర్యవ్రతమును పాటించెను. అతని ఆచరణనుండి శిక్షణను పొందిన ఎనుబది ఎనిమిదివేల మంది ఋషులుగూడ వ్రతనిష్ఠతో బ్రహ్మచర్యమును పాటించిరి.

*1.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతసుతో మనుః|*

*పవనః సృంజయో యజ్ఞహోత్రాద్యాస్తత్సుతా నృప॥6348॥*

ప్రియవ్రతుని కుమారుడైన ఉత్తముడు మూడవ మనువు. అతనికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలగు కుమారులు కలిగిరి.

*1.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*వసిష్ఠతనయాః సప్త ఋషయః ప్రమదాదయః|*

*సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇంద్రస్తు సత్యజిత్॥6349॥*

ఆ మన్వంతరమున వసిష్ఠునకు ప్రమదుడు మొదలగు ఏడుగురు సప్తర్షులు సుతులుగా జన్మించిరి. సత్యుడు, వేదశ్రుతుడు, భద్రుడు అనువారు దేవతలలో ప్రముఖులు. సత్యజిత్తు అనువాడు ఇంద్ర పదవిని చేపట్టెను.

*1.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*ధర్మస్య సూనృతాయాం తు భగవాన్ పురుషోత్తమః|*

*సత్యసేన ఇతి ఖ్యాతో జాతః సత్యవ్రతైః సహ॥6350॥*

ఆ సమయమున ధర్ముని పత్నియైన  సూనృతయందు ఫురుషోత్తముడైన  భగవంతుడు సత్యసేనుడు అను పేరున అవతరించెను. అతనితో గూడి సత్యవ్రతులు అను దేవతలుగూడ ఉండిరి.

*1.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*సోఽనృతవ్రతదుఃశీలానసతో యక్షరాక్షసాన్|*

*భూతద్రుహో భూతగణాంస్త్వవధీత్సత్యజిత్సఖః॥6351॥*

ఆ సమయమున భగవంతుడు, ఇంద్రుడగు సత్యజిత్తునకు మిత్రుడై, అసత్యపరాయణులును, దుశ్శీలురును, దుష్టులును ఐన యక్షరాక్షసులను, జీవ ద్రోహులైన భూతగణములను సంహరించెను.

*1.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*చతుర్థ ఉత్తమభ్రాతా మనుర్నామ్నా చ తామసః|*

*పృథుః ఖ్యాతిర్నరః కేతురిత్యాద్యా దశ తత్సుతాః॥6352॥*

తామసుడు అనువాడు నాల్గవ మనువు. అతడు మూడవ మనువైన ఉత్తమునకు సోదరుడు. అతనికి పృథువు, ఖ్యాతి, నరుడు, కేతువు మొదలగు పదిమంది సుతులు కలిగిరి.

*1.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*సత్యకా హరయో వీరా దేవాస్త్రిశిఖ ఈశ్వరః|*

*జ్యోతిర్ధామాదయః సప్త ఋషయస్తామసేఽన్తరే॥6353॥*

సత్యకుడు, హరి, వీరుడు అనువారు దేవతలలో ముఖ్యులు. ఆ మన్వంతరమున త్రిశిఖుడు అనువాడు ఇంద్రుడు. జ్యోతిర్ధాముడు మొదలగువారు సప్త ఋషులుగా ఉండిరి.

*1.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*దేవా వైధృతయో నామ విధృతేస్తనయా నృప|*

*నష్టాః కాలేన యైర్వేదా విధృతాః స్వేన తేజసా॥6354॥*

మహారాజా! ఆ తామస మన్వంతరమున విధృతికి పుత్రులై వైధృతులు అను దేవతలు గూడ ఉండిరి. వారు కాల ప్రభావమున నష్టప్రాయమైన వేదములను తమ శక్తిద్వారా రక్షించిరి. అందువలన వారు *వైధృతులు*- అని ప్రసిద్ధిగాంచిరి.

*1.30 (ముప్పదియవ శ్లోకము)*

*తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధసః|*

*హరిరిత్యాహృతో యేన గజేంద్రో మోచితో గ్రహాత్॥6355॥*

ఆ మన్వంతరమున హరిమేధుడు అను ఋషివలన హరిణి అను పేరుగల అతని పత్నియందు భగవంతుడు *హరి* యను పేర అవతరించెను. ఈ అవతారమున గజేంద్రుని మొసలి బారినుండి భగవంతుడు రక్షించెను.

*రాజోవాచ*

*1.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్ఛామహే వయమ్|*

*హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్॥6356॥*

*పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను* శుకమహర్షీ! భగవంతుడైన శ్రీహరి గజేంద్రుని మొసలి పట్టునుండి ఎట్లు విడిపించెనో నేను వినగోరుచున్నాను.

*1.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*తత్కథా సుమహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభమ్|*

*యత్ర యత్రోత్తమశ్లోకో భగవాన్ గీయతే హరిః॥6357॥*

ఆ గజేంద్ర మోక్షణ వత్తాంతము అన్ని కథలలో ఉత్తమమైనది, అది పవిత్రము, ప్రశస్తము, శుభ ప్రదము. మహాత్ములు ఆ కథను గానము చేయుచు శ్రీహరిభగవానుని పవిత్రకీర్తిని ప్రశంసింతురు కదా!

*సూత ఉవాచ*

*1.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*పరీక్షితైవం స తు బాదరాయణిః  ప్రాయోపవిష్టేన కథాసు చోదితః|*

*ఉవాచ విప్రాః ప్రతినంద్య పార్థివం  ముదా మునీనాం సదసి స్మ శృణ్వతామ్॥6358॥*

*సూతుడు వచించెను* శౌనకాదిమహర్షులారా! పరీక్షిన్మహారాజు శ్రీహరి కథలను వినుటకై ప్రాయోపవేశమునకు పూనుకొనెను. ఆ మహారాజు శ్రీశుకమహర్షిని ఇట్లు ప్రశ్నించగా ఆ మునీశ్వరుడు సంతోషించి, అతనిని అభినందించెను. పిమ్మట మహర్షులసభలో గజేంద్రమోక్షణ కథను వినిపించసాగెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ప్రథమోఽధ్యాయః (1)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ప్రథమాధ్యాయము (1)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: