రాముడికి ఎవరు సహాయం చేస్తారు?
.
మీరంతా రావణ సంహారం జరగాలని కోరుకున్నారు . విష్ణువు దశరధమహారాజు కొడుకుగా జన్మించాడు ,మరి రావణుని తో జరిగే పోరాటంలో ఎవరు పాల్గొంటారు?
.
ఆయన సైన్యం ఎవరు? విష్ణువుకు సైన్యసహకారం ఎవరిస్తారు?
ఆందరు దేవతల మదిలో ఈ ఆలోచన పుట్టించి వారిని ప్రేరేపించాడు బ్రహ్మదేవుడు .
.
ఒకప్పుడు రావణాసురుని నందీశ్వరుడు శపించాడు!
నీకు వానరుల(కోతుల)వలన భయం కలుగుగాక ! అని
.
ఈ శాపాన్ని తమకు వరంగా మార్చుకోవాలనుకున్నారు ! దేవతలంతా!.
.
దేవతలంతా వానర స్త్రీల యందు మహాబలశాలురయిన పుత్రులుగా జన్మించారు!
.
అంతకుఎన్నో ఏళ్ళ పూర్వమే జాంబవంతుడు బ్రహ్మదేవుడి ఆవులింతనుండి జన్మించాడు.
.
ఋషులు,సిద్ధులు,విద్యాధరులు, ఉరగులు,చారణులు దివ్యశక్తులు కలవారంతా తమతమ కుమారులుగా వీరాధివీరులైన వానరులను సృజించారు.
.
దేవేంద్రుడు వాలిని,
సూర్యుడు సుగ్రీవుని,
దేవగురువు బృహస్పతి తారుడు అనే బుద్ధిశాలి అయిన వానరుడిని,
కుబేరుడు ; గంధమాధనుని
విశ్వకర్మ : నలుడిని
అగ్ని : నీలుడిని
అశ్వనీ దేవతలు : మైంద ,ద్వివిదులను
వరుణుడు : సుషేణుడిని
పర్జన్యుడు: శరభుని
వాయుదేవుడు ,శ్రీమంతుడు,వీర్యవంతుడు,వజ్రమయ దేహముగలవాడు,గరుత్మంతునితో సమానవేగము గలవాడు ,శత్రుభయంకరుడు అయిన హనుమంతుని సృజించాడు.
.
ఏ దేవుడికి ఏ రూపము,ఏ వేషము ,ఏ పరాక్రమము ,ఏ తేజస్సు ఉండెనో ముమ్మూర్తులా అవే లక్షణాలతో అనేక కోట్ల వానరులు జన్మించారు!.
.
ఈ వానరులంతా కూడా అమితబల సంపన్నులు !
యుద్ధంలో పెద్దపెద్ద కొండల వంటి రాళ్లు శత్రువుల మీద విసిరివేయగలరు,మహా వృక్షాలు వేళ్ళతో సహా పెకిలించి వైరివీరులను చావచితక కొట్టగలరు!
సముద్రాలను కలియబెట్టగలరు,భూమిని నిట్టనిలువుగా చీల్చివేయనూగలరు!
అరణ్యాలలో స్వేచ్చగా తిరిగే మదగజాలను ( ఏనుగులు) పిల్లిపిల్లల్లా చంకనవేసుకొని తిరుగగలరు!
వారి సింహనాదాలకు ముల్లోకాలు కూడా కంపించి పోతాయి!
.
ఇలాంటి లక్షణాలున్న వానరవీరులంతా రామసహాయార్ధము భూమినిండా జన్మించి ఉన్నారు!.
.
అక్కడ అయోధ్యలో రాముడు శుక్లపక్ష చంద్రునివలే దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు! ఆయన చేసే అల్లరికి అంతేలేకుండా ఉన్నది ! ఆయన ఏమిచేసినా ఆ తండ్రికి మురిపెమే !
రారా నారామా ! అని గుండెలమీద కొడుకుని పరుండపెట్టి అంత పెద్ద మహారాజు తాను కూడా చిన్నపిల్లవాడై వయసుమరచి,రాజునని మరచి కొడుకుతో ఆటలు ,పాటలు.
.
రాముని విడిచి ఒక్క క్షణముండలేని మరో ప్రాణి కూడా ఉంది అయోధ్య లో ! ఎవరో కాదు లక్ష్మణస్వామి ఆయన !
రాముడి నీడ ఎలా ఉంటుంది ? అని అడిగితే ఇదిగో ఇలా ఉంటుంది అని లక్ష్మణుడి వైపు వేలెత్తి చూపటం అలవాటు చేసుకున్నారు అయోధ్యానగరవాసులు!
ఇక అన్నగారికి తమ్ముడంటే పంచప్రాణాలు సౌమిత్రి ప్రక్కనలేనిదే ఈయనగారు ఏ పనీ చేయరు ! అన్నం తినడు! ఆఖరుకు నిద్రపోవాలన్నా ప్రక్కన తమ్ముడు ఉండవలసినదే!
అదేవిధంగా మరొక జంట భరతశత్రుఘ్నులు
ఇలా నలుగురు కుమారులు ఆయన ఆనందాన్ని పెంపొందిస్తూ ఉండగా కాలం ఎలా గడచిపోతున్నదో తెలియరావటం లేదు దశరధమహారాజుకు!.
.
ఆ కుమారులు నలుగురూ కూడా ధనుర్విద్యలో అపారపాండిత్యం సంపాదించారు,వేదవేదాంగాలు వారికి కరతలామలకం!
తల్లిదండ్రులను,పెద్దలను సేవించటంలో వారితరువాతనే ఎవరైనా,
సకలసద్గుణాలతో శోభిల్లే వరాల మూటలు దశరధతనయులు!.
.
కాలమిలా గడుస్తుండగా ఒకరోజు!
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి