*జనవరి 21 పుష్య అమావాస్య*
పుష్య అమావాస్యనే పౌష అమావాస్య అని కూడా అంటారు. హైందవంలో పుష్య మాసం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం పితృదేవతలకు అంకితం చేశారు. ఈరోజున పితృల పేరిట దానం చేయడంవల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌష అమావాస్య రోజున ఉపవాసం ఉండటంవల్ల పితృదోషం, కాలసర్ప దోషాలనుండి విముక్తి కలుగుతుంది. ఈరోజున పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. శుభకార్యాలకు పుష్యమాసం చాలా ముఖ్యమైనది. ఈనెలంతా సూర్యుడిని ఆరాధించడం వల్ల మీకు శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తే వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
వేకువఝామునే నదీస్నానం చేసి రాగి పాత్రలో మందార పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేసి శక్తి మేరకు దానం చేయండి. ఈరోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారు. ఈ రోజున చేపలకు పిండిని తినిపించడం శుభప్రదంగా భావిస్తారు.
పుష్య అమావాస్య రోజున చేయకూడని పనులు ఏమిటో శాస్త్రం వివరించింది. ఈ రోజున ఎవరినీ అగౌరవపరచకూడదు.
అబద్ధం చెప్పకూడదు. రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదు. మద్యం, మాంసాహారం తీసుకోకూడదు. అలాగే పుష్య అమావాస్య రోజున చేయవలసిన పనులు కూడా శాస్త్రం ఈ విధంగా చెబుతోంది. ఈ రోజున శ్రీకృష్ణుని పూజించాలి. గీతా పఠనం చేయాలి. పూర్వీకులను స్మరించుకోవాలి, పేదలకు బట్టలు, ఆహారం మొదలైన వాటిని దానం చేయాలి. రావి చెట్టుకు నీరు పోయాలి. రావి చెట్టు క్రింద దీపం వెలిగించాలి. వీలైతే ఈ రోజున రామి మొక్కను నాటడం శ్రేష్టం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి