21, జనవరి 2023, శనివారం

క్రియా శీలకత్వమే లక్ష్మీదేవి

 క్రియా శీలకత్వమే లక్ష్మీదేవి నివాసాలు ఇది వినటానికి ఆశ్చర్యంగా కనిపిస్తున్నది కదా కానీ ఇది ముమ్మాటికీ నిజం. ముందుగా త్రిమూర్తులను గూర్చి తెలుసుకుందాము. మొదటగా బ్రహ్మగారు ఆయనగారు సృష్టి రచన చేస్తారు అది మనందరికీ తెలుసు. ఆయన ధర్మపత్ని సరస్వతీదేవిగారు అమ్మగారు చదువుల తల్లి. సృష్టి రచనచేయటానికి కావలసింది జ్ఞ్యానం అందుకే ఆయనకు సహధర్మచారిణిగా వున్న తల్లి చదువుల తల్లి,  తరువాత విష్ణుమూర్తిగారు ఆయన స్థితికారకుడు అంటే బ్రహ్మ సృష్టించిన సృష్టిని నిర్వహించే (మేనేజ్)  దేముడు ఒక సంస్థానిర్వహించాలంటే కావలసింది ధనం అంటే సంపద కాబట్టి ఆయనగారి ధర్మపత్ని లక్ష్మీదేవిగారు ఆ తల్లి సకల సంపదలకు కారకురాలు. ఇక మూడవ దేవుడు పరమశివుడుగారు ఆయన పని లయకారకుడు అనగా సృష్టిని నశింపచేయటం అట్లా చేయాలంటే కావలసింది శక్తీ శక్తిలేకుండా వినాశనం జరగదు అది మనందరికీ తెలుసు అందుకే ఆ దేవదేవుడు పత్ని పార్వతీదేవి ఆ తల్లి శక్తి స్వరూపిణి. ఇటువంటి క్రమాన్ని మనకు అందించిన వేదాలు, మన మహర్షులు ఎంతటి మేధావులొకదా 

యతిభావం తత్ భవతి అనే ఆర్యోక్తి ననుసరించి మనం ఏ దేవుడిని లేక ఏదేవతను ఆరాధిస్తామో ఆ దేవీదేవతలు మనకు ప్రసన్నలై వారి ఆధిపత్యంలో వున్న శక్తిని మనకు  ప్రసాదిస్తారు. అంటే చదువు కొరకు సరస్వతి అమ్మవారిని, సంపదలకొరకు లక్ష్మి అమ్మవారిని అదేవిధంగా శక్తికొరకు పార్వతి తల్లిని మనం కొలవటం కద్దు. 

ప్రతి పురుషుని ప్రయోజకత్వంలో తన ధర్మపత్ని సహాయసహకారాలు ఉంటాయి అంతేకాదు నడిపేశక్తి కేవలం అంటే కేవలం స్త్రీమూర్తిదే అదే మనం మనదేవుళ్ల ద్వారా తెలుసుకోవచ్చు. 

ఇక విషయానికి వస్తే క్రియాశీలత్వము అంటే ఒక కార్యం చేయాలనే భావన ఆ భావనే మనం లక్ష్మి అమ్మవారుగా భావించవచ్చు అదెట్లాగో తెలుసుకుందాం. 

నీవు నీ ఇంటిని వదిలి ఏదో ఊరుకు వెళ్లి కొంతకాలం తరువాత తిరిగి వచ్చావు అప్పుడు తలుపు తీయంగానే ఇల్లు మొత్తం దుమ్ము దూళితో పేరుకొని వుంది నీ శ్రీమతి వెంటనే మీరు కాసేపు బయట వుండండి ముందు ఇల్లు ఊడుస్తాను అని అనటం పరిపాటి.  ఇల్లు ఊడవాలి అనే భావనే క్రియాశీలత్వం దానిని అమలు చేసినతరువాతే అంటే ఊడ్చిన తరువాతే ఇల్లు పరిశుభ్రంగా వున్నది. ఇటువంటివి కోకొల్లలుగా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మనధర్మంలో గృహిణిని గృహలక్ష్మి అని పేర్కొన్నారు అని అనిపిస్తుంది. 

ఫలానా వారి అబ్బాయికి పెండ్లి అయిందిగా వాళ్ళ కోడలిని చూసావా యెట్లా ఉంటుంది అని ఒకామె అడిగితె దానికి ఆమె స్నేహితురాలు ఇచ్చే జవాబు అమ్మాయి చక్కగా వుంది సాక్షాత్తు లక్షిం దేవిలా వుంది అనటం మనం చూస్తూ ఉంటాము.  నిజానికి ప్రపంచంలో ఎవ్వరు లక్ష్మి అమ్మవారిని చూడలేదు మరి ఎలా అలా అంటారు అంటే మనం లక్ష్మి అమ్మవారికి కొన్ని గుణాలను ఉంటాయి అని తెలుసుకున్నాము కాబట్టి అటువంటి సద్గుణాలు వున్న స్త్రీలను ఆ తల్లితో పోలుస్తూవుంటాము. 

ప్రతి గృహస్తు తన దైనందిక జీవితాన్ని సుఖవంతంగా గడపటానికి ఏ ఉద్యోగమో, వ్యాపారమో చేయక తప్పదు. గడియారం ముల్లులాగా పరిగెత్తక తప్పదు అందుకే లక్ష్మీదేవిలాంటి సహధర్మచారిణి లభించి ప్రతి విషయంలోనూ తన క్రియాశీలకత్వాన్ని చూపెడితే ఆ పురుషుడు పురుషార్ధాలను సాధించగలడు. 

భర్త ఏదైనా కార్యార్థిగా వెళుతుంటే తన కార్యం సఫలంకావాలనే ఆపేక్షతో పత్నిని ఎదురు రమ్మనటం మన సాంప్రదాయం దానికి అర్ధం తన భార్య లక్ష్మి దేవిలాగా చక్కగా నుదిటిన కుంకుమ దిద్దుకొని, కురుల పువ్వులు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని మనోహారిగా ఉన్న భార్య ముఖకమలం చూసి తన కార్యోన్ముఖుడు అయితే ఆ రోజంతా మనస్సు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండి తానూ చేసే పనిమీద మనసు లగ్నాత చేయగలడు. తత్వారా కార్యసిద్ధి కలుగుతుంది. మన సాంప్రదాయంలో స్త్రీలకు మహోన్నత స్థానాన్ని ఇచ్చారు 

యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..' అంటే ఎక్కడ నారీ మణులు పూజింప బడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని.. భారత్‌లో పురాణాలు, ధర్మ శాస్త్రాలు చెప్పాయి. మన భారతీయ సంస్కృతీ స్త్రీ శక్తిని వేదకాలంలోనే పేర్కొన్నాయి. పురుషుని అభివృద్ధికి స్త్రీమూర్తే కారణం అదేవిధంగా స్త్రీ పౌభాగ్యానికి పురుషుడు కారకుడు. 

లక్ష్మి నివాసాలు 

గురు భక్తి .దేవ భక్తి .మాతాపితృ భక్తి .కలవారిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
అతి నిద్ర లేని వారిలో. ఉత్సాహం .చురుకుదనం. ఉన్నవారిలో లక్ష్మీకళ ఉంటుంది.
ముగ్గు. పసుపు .కుంకుమ. పువ్వులు .పళ్ళు .పాలు లక్ష్మి స్థానాలు.
దీపం .ధూపం .మంగళ ద్రవ్యాలు .ఆ తల్లికి నివాసాలు.
పాత్ర శుద్ధి శుభ్ర వస్త్రధారణ కలిగిన ఇల్లు అమ్మవారి నివాస స్థలం.
బుద్ధి .ధైర్యం .నీతి .శ్రర్థ.గౌరవించే స్వభావం .శాంతి. లక్ష్మి ని పెంచే శక్తులు.
సంతృప్తి లక్ష్మికి ప్రధాన నివాసం.

దీనిని పట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే లక్మి దేవి మంగళకారిని సకల శుభాలకు కారణం లక్షి అమ్మవారి ఆ తల్లి అంటే చురుకుదనం, ఉత్సాహం, సత్వగుణం, శాంత స్వభావం, నిజాయితీ, ధర్మాచరణ ఇటువంటి గుణాలు అంటే ఇవ్వన్నీ కూడా క్రియాశీలకత్వమే కానీ వేఱొక్కటి కాదు. భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి వారు క్రియాశీలకత్వాన్ని పెంపొందించుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించగలరు.  

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

 


కామెంట్‌లు లేవు: